వరుసగా మూడు రోజులు పతనానికి గురైన స్టాక్ మార్కెట్లు మళ్లీ కాస్త పుంజుకోవడం ఆశావహ పరిణామం. అయితే ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. అగ్రరాజ్యాధినేత ట్రంప్ మహాశయుడు ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ రోజు ఏ దేశంపై సుంకాల మోత మోగిస్తారో తెలియదు కాబట్టి, ఏ క్షణమైనా మార్కెట్లు మళ్లీ ఒడిదుడుకులకు గురైతే ఆశ్చర్యపోనక్కరలేదు. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడం, అందుకు చైనా కూడా దీటుగా ప్రతిస్పందించడంతో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి.
కేవలం అమెరికా, చైనాయే కాకుండా జపాన్, హాంకాంగ్, తైవాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాల మార్కెట్లు అల్లకల్లోలానికి గురయ్యాయి. ఇక భారత మార్కెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సెన్సెక్స్ 2,200, నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోగా, మదుపరుల సంపదగా భావించే బిఎస్‌ఇలోని కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్క రోజే 14 లక్షల కోట్లు తగ్గింది. దిగ్గజ పారిశ్రామికవేత్తలు అంబానీ, అదానీ వంటివారి సంపదకు సైతం మినహాయింపు దక్కలేదు. ఒక దశలో పది సెకన్లలోనే మదుపర్ల సంపద 20 లక్షల కోట్ల రూపాయల మేరకు ఆవిరైపోయిందంటే సుంకాల ఘాతం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో 2020 మార్చి 23న సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. ఆ తర్వాత ఆ స్థాయిలో మార్కెట్లు పడిపోవడం ఇదే మొదటిసారి. సుంకాల బాదుడు వెనుక ట్రంప్‌కు పెద్ద వ్యూహమే ఉన్నట్లు ఆర్థికవేత్తలు అనుమానిస్తున్నారు.
పేరుకు అగ్రరాజ్యమే అయినా, ఆ దేశం మెడపై రుణాల కత్తి వేలాడుతోంది. అమెరికా ఇప్పటివరకూ చేసిన అప్పు అక్షరాలా 36 లక్షల కోట్ల డాలర్లు. పైగా ద్రవ్యలోటు కూడా జిడిపిలో ఆరు శాతానికి చేరుకుంది. అప్పులు చెల్లించేందుకు డబ్బుకు ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో దిగుమతులపై సుంకాలు పెంచి, దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టి వడ్డీ రేట్లు తగ్గించుకోవాలన్నది ట్రంప్ వ్యూహంగా అనుమానిస్తున్నారు. అందుకనే కాబోలు, స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నా ట్రంప్ పట్టించుకోకపోగా, సుంకాల కారణంగా ద్రవ్యోల్బణం పెరగదనీ, వడ్డీరేట్లు తగ్గిస్తే అంతా సర్దుకుంటుందని అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ‘అమెరికా బలంగా ఉంది.
సుంకాలు విధించిన తర్వాత ఉద్యోగాలు, పెట్టుబడులు అమెరికాకు తిరిగి వస్తున్నాయి. మాతో రాజీకి రావాలని యూరోపియన్, ఆసియా నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు’ అని ట్రంప్ దబాయిస్తున్నారు. కానీ రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన చైనా మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగడం లేదు. అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు విధించడంతో ఆగకుండా, కీలక ఖనిజాల సరఫరాను నిలిపివేస్తామంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ ఇరు దేశాలూ వాణిజ్య యుద్ధానికి దిగితే, ఆ ప్రభావం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌కు ఇది మరీ ప్రమాదకరం. మరోవైపు తాజా పరిణామాల కారణంగా భారతీయ ఐటి కంపెనీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అమెరికా, యూరప్‌లలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందన్న భయాలవల్ల భారతీయ ఐటి కంపెనీలకు కాంట్రాక్టులు తగ్గే అవకాశం ఉంటుంది. మన ఐటి కంపెనీలకు వచ్చే ఆదాయంలో 60 శాతం అక్కడినుంచే కావడం అందుకు కారణం.
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెపి మోర్గాన్ సైతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలు 60 శాతం ఉన్నట్లు అంచనా వేయడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ దశలో సరికొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాలు అగ్రరాజ్యం ఎదుట క్యూ కడుతున్నాయంటూ వస్తున్న వార్తల్లో ఆశ్చర్యం ఏముంటుంది? ఇలా ఇప్పటికే 50 దేశాలు ముందుకు వచ్చినట్లు స్వయంగా శ్వేతసౌధం ప్రకటించడం కూడా మంగళవారంనాడు మార్కెట్లు కోలుకోవడానికి గల కారణాలలో ఒకటని చెప్పవచ్చు. కాబట్టి చర్చలు మాత్రమే మార్కెట్ల పతనాన్ని ఆపగలవు. సుంకాల మోత తప్పించుకునేందుకు అగ్రరాజ్యంతో చర్చలు జరపడం మినహా ప్రస్తుతానికి భారత్ ముందు మరో అవకాశం లేదు.