Saturday, February 22, 2025

‘అది ముడుపుల పథకం’

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్/ న్యూఢిల్లీ : ‘వోటర్ల సంఖ్య’ పెంపు కోసం భారత్‌కు 21 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చడాన్ని ‘ముడుపుల’ పథకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ప్రస్తుతం రద్దు చేసిన ఆ ఆర్థిక సహాయంపై పూర్వపు బైడెన్ ప్రభుత్వంపై విమర్శల పరంపరను ట్రంప్ కొనసాగించారు. వాషింగ్టన్ డిసిలో గురువారం రిపబ్లికన్ గవర్నర్ల సంఘం సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌లో వోటర్ల సంఖ్య పెంపు కోసం 21 మిలియన్ యుఎస్ డాలర్లా? భారత్‌లో వోటర్ల సంఖ్య పెంపును మనం ఎందుకు పట్టించుకోవాలి? మనకు తగినన్ని సమస్యలు ఉన్నాయి.

మన వోటర్ల సంఖ్య పెంపును మనం కోరుకోవాలి’ అని ట్రంప్ అన్నారు. ‘అనేక కేసుల్లో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో ఎవరికీ తెలియడు. అది ముడుపుల పథకం. అక్కడ ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియదు’ అని ఆయన పేర్కొన్నారు. ఆ ఆర్థిక సహాయాన్ని ట్రంప్ ప్రశ్నించడం ఇది వారంలో మూడవ సారి. భారత్‌లో వోటర్ల సంఖ్య పెంపుదల నిమిత్తం ఎన్నికల కమిషన్‌కు యుఎస్ ఎయిడ్ 21 మిలియన్ డాలర్లు సమకూర్చిందని ఎలాన్ మస్క్ సారథ్యంలోని ప్రభుత్వ సామర్థ సంస్థ (డోజ్) వెల్లడించిన కొన్ని రోజుల తరువాత ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేశారు.

యుఎస్ ఎయిడ్ నిధిపై వార్తలు ‘తీవ్ర ఆందోళనకరం’
భారత్‌లో కొన్ని కార్యకలాపాల కోసం యుఎస్ ఎయిడ్ ఆర్థిక సహాయం గురించి వచ్చిన వార్తలు ‘తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి’ అని భారత్ శుక్రవారం పేర్కొన్నది. దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించిన ఆందోళనలకు అవి దారి తీశాయని భారత్ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, కొన్ని రకాల యుఎస్ కార్యకలాపాలు, ఆర్థిక సహాయం గురించి యుఎస్ ప్రభుత్వం వెలువరించిన సమాచారాన్ని సంబంధిత శాఖలు, అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు.

‘కొన్ని రకాల యుఎస్ చర్యలు, ఆర్థిక సహాయం విషయమై యుఎస్ ప్రభుత్వం విడుదల చేసిన సమాచారాన్ని మేము చూశాం. అవి ఎంతగానో కలవరపరుస్తున్నాయి’ అని జైశ్వాల్ తెలిపారు. ‘భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం గురించిన ఆందోళనలకు అది దారి తీసింది. సంబంధిత శాఖలు, సంస్థలు అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ దశలో ముందస్తుగా వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుంది. కనుక సంబంధిత అధికారులు ఆ విషయం చూస్తున్నారు. తాజా వివరాలు అందిన తరువాత మేము వ్యాఖ్యానిస్తాం’ అని జైశ్వాల్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News