గ్రీన్‌లాండ్‌ను ఎంతకైనా కొనుగోలు చేస్తానని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ పదేపదే హెచ్చరించడంతో డానిష్ రాజ్యాలు అప్రమత్తం కావడమే కాక, ఐక్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఆ దేశాలకు ఏర్పడింది. 57,000 మంది జనాభాతో ప్రపంచంలోనే అతి పెద్దదైన ద్వీపకలం గ్రీన్‌లాండ్. ఇది డెన్మార్క్ ప్రభుత్వ నియంత్రణలోని స్వయంపాలిత భూభాగం. అక్కడి పార్లమెంటే వాణిజ్య పన్నులు, ఇమ్మిగ్రేషన్ (వలస విధానం), గనులు, తదితర స్వదేశీ వ్యవహారాల నిర్వహణతోపాటు, మిలిటరీ విధానాలు, పర్యవేక్షణ వంటి విదేశీ వ్యవహారాలు నిర్వహిస్తుంది. 18వ శతాబ్దంలో ఆర్కిటిక్ ద్వీపం డేన్స్ వలస పాలకుల అధీనంలో ఉండేది. ఆ సమయంలో ఐరోపాతో సమన్వయం పాటించేది. భౌగోళికంగా ఉత్తర అమెరికా ఖండంలో ఇదో భాగం. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ముట్టడిలో డెన్మార్క్ ఉన్నప్పుడు అమెరికా స్వల్పంగా దీనిని ఆక్రమించి రక్షించింది.
యుద్ధం తరువాత దీని ప్రాంతీయ భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతను అమెరికా గుర్తించింది. ఈ గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ నుంచి కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా, డెన్మార్క్ తిరస్కరించింది. అప్పటి నుంచి డానిష్ రాజ్యంలో ఒక భాగంగా కొనసాగుతున్న గ్రీన్‌లాండ్‌కు 1979లో హోమ్‌రూల్ కూడా మంజూరైంది. ఈ ద్వీపంపై అమెరికా విమాన స్థావరాన్ని నిర్వహిస్నున్నా ఈ ద్వీపంపై పూర్తి స్వాతంత్య్రం సాధించాలన్న లక్షంతో డెన్మార్క్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గ్రీన్‌లాండ్‌లో వలసపాలకుల అవశేషాలను తొలగించడమే తదుపరి చర్యగా గ్రీన్‌లాండ్ ప్రధాని ముటెఎగెడే కొత్త సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా ప్రస్తావించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా తొలిసారి పాలించినప్పుడు గ్రీన్‌లాండ్ కొనుగోలు వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు రెండోసారి అధ్యక్షునిగా వచ్చాక గ్రీన్‌లాండ్ కొనుగోలు అంశం సీరియస్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ భద్రత, ప్రపంచం మొత్తం మీద స్వేచ్ఛ, తదితర ప్రయోజనాల దృష్టా గ్రీన్‌లాండ్‌పై నియంత్రణ అధికారం తప్పనిసరిగా ఉండాలని అమెరికా ఆశిస్తున్నట్టు ట్రంప్ గత డిసెంబర్‌లో వెల్లడించారు. ఆ ప్రకటన తరువాత ట్రంప్ కుమారుడు, జూనియర్ ట్రంప్ ఒక ప్రైవేట్ వ్యక్తిగా గ్రీన్‌లాండ్‌ను సందర్శించారు. అయితే గ్రీన్‌లాండ్, డానిష్ ప్రధానులిద్దరూ ఈ బెదిరింపులను ఖాతరు చేయడం లేదు. ‘గ్రీన్‌లాండర్లదే గ్రీన్‌లాండ్’ అని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ట్రంప్ అస్పష్టంగా ఉంటున్నారు.
