సామ్రాజ్యవాదానికి, యూరప్‌కు, నాటో సైనిక కూటమికి నాయకత్వం వహిస్తూ తద్వారా స్వప్రయోజనాల సాధనకోసం పని చేస్తుండిన అమెరికా దృష్టి, ట్రంప్ ఇపుడు రెండవసారి అధికారానికి రావటంతో తగినం త మారింది. ప్రపంచంలో అమెరికా ప్రాబ ల్యం క్రమంగా తగ్గుతున్నదని, అంతర్గతంగా కూడా సమస్యలు పెరుగుతున్నాయని గ్రహించిన ట్రంప్, అందుకు పరిష్కారంగా భావిస్తూ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు ఇచ్చారు. ఆ పద్ధతిలో రూపొందించే విధానాలు సమ స్యలకు పరిష్కారం కాగలవని నమ్మారు.
అంతా సవ్యంగా సాగితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నేడు (28 ఫిబ్రవరి) వైట్ హౌస్‌కు వెళ్ళి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమవుతారు. ఇరువురి మధ్య తుది చర్చల తర్వాత, ఇప్పటికే రెండు దేశాల అధికారులు కలిసి సిద్ధం చేసిన ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లో గల ఖనిజ నిక్షేపాలను అమెరికా పరం ఏ పద్ధతిలో చేయాలన్నది ఆ ఒప్పందంలోని సారాంశం.
ఒప్పందపు పూర్తిపాఠం 27వ తేదీ ఉదయాని కల్లా అమెరికన్ మీడియాలో వెల్లడైంది కూడా. మొత్తం 11 అంశాలు గల ఆ పాఠంలో అన్నీ ట్రంప్ డిమాండ్ చేస్తున్న ఖనిజ నిక్షేపాలకు సంబంధించినవే. 10వ అంశంలోని ఒకే ఒక వాక్యం మాత్రం “భద్రతా హామీల కోసం ఉక్రెయిన్ చేసే ప్రయత్నాలను అమెరికా బలపరుస్తుంది” అని చెప్తున్నది.అంతేతప్ప అధ్యక్షుడు జెలెన్ స్కీ పట్టుబట్టినట్లు అమెరికా నేరుగా ఎటువంటి రక్షణ హామీలు ఇవ్వటం లేదు. ఆ ఏర్పాట్లు ఏవో ఆయన యూరప్‌తోనే చేసుకోవాలన్న ట్రంప్ స్పష్టీకరణే ఇందులో ప్రతిఫలిస్తున్నది. మొత్తం మీద ఉక్రెయిన్ ‘పునర్నిర్మాణ పెట్టుబడి నిధి’ పేరిట జరుగుతున్న ఈ ఒప్పందం చెప్తున్నది, అక్కడి అన్ని రకాల ఖనిజాలు, చమురు వంటి ఇతర నిక్షేపాలపై రెండు దేశాలకు సరిసమాన యాజమాన్యాలు, సరిసమాన నిర్వహణాధికారాలు ఉంటాయి. ఆ వాటాలను పరస్పర అంగీకారంలేనిదే ఎవరూ మరెవరికీ విక్రయించే వీలుండదు.
వాటిని గమనించినపుడు, ట్రంప్ బుల్డోజర్ జైత్రయాత్ర పూర్తిగా తను కోరుకున్న విధంగా సాగుతున్నదనే అభిప్రాయం కలుగుతున్నది. ఒకసారి ఈ ఒప్పందపు నేపథ్యంలోకి వెళదాము. సామ్రాజ్యవాదానికి, యూరప్‌కు, నాటో సైనిక కూటమికి నాయకత్వం వహిస్తూ తద్వారా స్వప్రయోజనాల సాధనకోసం పని చేస్తుండిన అమెరికా దృష్టి, ట్రంప్ ఇపుడు రెండవసారి అధికారానికి రావటంతో తగినంత మారింది. ప్రపంచంలో అమెరికా ప్రాబల్యం క్రమంగా తగ్గుతున్నదని, అంతర్గతంగా కూడా సమస్యలు పెరుగుతున్నాయని గ్రహించిన ట్రంప్, అందుకు పరిష్కారంగా భావిస్తూ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు ఇచ్చారు. ఆ పద్ధతిలో రూపొందించే విధానాలు సమస్యలకు పరిష్కారం కాగలవని నమ్మారు. ఆ నినాదాల నిర్వచనాన్ని ఆయన చెప్పలేదు గాని, వాటి వల్ల నిజంగానే మేలు జరగగలదనుకున్న పలు అమెరికన్ తరగతులు తనకు ఓటు వేసి భారీగా గెలిపించాయి.
