అమెరికా అధ్యక్షునిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నెలరోజుల లోపుగానే హడావుడిగా అమెరికాకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా అమెరికా విషయంలో భారత్‌కు ఆందోళన కలిగిస్తున్న అంశాలు ఏవీ ప్రస్తావనకు రాకపోయినా ఈ సందర్భాన్ని ఎఫ్-35 యుద్ధ విమానాలను భారత్‌పై రుద్దే ప్రయత్నం అమెరికా చేసింది. తమ వాణిజ్య ప్రయోజనాలకోసం భారత్‌ను దారిలోకి తెచ్చుకునేందుకు ఈ సందర్భంగా ట్రంప్ గట్టిగా ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. సంభాషణలలో గట్టి పట్టు పట్టగలరని అంటూ ఒక వంక మోడీని పొగడ్తలతో ముంచెత్తుతూనే భారత్‌కు ఆందోళన కలిగిస్తున్న అంశాలు వేటిని ప్రస్తావింపకుండా, తమ దేశప్రయోజనాలను కాపాడుకునే విధంగా ట్రంప్ వ్యవహరించారని వారిద్దరి మధ్య జరిగిన భేటీ సరళి వెల్లడి చేస్తుంది.
ముఖ్యంగా అత్యంత వ్యయభరితమైన ఐదవ తరానికి చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాలను ఎలాగైనా భారత్‌కు కట్టబెట్టాలనే ఉద్దేశంతో వాటిని భారత్‌కు అమ్ముతున్నామని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు. ఈ విషయమై భారత్ ఏమీ మాట్లాడలేని సందిగ్ధతలో పడింది. ఇటీవలే ఈ యుద్ధ విమానాన్ని ‘పనికిమాలిన, చెత్త డిజైన్’ అంటూ ట్రంప్ సలహాదారు ఎలాన్ మస్క్ దుమ్మెత్తిపోశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెడుతూ చెత్తబుట్ట ఎమోజీని కూడా పంచుకున్నారు. సింగిల్ ఇంజను గల ఈ విమానం డిజైన్, నిర్మాణ బాధ్యతల రూపకర్తలను ‘ఇడియట్’ లుగా ముద్ర వేశారు. లాక్‌హీడ్ మార్టిన్ నిర్మించిన ఈ విమానాలు 2015లో అమెరికా మెరైన్ కారప్స్ సర్వీస్‌లో ప్రవేశించాయి.
ఆ తర్వాత సంవత్సరానికి అమెరికా వైమానిక దళంలో చేరాయి. కాలం చెల్లిన విమానాలంటూ మస్క్ ముద్ర వేసిన ఈ విమానాలను మోడీ ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చినట్లు కనిపిస్తున్నది. ట్రంప్ సూచనప్రాయంగా చెప్పినట్లుగా లాక్‌హీట్ మార్టిన్ సంస్థ గణనీయమైన సంఖ్యలో ఎఫ్-35 విమానాలను సరఫరా చేసే అవకాశముందని భావిస్తున్నారు. అవి కూడా ప్రభుత్వం నుండి ప్రభుత్వం మధ్య జరిగే విదేశీ మిలిటరీ సేల్స్ (ఎఫ్‌ఎంఎస్) మార్గం ద్వారా జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో భారత్ ప్రభుత్వం అనుసరిస్తున్న గోప్యత మన భద్రతా అంశాల పట్ల ఆందోళన కలిగిస్తున్నది. ఈ విమానాలు కావాలని భారత్ అడగలేదు.
ఈ విమానాల విషయమై కనీసం భారత వైమానిక దళాన్ని సంప్రదింపలేదు. ఈ విమానం లో 65 లోపాలు ఉన్నాయని పెంటగాన్ పేర్కొన్నది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ యుద్ధ విమానం ధర ఒకొక్కటి రూ. 968 కోట్లు. ఒక గంట తిరగాలంటే రూ. 38 లక్షలు ఖర్చు అవుతుంది. పైగా, సాంకేతిక బదిలీ లేదు. కనీసం ‘భారత్‌లో తయారు’ కింద మన దేశంలో తయారీ కూడా లేదు. ప్రధాని మోడీ చెబుతున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాన్ని నీరుగార్చే అంశం. ప్రధాని మోడీ, ట్రంప్‌తో భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఈ ఏడాది నుండి భారత్‌కు సైనిక విక్రయాలు పెంచనున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు.