గత వారం పత్రికావిలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రీన్‌లాండ్ విషయంలో మిలిటరీ బలప్రయోగం కానీ, కొనుగోలు చేసి తమ దేశంలో చేర్చుకోడానికి కానీ తాము ప్రయత్నించబోమని పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్ ద్వీపానికి ఒకవైపు అట్లాంటిక్, మరోవైపు ఆర్కిటిక్ జలాలు చుట్టుముట్టి ఉన్నాయి. వాతావరణ మార్పులకు, భూతాపానికి, ఆర్కిటిక్ సముద్రంలోని హిమానీ నదులు, మంచు ఫలకలు కరుగుతుంటాయి. ఫలితంగా నౌకారవాణాకు కొత్తమార్గాలు ఏర్పడుతుంటాయి. ఇది వాణిజ్యం బాగా విస్తరించడానికి దోహదం చేస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ఆర్కిటిక్ జలాల్లో నూతన నౌకా రవాణా మార్గాలను అభివృద్ధి చేయడానికి రష్యా, చైనా దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఉత్తర సముద్ర మార్గంలో సహకారం పెంపొందించుకోడానికి ఈ రెండు దేశాలు గత నవంబరులో సబ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. స్కాండినేవియా సమీపాన గల బారెంట్స్ సముద్రం నుంచి అలస్కా సమీపాన గల బెరింగ్ జలసంధి వరకు ఈ మార్గం 5600 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉంది.
ఈ ప్రాంతంలో రష్యా చైనా సహకార ఒప్పందం పెద్ద సవాలు కావడంతో గ్రీన్‌లాండ్‌ను చేర్చుకోవడం అమెరికాకు తప్పనిసరి అవుతోంది. దీని ద్వారా ఆ ప్రాంతంలో అమెరికాకు గట్టి నియంత్రణ ఏర్పడుతుంది. ఈ వ్యూహాత్మక జలాల్లో ఎవరు రవాణా సాగించాలో ఎవరు ఆపరేట్ చేయాలో నిర్ణయించే అధికారం అమెరికాకు కలుగుతుంది. ఇంతేకాకుండా ఈ గ్రీన్‌లాండ్ ద్వీపంలో అపురూప ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. 2025 ఒక సర్వే ప్రకారం 35 కీలకమైన ఖనిజాల్లో 25 ముడి ఖనిజాలు గ్రీన్‌లాండ్‌లో నిక్షిప్తమై ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల్లో ఈ ఖనిజాలను వినియోగిస్తారు. 28,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉండే గ్రీన్‌లాండ్ మంచు ఫలకలు కరుగుతుండడంతో చమురు, గ్యాస్, ఇతర కీలకమైన ఖనిజాలను తవ్వితీయడం సులువవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద చైనా కీలకమైన ఖనిజాల ఎగుమతి, ఉత్పత్తిదారుగా ఉంటోంది.
గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయగలిగితే చైనాకు అమెరికా గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది. పనామా కాలువను కెనడాను తమ అధీనంలోకి తెచ్చుకోడానికి ఎంతకైనా కొనుగోలు చేయడానికి అమెరికా సిద్ధమేనని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఇవన్నీ అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు దోహదం చేస్తాయి. దేశాల సార్వభౌమత్వాన్ని గ్రీన్‌లాండ్‌తో సహా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి చార్టర్‌లో పేర్కొన్న మొట్టమొదటి ప్రమాణానికి అమెరికా గండికొడుతోంది. అలాగే నాటో ఒప్పందానికి వ్యతిరేకంగా వెళుతోంది. ఐక్యరాజ్యసమితి పొందుపరిచిన సముద్ర పరిరక్షణ చట్టం మేరకు ప్రపంచ దేశాలన్నిటికీ సమాన వినియోగ హక్కు కల్పించేవిగా ఆర్కిటిక్ జలాలు ఉంటున్నాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ పాలసీలు అంతర్జాతీయ రాజకీయాల వెనుకఉన్న నిజమైన అరాచక స్వభావాన్ని తెరపైకి తీసుకు వస్తున్నాయి.