ట్రంప్ దృష్టి అంతా రష్యాతో చెడిపోయిన అమెరి కా సంబంధాలను పునరుద్ధరించుకోవడం పైననే ఉన్నట్లు స్పష్టం అవుతుంది. అందుకోసం రష్యాపై విధించిన ఆంక్షలను తొలగించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు వెల్లడి అవుతుంది. చైనా నుండి ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొ నేందుకు రష్యా- చైనాల మధ్య కొంత దూరం సృష్టించాలని ఎత్తుగడగా కనిపిస్తున్నది. మూడున్నర దశాబ్దాలుగా ‘ప్రచ్ఛన్న కాలం’ నాటి సోవియట్ యూనియన్‌ను శత్రుదేశంగా పరిగణించే అమెరికా విదేశాంగ విధానంలో మార్పు తీసుకు వచ్చేందుకు ట్రంప్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిణామాలు సహజంగానే ఉక్రెయిన్‌కు అశనిపాతంగా మారే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ రెండు నెలల పదవీకాలంలోనే స్వదేశంలో, విదేశాలలో కలకలం సృష్టిస్తున్నారు. ఒకవంక, సంఘర్షణలను ఆపివేసి శాంతిదూతగా పేరు తెచ్చుకునేందుకు మధ్య ఆసియాలో తాను పదవి చేపట్ట్టేలోగా కాల్పుల విరమణ జరగాలని స్పష్టం చేశారు. మరోవంక, ఉక్రెయిన్‌లో సైతం కాల్పుల విరమణకు ప్రతిపాదిస్తూ తాను తలచుకొంటే 24 గంటలలో సాధ్యం అవుతుందంటూ చెప్పుకొచ్చారు. సంఘర్షణలకు ఒకవైపు తాత్కాలిక విరామం లభించేటట్లు ప్రయత్నం చేస్తూ మరోవంక వాణిజ్యపరంగా టారిఫ్ యుద్ధాలకు ఆజ్యం పోస్తున్నారు. టారిఫ్‌లను తగ్గించని పక్షంలో ఎదుటివారెంతగా టారిఫ్‌లు విధిస్తారో తాము కూడా అంతే విధిస్తామంటూ చెబుతున్నారు. స్వదేశంలో సైతం ఉద్యోగులను తొలగించడం, పలు అసాధారణమైన ఉత్తర్వులపై సంతకాలు చేయడం చేస్తున్నారు.
రెండు నెలలకే ఇంతగా హడావుడి చేస్తున్నారు, మరో నాలుగేళ్ల వరకు ఎంతగా చెలరేగిపోతారో అంటూ గుసగుసలు బయలుదేరుతున్నాయి. ఆయన చేపట్టిన చర్యలలో చాలావరకు సంచలనాలు కనిపించడమే గాని శాశ్వత పరిష్కారాలు కనిపించడం లేదు. ఆయనకు సైతం అటువంటి ఉద్దేశాలు ఉన్నట్టు లేదు. ఉదాహరణకు మధ్య ఆసియాలో కాల్పుల విరమణతో బందీల మార్పిడి వరకు విజయం సాధిస్తున్నారు. ఇది మొదటి దశ 45 రోజులకు మాత్రమే కావడం గమనార్హం. ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. రెండో దశలో గాజా నుండి ఇజ్రాయెల్ సేనలు పూర్తిగా వైదొలగాలి. అటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ఇజ్రాయెల్ సైతం తమ బందీలను విడిపించుకోవడం కోసమే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు కనిపిస్తున్నది. మూడవ దశలో మొత్తం గాజాను పునర్నిర్మించి, అక్కడున్న పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి, ట్రంప్ టవర్లు నిర్మిస్తారని వస్తున్న ప్రతిపాదనలు ఎవ్వరికీ ఆమోదయోగ్యం అయ్యే అవకాశం లేదు.
సుస్థిరమైన పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ అంగీకరిస్తుందని భావించలేం. అదే విధంగా చివరకు ఇజ్రాయెల్ ప్రయోజనాలను కాపాడటం మినహా అమెరికా సైతం స్వతంత్రించి నిర్ణయాలు ప్రకటించలేదు. అక్కడున్న సుమారు 23 లక్షల మంది పాలస్తీనా ప్రజలను తరలించి పునరావాసం కల్పించేందుకు అరబ్ దేశాలు ఏవి ముందుకు రావడం లేదు. ప్రస్తుత పరిస్థితులలో అది ఆచరణ యోగ్యమైన పరిష్కారం కూడా కాబోదు. దానితో సుడాన్, సోమాలియా వంటి తూర్పు ఆఫ్రికా దేశాలకు తరలించేందుకు చర్చలు జరుపుతున్నారు. హమాస్ పట్ల కఠినంగా మాట్లాడుతున్న ట్రంప్ వారిని తుదముట్టడించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. పాలస్తీనా ప్రజలను అక్కడి నుండి తరలించి, గాజా భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని, యుద్ధం కారణంగా కకావికలమైన ప్రాంతాన్ని బాగుచేసి, రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేయాలని అమెరికా ప్రతిపాదిస్తుంది. ఇదే మాత్రం కార్యరూపం దాలుస్తుందో చెప్పలేం.