అంతిమంగా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలను కూడా అందచేయడానికి మార్గం సుగమం చేస్తున్నామని కూడా ఆ సమావేశంలో ప్రకటించారు. అయితే భారత వైమానిక దళానికి సుదీర్ఘ కాలంగా అవసరమున్న 114 బహుముఖ యుద్ధ విమానాలు (ఎంఆర్‌ఎఫ్‌ఎ)ల్లో భాగంగా ఈ ఎఫ్ -35లు వస్తాయా? లేక వీటికోసం ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకుంటారా? అనేది తెలియరాలేదు. వైట్‌హౌస్ కానీ, అటు లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ కానీ ట్రంప్ ప్రకటనపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.ఈ యుద్ధ విమానాల కొనుగోలు విషయాన్ని కొట్టిపారేసే ధైర్యం చేయలేక, తక్కువ చేసి చూపే ప్రయత్నం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి చేశారు. ఇదింకా ప్రతిపాదన దశలోనే ఉందని దాటవేసే ప్రయత్నం చేశారు.
ఇంకా ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు తాను అనుకోవడం లేదంటూ చెప్పుకొచ్చారు. ఎఫ్-35 విమానాలు భారత వాయు సేనలో ఇమడలేవని, మన అవసరాలను అవి తీర్చలేవని సైనిక వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. దీనికి తోడు, అమెరికా రక్షణ పరికరాలకు సంబంధించి మరీ ముఖ్యం గా యుద్ధ విమానాలకు సంబంధించి చూసినట్లైతే వాటి నిర్వహణ, మోహరింపునకు సంబంధించి అనేకమైన షరతులు, ప్రోటోకాల్స్ వుంటాయని, అవన్నీ భారత్‌కు గుదిబండగా మారేఅవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోడీ తన స్నేహితుడిగా పేర్కొంటున్న ట్రంప్ మొదటి నుంచి తన ఆయుధ కర్మాగారాలకు మంచి బేరం తెచ్చేందుకే భారత్‌ను వాడుకుంటున్నారు.
రష్యా నుండి ఆయుధాల విషయంలో మన సంబంధాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. 2008 నుండి భారత్ అమెరికా నుంచి 20 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువగా ఆయుధాలు కొనుగోలు చేసింది. అమెరికా ఆయుధాలు ఎక్కువ ధర పలకటమే కాకుండా, సాంకేతిక బదిలీ ఉండదు. మరోవంక, రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకుంటామని ప్రకటించారు. భయపడుతున్నట్లు భారత్‌పై వెంటనే ట్రంప్ సుంకాలను పెంచకపోయినప్పటికీ, ఈ విషయమై రెండు దేశాల ప్రభుత్వాలు చర్చలు జరుపుతామని ప్రకటించడంతో ఇప్పటికి ఉపశమనం కలిగింది. అయితే భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అని పేర్కొనడం ద్వారా ట్రంప్ ఈ విషయంలో రాజీలేని వైఖరి అవలంబించే అవకాశం ఉంది. ఈ విషయమై నిర్దుష్టంగా ఎటువంటి చర్చలు జరిగిన దాఖలాలు లేవు.
ఈ సందర్భంగా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలు వసూలు చేస్తున్నట్లు ట్రంప్ ఆరోపించారు. వాస్తవానికి అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధంగా భారీగా సబ్సిడీలు ఇస్తుంది. దానితో కారు చవకగా భారత్ మార్కెట్‌లో గుమ్మరిస్తే మన వ్యవసాయానికి ప్రమాదకరం అవుతుంది. ఈ విషయమై మోడీ నోరు విప్పలేకపోవడం విచారకరం. ప్రస్తుతం రెండు దేశాల మధ్య 50 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. దీనిని భర్తీ చేసుకొనేందుకు భారత్ కు మరింత ఎక్కువగా చమురు, గ్యాస్ పంపుతామని ట్రంప్ ప్రకటించారు.
