అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది వారాలుగా ప్రపంచాన్నంతా బెదిరిస్తున్నట్లుగానే ఈ నెల 2న కొత్త టారిఫ్‌ల జాబితా ప్రకటించారు. ఆ రోజుకు ముందు కొన్ని దేశాలపై అప్పుడొకటి ఇప్పుడొకటి, అపుడో దేశం ఇపుడో దేశం అన్న పద్ధ్దతిలో జరిగిన దిగుమతి సుంకాల పెంపు జాబితాలో ఏప్రిల్ 2న ఒకేసారి 180కి పైగా దేశాలు చేరాయి. వాటిలో తమ మిత్ర దేశాలు ప్రత్యర్థులు, పెద్ద దేశాల నుంచి మొదలుకొని మనం ఎన్నడూ పేరైనా వినని టొకెలావూ (జనాభా 1,500), స్వాల్‌బార్డ్ (జనాభా 2,500) వంటి పసిఫిక్ ద్వీప దేశాల వరకు ఉన్నాయి. సుంకాల హెచ్చింపు శాతాలు 10 నుంచి ఏకంగా 54 వరకు కనిపిస్తాయి. అనగా ట్రంప్ ఈ విషయంలో తరమత భేదం చూపించలేదన్న మాట.
సుంకాల పెంపుదల నుంచి పూర్తిగా మినహాయించిన దేశాలు రష్యా, క్యూబా, బేలారూస్, ఉత్తర కొరియాలు. దాని అర్థం పూర్తిగా మినహాయింపు అని కాదు. వాటిపై ఇప్పటికే భారీ స్థాయిలో సుంకాలు, వందల కొద్దీ ఆర్థిక ఆంక్షలు ఉండగా ఇంకా అవరసం లేదన్నది ట్రంప్ అధికారుల ఇచ్చిన వివరణ. వారు చెప్పకుండా వదిలిన మాట మరొకటి ఉంది. ఆయా దేశాలతో అమెరికా వాణిజ్యం ఇప్పటికే కనిష్ఠ స్థాయికి తగ్గిపోయింది. అందువల్ల, మరిన్ని సంకాలకు అర్థ్ధం ఉండదు. మరి అమెరికా నుంచి ఎగుమతులు తప్ప, దిగుమతులంటూ అంతగా లేని టొకెలావూ, స్వాల్‌బార్డ్ వంటి పిపీలిక దేశాలపై పెంచటం ఎందుకు? అమెరికన్ అధికారులకు ఏమైనా తర్కం ఉందేమోగాని, మనకేమీ తోచదు.
దిగుమతి సుంకాల పెంపుదల గురించి ట్రంప్ ఒక మాట అన్నారు. ఇతరుల ఉత్పత్తులపై తమ సుంకాలు చాలా తక్కువ కాగా, తమ ఉత్పత్తులపై ఇతర దేశాలు పెద్ద మొత్తంలో విధిస్తున్నాయని, కనుక అందుకు బదులుగా మాత్రమే తామిపుడు పెంచుతున్నామని, ఆ పని కూడా “న్యాయమైన రీతిలో, ఎంతో దయ చూపుతూ” చేస్తున్నామన్నారు. ఒక కోణంలో చూస్తే అట్లాగే చేసారు కూడా. మొత్తం దేశాలు, అవి వేసే సుంకాల శాతం, ఇపుడు ట్రంప్ పెంచిన తర్వాత ఉండే సుంకాల శాతాలను గమనిస్తే అట్లాగే అనిపిస్తుంది కూడా. ఉదాహరణకు భారతదేశం పరిస్థితినే చూస్తే, మనం వేసే సుంకాల సరాసరి 52 శాతం. ఇపుడు ట్రంప్ పెంచిన తర్వాత మన ఎగుమతులపై అమెరికన్ సుంకాల సగటు 26 శాతం అవుతుంది.