ఇక ఉక్రెయిన్ విషయానికి వస్తే ఆ దేశాన్ని నట్టేట ముంచే, రష్యాతో చెలిమికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు చెబుతున్న శాంతి పరిష్కారం ప్రతిపాదనలు అటు రష్యా, ఇటు అమెరికాలకు ప్రయోజనం కలిగించడమే గాని, ఉక్రెయిన్‌కు ఎటువంటి భరోసా కల్పించే అవకాశం కనిపించడం లేదు. ఈ యుద్ధం ప్రారంభమైనదే ఉక్రెయిన్‌ను నాటోలో సభ్యదేశంగా చేర్చుకునేందుకు అమెరికా, ఐరోపా దేశాలు ప్రయత్నించడంతో. రష్యా మొదటి నుండి పెడుతున్న ప్రధానమైన షరతు నాటోలో చేరబోమని హామీ ఇవ్వాలని. తమ దేశ సరిహద్దుల్లోకి నాటో దళాలను అనుమతించడం రష్యా భద్రతకు ప్రమాదకరం కాగలదు. యుద్ధం ప్రారంభమైన రెండు వారాల్లోనే అటువంటి షరతుకు ఉక్రెయిన్ సుముఖత వ్యక్తం చేస్తూ రాజీకోసం సిద్ధపడుతున్న సమయంలో అమెరికా, ఐరోపా దేశాలు చేరి పడనీయలేదు. ఉక్రెయిన్ భద్రతకు తాము భరోసా అంటూ రెచ్చగొట్టాయి. ఇప్పుడు రాజీకోసం ఉక్రెయిన్ కొంత భూభాగం పోగొట్టుకొనేందుకు సైతం సిద్ధపడాలని ట్రంప్ చెబుతున్నారు.
ఉక్రెయిన్‌లోని నాలుగు రాష్ట్రాలు, అంటే 20 శాతం భూభాగం ఇప్పుడు రష్యా అధీనంలో ఉన్నాయి. ఎటువంటి శాంతి ప్రతిపాదనలు సైతం ఆ భూభాగాల నుండి రష్యాను వెనుకకు పంపించే అవకాశాలు కనిపించడం లేదు. మరోవంక, ఉక్రెయిన్‌కు తాము చేసిన సైనిక సహాయానికి బదులుగా ఆ దేశంలోని అత్యంత విలువైన, అరుదైన లోహాలపై తమకు ఆధిపత్యం కల్పించాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నది. అమెరికా 500 బిలియన్ డాలర్ల సైనిక సహాయం చేశామని చెబుతున్నది.
వాస్తవానికి ఆ మొత్తంలో నేరుగా కేవలం 160 బిలియన్ డాలర్లు మాత్రమే ఉక్రెయిన్‌కు అమెరికా సహాయంగా ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని అమెరికాలోని ఆయుధ కంపెనీలకు అందజేసింది. ఆ విధంగా ఉక్రెయిన్ సహజ వనరులపై అమెరికా కన్నేసింది. మరోవంక, ఐరోపా దేశాల భద్రతకు తాను హామీ ఇవ్వలేనని ట్రంప్ చేతులెత్తేశారు. నాటో ఆర్టికల్ 5 ప్రకారం నాటోలోని ఏ సభ్య దేశంపై యుద్ధం జరిగినా అందులోని మొత్తం 32 సభ్య దేశాలు ఉమ్మడిగా సైనికంగా నిలబడాలి. కానీ ఇప్పుడు అమెరికా తోకాడించడంతో ఐరోపా దేశాలు ఆత్మరక్షణలో పడ్డాయి. దానితో అవి ఇప్పుడు ఉక్రెయిన్ కు సైనిక సహాయం అందించే పరిస్థితుల్లో లేవు. అందుకనే ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ కలిసి 500 బిలియన్ డాలర్లతో ఉమ్మడి సైనిక వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించుకున్నాయి. అమెరికా ఇంకేమాత్రం తమకు సహాయకారి కాబోదని ఐరోపా గ్రహిస్తున్నది. ఈ పరిణామాలు అన్ని ఐరోపాలో మరింత అనిశ్చితకు అమెరికా ఆజ్యం పోస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ ప్రపాదిస్తున్న నెల రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను సూత్రప్రాయంగా ఆమోదిస్తూ, షరతులు ప్రకటిస్తున్న రష్యా కేవలం ఉక్రెయిన్ స్వాధీనంలోని కీలకమైన కురుస్క్ ప్రాంతాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు కాలయాపన చేస్తున్నది. ఒక గ్యాస్ పైప్‌లైన్ లోపల కిలోమీటర్లు నడిచి లోపలకు ప్రవేశించి ఉక్రెయిన్ సేనలను రష్యా దళాలు ముట్టడించాయి.
