అమెరికా వస్తువులపై భారతదేశం తన సుంకాలను తగ్గిస్తుందని తాను నమ్ముతున్నట్లు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి ఆ దేశంపై అమెరికా గతంలో ప్రకటించిన విధంగా సుంకాలను విధిస్తామని పునరుద్ఘాటించారు. అమెరికా వెబ్ సైట్ బ్రీట్ బార్ట్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ భారతదేశంతో అమెరికా సంబంధాలపై మాట్లాడారు.గతనెల భారత ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన శిఖరాగ్రసభ పై ప్రస్తావించినప్పుడు తనకు భారతదేశంతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. భారతదేశంతో ఉన్న ఏకైక సమస్య ఏమిటంటే, ప్రపంచంలో అత్యధికంగా సుంకాలు విధించే దేశాలలో భారత్ ఒకటి అని పేర్కొన్నారు. ఇండియా బహుశా ఆ సుంకాలను గణనీయంగా తగ్గిస్తుందని తాను నమ్ముతున్నానని, అయితే ఏప్రిల్ 2 నుంచి అమెరికా వారి నుంచి వసూలు చేసే సుంకాలు కూడా అదేస్థాయిలో ఉంటాయని స్పష్టం చేశారు.మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కుదిరిన ఇండియా – మిడిల్ ఈస్ట్ -యూరప్- ఎకనమిక్ కారిడార్ ను గుర్తించినప్పుడు ట్రంప్ చైనా గురించి ప్రస్తావించకపోయినా,
అవి అద్భుతమైన దేశాల సమూహం అన్నారు. వాణిజ్య రంగంలో అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే ఇతర దేశాలకు గట్టి సమాధానం ఇచ్చే దేశాల సమూహం ఇది అన్నారు. వాణిజ్యరంగంలో శక్తివంతమైన భాగస్వామ్య దేశాల గ్రూప్ ఇదని ట్రంప్ స్పష్టం చేశారు. ఏ దేశం అమెరికాను తేలిగ్గా తీసుకోవడాన్ని అనుమతించబోము. మేము మిత్రపక్షాలైనా, ఇతరదేశాలైనా వారిని అన్నివిధాలా మెరుగ్గానే చూస్తాం అని ట్రంప్ స్పష్టం చేశారు.ట్రంప్ ఈ నెలారంభంలో మాట్లాడుతూ భారతదేశం తన సుంకాలను చాలా మేరకు తగ్గించడానికి అంగీకరించిందన్నారు. అయితే ఆ దేశంపై అమెరికా పై భారీ సుంకాలను విధిస్తున్నందువల్ల అక్కడ అమెరికా ఉత్పత్తులు అమ్మడం కష్టమవుతోందన్న అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.కాగా, భారత – అమెరికాల మధ్య ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, ట్రేడ్ టారిఫ్ విషయంలో రెండు దేశాలమధ్య ఇంతవరకూ ఓ ఒప్పందం కుదరలేదని మార్చి 10న న్యూఢిల్లీలో పార్లమెంటరీ బృందానికి కామర్స్ సెక్రటరీ సునిల్ బర్త్వాల్ తెలిపారు.