అప్పటి నుంచి ట్రంప్ తీసుకుంటూ వస్తున్న చర్యలు చూస్తున్నవే. అమెరికా మళ్లీ గొప్పది కావటం అంటే ఏమిటో, అది ఏ విధంగా జరుగుతుందని ఆయన అనుకుంటున్నారో నేటికీ వివరించలేదు గనుక అమెరికన్ ప్రజలకు గాని, బయటి ప్రపంచానికి గాని ఇదమిత్థంగా తెలియదు. తన చర్యలు వాటి ప్రభావాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ చర్యలు అంతర్గత విషయాలకు సంబంధించినవి అయినా, విదేశ వ్యవహారాలు అయినా ‘మాగా’ లక్షాల సాధనకు అవసరమన్నది తన యోచన. ఈ క్రమంలో, అమెరికా కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న విధానాలను మార్చుతున్నారు లేదా రద్దు చేస్తున్నారు. ఇందులో అవతలి పక్షం తమ ప్రత్యర్థులా లేక మిత్రులా అన్నది సైతం పరిగణనలోకి తీసుకోవటం లేదు. ‘మాగా’ మాత్రమే ఏకైక పరిగణన. అందుకోసం చతురోపాయాలను నిస్సంకోచంగా ప్రయోగిస్తారు. మిత్రులపై అయినా సరే. పనామా, గ్రీన్‌ల్యాండ్, కెనడాలు అందుకు ఉదాహరణలు. నాటోకు హెచ్చరికలు, యూరోపియన్ దేశాలన్నింటిపై ఒత్తిడులు మరొక విధమైన ఉదాహరణ కాగా, రష్యా పట్ల అకస్మాత్తుగా చూపుతున్న అవ్యాజమైన ప్రేమ మరొకటి. అక్రమ వలసదారులను నిర్దాక్షిణ్యంగా పంపివేయటం, వారువీరని గాక అన్ని దేశాలపై సుంకాలు పెంచనుండటం ఇదే కోవలోకి వస్తాయి. రకరకాలుగా కల్లోలం సృష్టిస్తున్న పలు అంతర్గత చర్యలను కూడా ఇదే దృష్టి నుంచి చూడాలి.
ఒక్క మాటలో చెప్పాలంటే, ధనం మూలం ఇదమ్ జగత్. సర్వం వ్యాపారమయం. ఇపుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి వద్దాము. ఉక్రెయిన్‌ను ఒక పావుగా ఉపయోగించుకుని రష్యాను చుట్టుముట్టి లొంగదీయాలనుకున్న వ్యూహంలో నాటోకు అమెరికాదే నాయకత్వం. ఉక్రెయిన్ యుద్ధమంటూ ప్రత్యక్షంగా 2022లో మొదలైనా, ట్రంప్ మొదటి విడత పాలన (201721) లోను అదే విధానం. యుద్ధం మొదలైన తర్వాత అప్పటి బైడెన్ ప్రభుత్వం, యూరోపియన్ దేశాలు కలిసి ఉక్రెయిన్‌కు భారీ ఎత్తున ఆధునిక ఆయుధాలు, బిలియన్ల కొద్దీ డాలర్ల నిధులు అందజేసాయి. ఒక దశ వరకైతే ఇక రష్యా ఓటమి ఖాయమని తీర్మానించి ప్రచారాలు చేసాయి. రష్యాపై కుప్పతెప్పలుగా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ, వాటిని పాటించని భారత్ వంటి దేశాలపై ఆగ్రహించాయి. అపుడంతా ట్రంప్ కూడా ఆ విధానాలకు మద్దతు తెలిపిన వారే. యుద్ధంలో క్రమంగా రష్యాది పైచేయి కావటం, ఉక్రెయిన్ గెలుపు అసాధ్యమని తేలటంతో అమెరికా సహా మొత్తం నాటో దిక్కుతోచని స్థితికి గురయ్యాయి. ఉక్రెయిన్ భూభాగంలో అప్పటికే 20 శాతం ఆక్రమించిన రష్యా, యుద్ధం అదే విధంగా కొనసాగితే ఎప్పటికి ఏ విధంగా ముగిసేదో చెప్పలేము. అయితే, రష్యన్ భాషీయులు ఆధిక్యతలో గల దోన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవటం మినహా తక్కిన ఉక్రెయిన్‌పై తమకు దృష్టి లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేసినందున ఆ ప్రాంతంలో అధిక భాగం ఇప్పటికే స్వాధీనమైనందున, మిగతా కూడా వశమైనాక ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసి ఉండే వారని భావించాలి.