మొత్తం అన్ని దేశాల పరిస్థితి కూడా అంతే అయినట్లు జాబితా చూపుతున్నది. ఇది అంతా కూడా ఇతరులు వేసే సుంకాలలో ట్రంప్ సుంకాలు సుమారు 50 శాతం మేర మాత్రమే అవుతున్నాయి. ట్రంప్ “న్యాయమైన రీతిలో, ఎంతో దయ చూపుతూ” అన్నమాటల అర్థం ఇదేననుకోవాలి. తాము ఏప్రిల్ 2న ప్రకటించబోయే సుంకాలు ఇతర దేశాల సుంకాలకు” సరి సమానంగా” ఉంటాయని ట్రంప్ చెప్తూ వచ్చారు. కాని ఆ హెచ్చింపు ఇపుడు ఆ స్థాయిలో గాక “సగం మేరకు” మాత్రమే ఉంటున్నదని ఆయన 2వ తేదీన వివరించబూనారు. గణాంకాలకు పరిమితమై చూస్తే అది నిజమే కూడా.
అమెరికా అధ్యక్షుని ప్రకటన, ఇతరత్రా ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళ్లే ముందు మనం అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్నున్నాయి. తను పేర్కొంటున్నట్లు అమెరికా సుంకాలు తక్కువ, ఇతరుల సుంకాలు ఎక్కువ అయ్యే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఎప్పటి నుంచి? ఆ పరిస్థితి అమెరికా నాయకత్వానికి, మార్కెట్లకు, ఆర్థిక వ్యవస్థకు ఇపుడు కొత్తగా తెలియవచ్చిందా? గతం నుంచే తెలిసినా ఇంత వరకు పట్టించుకోనిది ఎందుకు? ఇపుడు సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది? సుంకాలు హెచ్చింపుతో అమెరికా వాణిజ్య లోటు సమస్య, ఉత్పత్తి రంగ సమస్య, ఆర్థిక లోటు సమస్యల వంటివి పరిష్కారమవుతాయా? లేక ఈ అనిశ్చయ పరిస్థితులు ఆ సమస్యలను మరింత పెంచినా పెంచవచ్చునా?ఈ మౌలిక ప్రశ్నలపై ట్రంప్, ఆయన సలహాదారుల ఎటువంటి మేధోమథనాలు జరిపారో మనకు తెలియదు.బయటకు మాత్రం వారి ప్రకటనలు, చర్యలు మాత్రం కనిపిస్తున్నాయి.
అట్లాగే, ఇటువంటి చర్యలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ “తిరిగి” గొప్పగా మారుతుందని, మళ్లీ “స్వర్ణయుగం” వస్తుందని అమెరికన్ ప్రజలకు, పారిశ్రామిక వాణిజ్య వర్గాలకు కూడా హామీ ఇస్తున్నారు. ఆ దృష్టితోనే ట్రంప్ ఏప్రిల్ 2 ను తమ దేశానికి “విముక్తి దినం” అని ఆర్భాటంగా ప్రకటించారు. కాని, తనకు ప్రత్యేకంగా వ్యతిరేకులు కాని ఆర్థిక రంగ నిపుణులు ఎందరో అమెరికాలో, బయటి ప్రపంచంలో కూడా ఆయనతో ఏకీభవించటం లేదు. చివరకు ఏమయేదీ కాలమే చెప్పగలదు. ఒకసారి గతంలోని వెళితే, అమెరికా అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితులకు కారణాలు అర్థమవుతాయి. ఆ పరిస్థితులు అమెరికా, యూరప్ సహా మొత్తం పాశ్చాత్య ప్రపంచానివి కూడా.