ఉక్రెయిన్ ఆగస్టులో కురుస్క్ లోపలకు చొచ్చుకుపోయేందుకు సాహసోపేతంగా సీమాంతర దాడి ప్రారంభించింది. రెండవ ప్రపంచ యుద్ధం దరిమిలా రష్యన్ భూభాగంపైకి అది అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ దళాలు వ్యూహాత్మక సరిహద్దు పట్టణం సుద్జాతో సహా వేయి చదరపు కి.మీ భూభాగాన్ని కైవసం చేసుకుని, వందలాది మంది రష్యన్లను యుద్ధ ఖైదీలుగా తీసుకున్నాయి. భవిష్యత్తులో శాంతి చర్చల్లో బేరసారాల్లో లబ్ధి పొందడం, తూర్పు ఉక్రెయిన్‌లో దాడులనుంచి రష్యన్ సైనికులను మళ్లించేలా ఒత్తిడి చేయడం లక్ష్యంగా ఆ దాడి నిర్వహించినట్లు కీవ్ వెల్లడించింది. అయితే, ఉక్రెయిన్‌పై ఆకస్మాత్తుగా దాడి జరపడం ద్వారా ఈ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా రష్యా ఉక్రెయిన్‌కు దాదాపుగా కాల్పుల విరమణకు లొంగిపోవడం మినహా, ఎటువంటి బేరసారాలకు పాల్పడే అవకాశం లేకుండా చేస్తున్నది.
కురుస్క్ ప్రాంతంలో ఉక్రేనియన్ సైనికులు ‘తీవ్ర ఇబ్బందుల్లో‘ ఉన్నారని, రష్యన్ సైనికులు చుట్టుముట్టారని వెల్లడించిన ట్రంప్ తాను ప్రతిపాదిస్తున్న శాంతి ప్రతిపాదనలకు సంబంధించిన ఎటువంటి వివరాలు వెల్లడించడం లేదు. భూభాగాలు, విద్యుత్ ప్లాంటులు, కొన్ని ఆస్తుల విభజన గురించి ఉండవచ్చంటూ అస్పష్టంగా చెబుతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌కు కీలకమైన ఐరోపాలోని అతిపెద్ద అణువిద్యుత్ ప్లాంట్ అయిన ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత జపోరిజ్జియాకు తిరిగి ఇచ్చే ప్రతిపాదనలు సైతం కన్పించడం లేదు. శాశ్వత శాంతి ప్రతిపాదనగా రష్యా ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తిరిగి ఇచ్చేసే ఎటువంటి ప్రతిపాదనకు రష్యా సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ విషయంలో ట్రంప్ సైతం పట్టుదలతో ఉన్నట్లు లేదు.
ఉక్రెయిన్‌కు సైనిక సహాయం నిలిపివేయడం, ఐరోపా దేశాలను సైతం ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందించలేని పరిస్థితులు కల్పించడం ద్వారా ఉక్రెయిన్‌ను నిస్సహాయ పరిస్థితుల్లో నెట్టివేసి ప్రయత్నాలే కనిపిస్తున్నాయి. ట్రంప్ దృష్టి అంతా రష్యాతో చెడిపోయిన అమెరికా సంబంధాలను పునరుద్ధరించుకోవడం పైననే ఉన్నట్లు స్పష్టం అవుతుంది. అందుకోసం రష్యాపై విధించిన ఆంక్షలను తొలగించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు వెల్లడి అవుతుంది. చైనా నుండి ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు రష్యా- చైనాల మధ్య కొంత దూరం సృష్టించాలని ఎత్తుగడగా కనిపిస్తున్నది. మూడున్నర దశాబ్దాలుగా ‘ప్రచ్ఛన్న కాలం’ నాటి సోవియట్ యూనియన్‌ను శత్రుదేశంగా పరిగణించే అమెరికా విదేశాంగ విధానంలో మార్పు తీసుకువచ్చేందుకు ట్రంప్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పరిణామాలు సహజంగానే ఉక్రెయిన్‌కు అశనిపాతంగా మారే అవకాశం ఉంది. పైగా, ఉక్రెయిన్ లో ప్రభుత్వం మార్పిడికోసం కూడా అమెరికా, రష్యా ప్రయత్నించే అవకాశం ఉంది.
చలసాని నరేంద్ర
98495 69050