అదట్లుంచితే, సరిగా ఇటువంటి దశలో ట్రంప్ అధికారానికి వచ్చారు. ఈసారి తన ఆలోచనలు పైనచెప్పిన విధంగా మారాయి. యుద్ధంలో ఎవరి వాదన సరైందన్న దానితో తనకు నిమిత్తం లేదు. ఉక్రెయిన్ కేంద్రంగా నాటోకు ఇంతకాలం ఉండిన వ్యూహంగాని, అక్కడి రష్యా అనుకూల ప్రభుత్వాన్ని తామే కూలదోసి జెలెన్ స్కీని అధికారానికి తేవటంతో గాని, యుద్ధంలో గత మూడేళ్లుగా ఉక్రెయిన్‌కు పూర్తి మద్దతు నివ్వటంతో గాని సంబంధం లేదు. యుద్ధాలు, ప్రాణ నష్టాలు తగనివి అంటూ గతం నుంచే వాదిస్తుండిన ట్రంప్, ప్రస్తుత యుద్ధం కూడా తగదన్నారు. అందుకు తాము ఆయుధాలు, బిలియన్ల కొద్ధీ నిధులు ఇవ్వలేమని ప్రకటిస్తూ, కావాలంటే ఆ పని యూరప్ చేసుకోవచ్చునని, తాను కోరుకునేది మాత్రం యుద్ధ విరమణతోపాటు సమస్యకు పరిష్కారమని పదే పదే ప్రకటించారు.
సరిగా ఇక్కడ విషయం కొత్త మలుపు తిరిగింది. యుద్ధానికి ట్రంప్ దూరం జరగనుండటం ఉక్రెయిన్‌కు, యూరప్‌కు పెద్ద సంకటం తెచ్చిపెట్టింది. ఆయుధ బలం, ఆర్థిక బలంలో సాటిలేని అమెరికా తోడ్పాటు లేనిదే అంతా కుప్పకూలుతుందని వారికి తెలుసు. అమెరికా లేకున్నా తమ బలాన్ని పెంచుకుని ఉక్రెయిన్‌కు “చివరికంటా” తోడు నిలిచి రష్యాను ఓడిస్తామని, అది తమ రక్షణకు కూడా అవసరమని ఆర్భాటపు ప్రకటనలైతే చేసారు గాని, అంతలోనే తమ బలహీనతలను, అనైక్యతలను తామే బయటపెట్టుకున్నారు. ట్రంప్‌కు నచ్చజెప్పే ప్రయత్నాలు ఫలించలేదు.
