Tuesday, March 18, 2025

బైడెన్ ఆటోపెన్‌తో క్షమాపణలు.. అవి చెల్లవన్న ట్రంప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : బైడెన్ సర్కారు చివరి రోజుల్లో తీసుకున్న క్షమాభిక్షల నిర్ణయాలు చెల్లవని ట్రంప్ బాంబు పేల్చారు. ఆయన అధికారంలో ఉన్న చివరి రోజుల్లో జారీ చేసిన వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. గత అధ్యక్షుడు వీటికి సంబంధించిన ఆదేశాలపై ఆటోపెన్‌తో సంతకాలు చేశారని, వాటిని ఆయనకు తెలియకుండానే అమలు చేశారని ట్రంప్ వాదిస్తున్నారు. “ బైడెన్ నిద్ర మత్తులో రాజకీయ దుండగులు చాలా మందికి క్షమాభిక్షలు ప్రసాదించారు. అవి చెల్లనివి, శూన్యమని, ఎటువంటి ప్రభావం చూపవని నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను.

ఎందుకంటే వాస్తవానికి అవి ఆటోపెన్‌తో చేసినవి. ఒకరకంగా చెప్పాలంటే , బైడెన్ వాటిపై సంతకం చేయలేదు. అసలు ఆయనకు ఈ విషయం కూడా తెలియదు. వాటికి అవసరమైన , పత్రాల గురించి బైడెన్‌కు వెల్లడించలేదు. ఆయన ఆమోదించలేదు. ఈ వ్యవహారం నడిపినవారు నేరం చేశారు. ఆ తర్వాత అదే రాజకీయ దుండగుల అన్‌సెలెక్ట్ కమిటీ… నాతో మరికొందరు అమాయకులపై రెండేళ్ల పాటు నిర్వహించిన తప్పుడు దర్యాప్తులో సంపాదించిన ఆధారాలు మొత్తం నాశనం చేశారు. వారు అత్యున్నత స్థాయి దర్యాప్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం చేసుకోవాలి ” అని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్‌లో చేసిన పోస్టులో హెచ్చరించారు.

బైడెన్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడానికి కొన్ని గంటల ముందు పలువురికి క్షమాభిక్షలు ప్రసాదించారు. ఈ జాబితాలో ఆయన కుటుంబ సభ్యులైన జేమ్స్, ఫ్రాన్సిస్ (సోదరులు) వేలేరి (సోదరి) వారి జీవిత భాగస్వాములకు ఇవి లభించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను బాధ పెట్టాలనే ఉద్దేశంతో దారుణమైన రాజకీయ వేధింపులకు వారు లక్షంగా మారారని పేర్కొన్నారు. బైడెన్ తన కుమారుడికి కూడా క్షమాభిక్షను ప్రసాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కుమారుడు హంటర్ వెకేషన్ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. డిసెంబర్ 12 న ఒకేరోజు 1500 మంది ఖైదీల శిక్షలను తగ్గించారు. మరో 39 మంది ఖైదీలను క్షమించారు. అమెరికా ఆధునిక చరిత్రలో ఈ స్థాయిలో క్షమాభిక్షలు ఎవరూ ప్రసాదించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News