Sunday, December 22, 2024

అధ్యక్ష రేసులో ట్రంప్ దూకుడు

- Advertisement -
- Advertisement -

చార్ల్‌స్టన్ : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా జరిగిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లోను ఘన విజయం సాధించారు. పోటీలో ఉన్న నిక్కీ హేలీకి సొంత రాష్ట్రంలోనూ పరాజయం తప్పలేదు. ఇప్పటికే ట్రంప్ న్యూహ్యాంప్‌షైర్, నెవాడా, ఐయోవా, వర్జిన్ ఐలాండ్ రాష్ట్రాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పటికీ నిక్కీ హేలీ తన ఓటమిని అంగీకరించడం లేదు. మార్చి 5న పలు రాష్ట్రాల్లో జరిగే ప్రైమరీ ఎన్నికల్లోను తాను పోటీలో ఉంటానని ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న ఫలితాల ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో మరో సారి జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరు తప్పదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

దక్షిణ కరోలినాలో దాదాపు 90 శాతం ఓట్లు లెక్కించే సమయానికి హేలీకి 39.4 శాతం ఓట్లు రాగా, ట్రంప్ 59.9 శాతం ఓట్లు దక్కించుకున్నారు. అంటే ఇద్దరి మధ్య 20 శాతం అంతరం ఉండడం గమనార్హం. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందాలంటే ఒక అభ్యర్థికి 1,215 డెలిగేట్స్ అవసరం. కాగా హేలీకి ఇప్పటివరకు 17మంది డెలిగేట్ల మద్దతు ఉండగా ట్రంప్‌కు 92 మంది డెలిగేట్లు ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ ఇప్పుడున్నంత ఐక్యంగా గతంలో ఎన్నడూ లేదని ట్రంప్ అన్నారు. తాజా అధిక్యత అనంతరం ట్రంప్ మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించారు. చాలాకాలంనుంచి దక్షిణ కరోలినాలో రిపబ్లికన్లకు మంచి పట్టు ఉంది. నిక్కీ హేలీ గతంలో ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేశారు. అయినప్పటికీ తాజా ఎన్నికల్లో ఆమెకు మద్దతు కరవైంది. గవర్నర్‌గా ఆమె చాలా మంచి పనులు చేసినప్పటికీ జాతీయ స్థాయి వ్యవహారాల్లో ట్రంప్‌కంటే ఆమె మెరుగ్గా నిర్వహించలేరని భావిస్తున్నట్లు కొంతమంది అభిప్రాయపడ్డారు. నిక్కీ హేలీ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసునుంచి తప్పుకోవాలని ట్రంప్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాను రేసునుంచి తప్పుకోని ఆమె ప్రకటించారు. మార్చి 5న పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీలో కొనసాగుతానని స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News