Sunday, March 9, 2025

టారీఫ్ లా… ట్రంప్ టార్గెట్ లా!

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 2 నుంచి అమెరికా ప్రతీకార భారీ సుంకాల భారం మోయనున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇవి టారిఫ్‌లని చెప్పడం కన్నా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెట్టుకున్న టార్గెట్‌లుగా భావించక తప్పదు. ఏయే దేశాలు అమెరికా దిగుమతులపై భారీగా సుంకాలు విధించాయో ఆయా దేశాలనే లక్షంగా పెట్టుకుని భారీగా సుంకాలు విధింపునకు పాల్పడ్డారు. ఇంతవరకు అమెరికా సంపదనంతా వారు దోపిడీ చేశారన్న వ్యతిరేక అభిప్రాయం ట్రంప్ మనసులో నాటుకుంది. అందుకనే మిత్రదేశాలన్న విచక్షణ లేకుండా సుంకాల వేటు విధించారు. ట్రంప్ ఇదివరకు మొదటిపాలనలో భారత్ పట్ల చాలా మిత్రత్వం చూపించారు.

ప్రధాని మోడీ తనకు ఆత్మీయుడని సంబోధించారు. కానీ రెండవసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక తాను ఫక్తు వ్యాపారస్థుడినే అన్నట్టు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు? అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీ గత నెల అమెరికా పర్యటనలో ట్రంప్‌తో సుంకాల సమస్య ప్రస్తావించినప్పుడు ట్రంప్ ఏమాత్రం మెత్తపడలేదు. మీరెంత సుంకం విధిస్తే మేమూ అంత విధిస్తాం అని తేల్చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2 నుంచి అమెరికా ప్రతీకార సుంకాల వల్ల భారత్‌కు ఏటా 700 కోట్ల డాలర్ల (61 వేల కోట్లు ) వరకు నష్టం తప్పదని అంచనాలు వెలువడుతున్నాయి.

భారత్ నుంచి అమెరికాకు ముఖ్యంగా దిగుమతి అయ్యే వాటిలో ముత్యాలు, రంగురాళ్లు, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. అలాగే అమెరికా నుంచి భారత్‌కు దిగుమతయ్యే వాటిలో ఎలక్ట్రికల్ మెషినరీ పరికరాలు, అణు రియాక్టర్లు యంత్రాలు, ఖనిజ ఇంధనాలు చమురు, లెన్సులు, మైక్రోస్కోపులు, వైద్య పరికరాలు ఉన్నాయి. అయితే అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా భారత్‌లో కొన్ని రంగాలు ప్రభావితం కానున్నాయి. రసాయనాలు, లోహ ఉత్పత్తులు, ఆభరణాలు అత్యధికంగా ప్రభావితమవుతాయని, ఆటోమొబైల్స్, ఔషధాలు, ఆహార ఉత్పత్తులపై కూడా ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు.

మన దేశానికి అమెరికానుంచి దిగుమతయ్యే 8562 ఉత్పత్తుల్లో 6500 వస్తువులపై 10 శాతం కంటే తక్కువ సుంకాలే ఉన్నాయని, 8400 ఉత్పత్తులపై 20 శాతం కంటే తక్కువ సుంకాలే అమలవుతుండగా, 216 ఉత్పత్తులపై అసలు సుంకాలే లేవని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు భారత్ నుంచి 761 మిలియన్ డాలర్ల స్టీల్, 382 మిలియన్ డాలర్ల అల్యూమినియం దిగుమతులపై వరుసగా 25 శాతం, 10 శాతం వరకు సుంకాలు విధించారు. దీనికి ప్రతిగా 2019లో భారత్ ప్రభుత్వం 28 అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను విధించింది. ఈసారి కూడా ట్రంప్ అధికారం చేపట్టగానే మన దేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై 25 శాతం సుంకం విధించారు.

దీనివల్ల అమెరికాకు స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల ఎగుమతుల్లో 5 నుంచి 10 శాతం వరకు తగ్గుదల కనిపించవచ్చని భావిస్తున్నారు. అమెరికా నుంచి లగ్జరీ కార్లు, హైఎండ్ బైకులు, ఎలెక్ట్రానిక్స్, సోలార్ సెల్స్, కెమికల్స్, బోర్బన్ విస్కీ వంటి విలాస వస్తువులు ఎక్కువగా మనకు దిగుమతి అవుతుంటాయి. ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపును భారత్ కోరుతోంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బిటిఎ) ఉన్నప్పుడు ఇవి విరివిగా అమ్ముడవుతుండేవి. ఈ ఒప్పందంపై అమెరికాతో కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. స్టీల్, అల్యూమినియం పై మార్చి 12 నుంచి అమెరికా విధించనున్న భారీ సుంకాలను తగ్గించాలని గత నెల ట్రంప్‌ను మోడీ అభ్యర్థించినా ఫలించలేదు.

అయితే ఈలోగా ఏయే ఉత్పత్తులపై సుంకాలు తగ్గించడానికి వీలవుతుందో ఒక జాబితా భారత్ తయారు చేసింది. ఈ జాబితాలో లగ్జరీ కార్లు, ఎలెక్ట్రానిక్స్, సోలార్ సెల్స్, కెమికల్స్ తదితర వస్తువులు ఉన్నాయి.అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా చైనా, కెనడా అమెరికా దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తున్నట్టు హెచ్చరించాయి. కానీ ఈ విధమైన ప్రతీకార ధోరణి కాకుండా అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారానే సుంకాల సమస్యను పరిష్కరించుకోడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే అమెరికాయే భారత్‌కు భారీ ఎగుమతుల మార్కెట్. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ మొత్తం 119.7 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో భారత్ నుంచి అమెరికాకు అయ్యే ఎగుమతుల విలువే 77.51 బిలియన్ డాలర్ల వరకు ఉండడం గమనార్హం.

కానీ ఆటోమొబైల్‌పై భారత్ 100 శాతం కన్నా ఎక్కువగానే టారిఫ్‌లు విధించారని ట్రంప్ పదేపదే ఎత్తిపొడుస్తున్నారు. బుధవారం కాంగ్రెసేషన్ సమావేశంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. వాస్తవాలను పరిశీలిస్తే అమెరికా నుంచి వచ్చే దిగుమతులు చాలా వాటిపై భారతీయ సుంకాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఎక్కువ సరాసరిన 6.5 శాతం వరకు కనిపిస్తోంది. అయితే ఆటోమొబైల్‌పై టారిఫ్ కోత విధిస్తే ట్రంప్‌కు సంతృప్తి కలగవచ్చు. జపాన్, కొరియా, ఆసియాన్ దేశాలతో ఇదివరకు భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పాటించింది. దాని వల్ల స్వదేశీ పరిశ్రమలకు ఎలాంటి దెబ్బ కలగలేదు. అదే విధంగా ఒక ఒప్పందం ప్రకారం టారిఫ్ కోతలను అమెరికాకు ఆఫర్ చేస్తే మనపై టారిఫ్‌ల భారం కొంతవరకు తగ్గవచ్చు. అయితే అమెరికా మాదిరిగా అన్ని దేశాలకు ఈ వెసులుబాటు వర్తింప చేయడం భారత్‌లోని స్వదేశీ పరిశ్రమలకు నష్టం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News