ఇదంతా ఓపికగా గమనించిన అమెరికా అధ్యక్షుడు, అపుడు తన వ్యాపారపు కార్డును బయటకు తీసారు. తమకు కావలసిని అరుదైన లోహాలు, ఖనిజ నిక్షేపాలు ఉక్రెయిన్‌లో విస్తారంగా ఉన్నాయని, వాటిని తమపరం చేసినట్లయితే యుద్ధ సమస్య పరిష్కారానికి ప్రయత్నించగలమని ప్రకటించారు. ఆధునిక పరిశ్రమలు, సాంకేతికతల కోసం లిథియం, గ్రాఫైట్, టైటానియం, యురేనియం వంటివి ముఖ్యం. చైనాతో పోటీ వల్ల ఇవి మరింత అవసరమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గల నిల్వలలో అధిక భాగానికి చైనా ఇప్పటికే ఒప్పందాలు చేసుకుంది. ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై దృష్టి పెట్టడానికి ఒక కారణం కూడా ఇదే. ఈ నిక్షేపాలు ఉక్రెయిన్‌లో గణనీయంగా ఉన్నట్లు ట్రంప్‌కు తెలుసు. అవి చాలా నాణ్యమైనవని ఇండియా నుంచి కొన్నేళ్ల క్రితం అక్కడకు వెళ్ళిన శాస్త్రజ్ఞుల బృందంలోని సభ్యుడొకరు ఈ రచయితకు స్వయంగా ధ్రువీకరించారు కూడా. అపుడు ఇండియా ఎందుకు ఒప్పందం చేసుకోలేదనేది వేరే విషయం. మొత్తానికి ట్రంప్ ఇపుడు, తాము ఉక్రెయిన్‌కు యుద్ధంలో 500 బిలియన్ల సహాయం చేసామని, అందుకు బదులు ఆ నిక్షేపాలన్నీ తమకు అప్పగించాలని షరతు పెట్టారు. దానితో కలవరపడిన జెలెన్ స్కీ మొదట గట్టిగా వ్యతిరేకించి పలు వాదనలు చేసినా, క్రమంగా తగ్గుతూ వచ్చి ఇపుడు ఒప్పందానికి సిద్ధపడుతున్నారు. ట్రంప్ వ్యాపార లేదా ఆర్థిక లక్షం నెరవేరుతున్నది.
ఇందులో చెప్పుకోవలసినవి కొన్నున్నాయి. ఖనిజాలకు బదులుగా తమ రక్షణకు పూర్తి హామీ ఇవ్వాలన్నది జెలెన్ స్కీ షరతు. అందుకు అమెరికా అధ్యక్షుడు అంగీకరించటం లేదని, ఆ మాట ఒప్పందపు ముసాయిదాలోనూ లేదన్నది ఇపుడు దాని పూర్తిపాఠం వెల్లడి కావటంతో స్పష్టమవుతున్నది. నిక్షేపాలను పూర్తిగా అమెరికా స్వాధీనం చేయరు గాని, వాటిపై అమెరికా ఎంతో కొంత ఖరీదు చెల్లిస్తే, అందుకు ఉక్రెయిన్ నిధులను కూడా కలిపి ఒక అభివృద్ధి సంస్థను నెలకొల్పుతారు. దాని నిర్వహణ అమెరికా చేతిలో ఉంటుంది. నిక్షేపాలు వెలికితీసే పని అమెరికన్ కంపెనీలు చేస్తాయి.
ఉక్రెయిన్ రక్షణ బాధ్యత యూరప్‌ది మాత్రమే. అయితే తమ సేనలు రష్యా సరిహద్దులకు వెళ్లవని, యుద్ధంలో పాల్గొనవని, లోపలి ప్రాంతాలలో కొన్ని చోట్ల ఉండి భద్రతను పర్యవేక్షిస్తాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇప్పటికే స్పష్టం చేసారు. ఇదొకటి కాగా, నిక్షేపాలలో సుమారు 40 శాతం ఇప్పటికే రష్యా ఆక్రమణలోకి పోయాయి. వాటితో వ్యాపారానికి ఇతరులతో పాటు (చైనా?) అమెరికాకూ వీలుంటుందని పుతిన్ సూచిస్తున్నారు. నిక్షేపాల ఖరీదులో కొంతభాగాన్ని తాము ఉక్రెయిన్‌కు ఇంతకాలం చేసిన సహాయం కింద అమెరికా జమ కట్టుకుంటుంది. మొత్తానికి ఈ విధంగా ఉక్రెయిన్‌పై ట్రంప్ బుల్డోజర్ అప్రతిహతంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
టంకశాల అశోక్
దూరదృష్టి