అవి సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ, వలసవాదం నయా వలసవాదం, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్లుటిఒ సాధనాలుగా, తమ ఆర్థిక సైనిక శక్తులను ఆధారం చేసుకుంటూ నేటికీ అనుసరిస్తున్న విధానాలలో కనిపిస్తాయి. ఈ మాటలన్నీ స్వయంగా పలువురు పాశ్చాత్య ఆర్థికవేత్తలు ఎప్పటి నుంచో చెప్తున్నవే.మనకు చీమ కథ ఒకటున్నది. చీమ కుట్టిన పిల్లవాడు ఏడుస్తుంటాడు. చీమా చీమా ఎందుకు కుట్టావనే ప్రశ్నతో మొదలై వెనుకకు వెళ్ళే ఆ కథ ఏమిటో తెలిసిందే. అది ప్రస్తుతం ట్రంప్ కథకు సరిగా వర్తిస్తుంది. ఆ కథను ముందు వర్తమానంతో మొదలు పెట్టి వెనుకకు వెళదాము. అమెరికా సుంకాలు తక్కువగా, ఇతరులవి ఎక్కువగా ఎందుకున్నాయన్నది మొదటి ప్రశ్న.
తక్కువ వేయమని అమెరికాను ఎవరూ కోరలేదు. స్వయంగా నిర్ణయించుకున్నారు. అందువల్ల కొన్ని సమస్యలు ఉన్నట్లు కొన్ని హెచ్చరికలు వచ్చినా రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కూడా కొనసాగించారు. ఎందుకు? సులభంగా చెప్పాలంటే, ఇతర దేశాల ఉత్పత్తులు వస్త్రాల నుండి కార్ల వరకు ఏవైనా సరే, తక్కువ సుంకాలు వేసిన పక్షంలో అమెరికన్ వినియోగదార్లకు తక్కువ ధరలలో లభిస్తాయి. తమ డాలర్ విలువ చాలా ఎక్కువ, తలసరి ఆదాయంలో తాము అగ్రస్థాయి దేశాలలో ఒకటిగా ఉన్నాము గనుక, అందుకు తగినట్లు అమెరికా సంపదలను, డాలర్ విలువను పలు విధాలుగా నిలబెట్టుకుంటున్నందున, తక్కువ సుంకాలతో అందరికీ అన్నీ సుఖాలే తప్ప కష్టాలేమీ లేవు. ఆ విధంగా సాగాయి ఆలోచనలు. ఇందుకు మరొకటి తోడైంది.
అమెరికాకు శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉత్పత్తి వాణిజ్య రంగాలు, అవసరమైన పెట్టుబడుల, ప్రపంచం నలుమాలల నుంచి నయానో భయానో సంపాదించే వనరులు పుష్కలంగానే ఉండేవి. వీటన్నింటితోనే వారు బ్రిటన్ వాణిజ్య సామ్రాజ్యాన్ని 19వ శతాబ్దం చివరి నుంచే మెల్లగా వెనుకకు నెడుతూ, రెండవ ప్రపంచ యుద్ధం (193945) ముగిసే నాటి నుంచి వేగంగా ముందుకుపోయారు. అట్లా కొన్ని దశాబ్దాలు గడిచినాక తమ వద్ద జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగి, సిబ్బంది జీతభత్యాలు ఉత్పత్తి ఖర్చులు పారిశ్రామిక వాణిజ్య రంగానికి “భరింపలేనట్లు” తయారు కావటంతో ఆ రెండు రకాల ఖర్చులను తగ్గించుకునేందుకు పరిశ్రమలను, –తద్వారా ఉత్పాదనలు చేసే ఉద్యోగ ఉపాధులను పేద, వర్ధమాన దేశాలకు తరలించారు. అక్కడి నుంచి చవకగా దిగుమతులు తెచ్చుకున్నారు. పాశ్చాత్య ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో ప్రజలు వినియోగదారీ తత్తానికి, జీవన విధానానికి బాగా అలవాటుపడిపోయారు.