అంటే చమురు కొనుగోలు విషయం లో రష్యా, అరబ్ దేశాలపై భారత్ ఆధారపడటం తగ్గించి, అమెరికా నుండి ఎక్కువగా కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే అమెరికా నుండి సుమారు 15 బిలియన్ డాలర్ల చమురు కొనుగోలు చేస్తున్నాము. దానిని 25 బిలియన్ డాలర్లకు పెంచాలని అమెరికా కోరుకుంటుంది. అమెరికా నుండి చమురు కొనుగోలు చేయడం భారత్‌కు తీవ్రమైన భారం కాగలదు. రవాణా చార్జీలు అత్యధికంగా ఉంటాయి. రష్యా, అరబ్ దేశాల నుండి అంతకన్నా తక్కువగా చమురు మనకు అందుబాటులో ఉంది. ఈ విషయంలో అమెరికా ఒత్తిడులకు భారత్ లొంగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తున్నది. మరోవంక, ట్రంప్ సలహాదారుడు ఎలెన్ మస్క్‌తో జరిపిన చర్చలు సైతం భారత్ మార్కెట్ లో ప్రవేశం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాల దృష్ట్యా ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.
భారత్ పారిశ్రామిక వేత్త అదానీ పై అమెరికా కోర్టులో నడుస్తున్న విచారణను చూపి భారత్‌లో అనుచిత ప్రయత్నాలు పొందే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రధాని మోడీ అమెరికాలో జరిపిన రెండు రోజుల పర్యటనలో భారత్‌కు ఆందోళన కలిగిస్తున్న ఆందోళనను ప్రస్తావించే ప్రయత్నం చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. అమెరికాలో చట్టబద్ధమైన పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయులను అత్యంత అమానుషమైన రీతిలో ట్రంప్ స్వదేశానికి పంపించడంపై ఇక్కడ సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ట్రంప్‌తో భేటీ సమయంలో దీని గురించి మోడీ ప్రస్తావిస్తారని అందరూ భావించారు.
అది జరగలేదు. చట్టవిరుద్ధమైన వలసలను సమర్ధించబోమని ప్రకటించిన మోడీ వారిని స్వదేశంకు పంపే సమయంలో అంతర్జాతీయ ఒడంబడికలు, న్యాయసూత్రాలను అనుసరించి వ్యవహరించే బాధ్యతను ట్రంప్‌కు గుర్తుచేసే ప్రయత్నం చేయలేదు. కనీసం ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. మరోవంక, ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికాలో బహిరంగంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా గురూపత్వంత్ సింగ్ పన్నును బహిరంగంగా భారత్‌కు ‘ఉగ్రవాద హెచ్చరికలు’ జారీ చేస్తున్నారు. ప్రధాని మోడీ నుండి అందరినీ చంపుతానని బహిరంగ హెచ్చరికలు అమెరికా నుండి చేస్తుంటే అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
భారత్‌కు భద్రతాపరమైన సవాళ్లు విసురుతున్న బంగ్లాదేశ్‌లో ఇటీవలి పరిణామాలు అమెరికా కనుసన్నలలో జరుగుతున్నాయని స్పష్టం అవుతున్నది. అక్కడ ట్రంప్ అధికారంలోకి రాగానే బంగ్లాదేశ్ లో పరిస్థితులు మారతాయని ఆశించాం. అయితే ఈ విషయమై ప్రస్తుతం ట్రంప్ మౌనం వహిస్తున్నారు. కేవలం ‘బంగ్లాదేశ్‌పై నిర్ణయాన్ని మోడీకే వదిలేస్తున్నా..’ అంటూ ఈ విషయంలో తాను భారత్‌కు చేసెడిది ఏమీ లేదని స్పష్టం చేశారు. ఏ విధంగా చూసినా ప్రధాని అమెరికా పర్యటన భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా కనిపిస్తుంది.
– చలసాని నరేంద్ర