అందుకు వీలుగా ఉండేందుకే స్వయంగా అమెరికన్ ప్రభుత్వాలే ఇంతకాలం తక్కువ సుంకాలు విధించాయి. ఇతర దేశాలు తమ ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు వేసినా అమెరికాకు బాధ కలగలేదు. పైగా ఇతర దేశాల నుంచి కీలక వనరులను చవకగా రాబట్టడం, ఆర్థికాది సర్వీస్ రంగాలలో పైచేయి డాలర్ ఆధిపత్యం, విపరీత స్థాయిలో ఆయుధ వ్యాపారాలు, టెక్నాలజీ ఉత్పత్తు, వైద్యరంగ ఎగుమతి ధరలు వందల రెట్లలో ఉంచటం ద్వారా లాభాల స్థాయిని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఇతర దేశాలు తమను “పీల్చి పిప్పిచేస్తున్నా” యనే ట్రంప్ ఫిర్యాదులు ఎట్లున్నా, అసలు వాస్తవాలు ఇవి.
కనుకనే, ఇతరులు ఎంత “పీల్చినా” అమెరికా ఇంతటి ధనిక, బలమైన అగ్రరాజ్యంగా కొనసాగుతున్నది.
మరి ట్రంప్‌కు ఎందుకీ ఫిర్యాదులు? అవి నిరాధారమా? ఎంతమాత్రం కాదు. కాకపోతే అవి స్వయంకృతం. చరిత్రలో ఏ మహా శక్తివంతమైన సామ్రాజ్యం కూడా శాశ్వతంగా నిలవలేదు. ప్రతి దానికీ కాలక్రమంలో ఏవో కొన్ని బలహీనతలు ఎదురవుతూ వచ్చాయి. వాటిలో అంతర్గత లోపాల వల్ల సృష్టి అయినవి కొన్నయితే, బయటి పరిణామాల వల్ల ఎదురైనని కొన్ని. అమెరికా విషయానికి, అందుకు అనుబంధంగా యూరప్ విషయానికి వచ్చినట్లయితే, అవి ఒకప్పటి స్థాయిలో తమంత తాముగా, అంతర్గతమైన వృద్ధిని సాధించటం లేదు. బయటి ప్రపంచాన్ని చూస్తే వేర్వేరు ఖండాలలో పలు దేశాలు ముఖ్యంగా 21వ శతాబ్ది కాలం నుంచి గణనీయంగా తమంతట తాము అభివృద్ధి చెందుతున్నాయి.
వాటికి తమ స్వంత లక్షాలు, స్వాభిమానాలు ఏర్పడుతున్నాయ. ఒకప్పటివలే ప్రతి దానికీ పాశ్చాత్య ఆధిపత్యం పట్ల తలలూటం లేదు. ఈ పరిణామాల నుంచి పుట్టుకు వచ్చిందే బహుళ ధ్రువ ప్రపంచ భావన. ‘బ్రిక్స్’ వంటి ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్లుటిఒలను సంస్కరించాలనే డిమాండ్లు. ఒకవైపు తమ ఆర్థిక విధానాల లోటుపాట్ల కారణంగా విపరీతంగా పెరుగుతున్న వాణిజ్య లోటు, పారిశ్రామిక, ఉపాధి కల్పనాపరమైన బలహీనతలు, మరొకవైపు బహుళ ధ్రువ ప్రపంచం రూపుతీసుకుంటూ తమకు సవాలుగా మారుతున్న తీరు అమెరికన్లను, యూరోపియన్లకు కొంత కాలంనుంచే ఆందోళనలను కలిగిస్తున్నాయి. ఏమి చేసైనా సరే తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్నది వారి పట్టుదల. పాశ్చాత్య ప్రపంచానికి నాయకత్వ స్థానంలో ఉన్న అమెరికా మొదట అందుకు చొరవ తీసుకోవాలి. కాని ఈ ధోరణితో ఆ లక్షాలు నెరవేరటం సందేహాస్పదం. ఎందుకంటే, ప్రపంచం తన దారిలో ముందుకు పోతున్నది.
– టంకశాల అశోక్