తొలుత ట్రూత్ సోషల్ నెట్
ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకు పోటీ?
త్వరలోనే వార్తలతో మరో వేదిక
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తాను తన సొంత మీడియా సంస్థను ఆరంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ట్రూత్ సోషల్ పేరిట సోషల్ మీడియా వేదిక అవతరిస్తుందని తెలిపారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టిఎంటిజి) పేరిట ట్రంప్ సమాచార ప్రసారాల మాధ్యమాల వేదికకు రంగం సిద్ధం అయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఘట్టంలో ఆ తరువాత జనవరి 6న జరిగిన క్యాపిటల్ భవనంపై ట్రంప్ వర్గీయుల దాడి ఘటనల దశలో ట్రంప్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి మాధ్యమాలు బహిష్కరించాయి. దీనితో సోషల్ మీడియాలో ప్రాచుర్యపు నేతలలో ఒక్కరుగా పేరొందిన ట్రంప్ దాదాపు తొమ్మిది నెలలుగా ఇంటర్నెట్‌లో కన్పించి కన్పించకుండా గడుపుతున్నారు. తాలిబన్ల వంటి వారు కూడా ఇప్పుడు సోషల్ మీడియాతో తమ ప్రచార ఆర్బాటానికి దిగుతున్నారు.
కానీ బాధ్యతాయుతమైన ఓ వ్యక్తిని ఈ విధంగా సోషల్ మీడియా కట్టడి చేసింది. ఈ అత్యంత క్రూరమైన భారీ టెక్ కంపెనీల సోషల్ మీడియా వ్యవహారానికి ప్రతిఘటనగా తాను ఈ సొంత సామాజిక మాధ్యమాన్ని అనివార్య పరిణామంగా ఆరంభించినట్లు ట్రంప్ ఈ నేపథ్యంలో తెలిపారు. ట్రంప్ భారీ స్థాయిలోనే సొంతంగా మీడియా రంగంలో కీలక పాత్రకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తన ప్రత్యర్థులు బిగ్ టెక్ కంపెనీలే అని ట్రంప్ ప్రకటించారు. ట్రూత్ సోషల్ యాప్‌ను తీర్చిదిద్దుతున్నట్లు టిఎంటిజి ద్వారా ఇది ఆరంభపు మీడియా సాధనం అని ట్రంప్ తమ ఇన్నినెలల ఇంటర్నెట్ మౌనం వీడుతూ ప్రకటించారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా స్పందనలతోనే ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన పోస్టింగ్‌లకు దేశవిదేశాలలో ప్రాచుర్యత దక్కింది. ట్విట్టర్‌లో తాలిబన్ల భారీ ఉనికి కనబడుతోంది. ప్రియమైన అమెరికా ప్రెసిడెంట్‌ను ట్విట్టర్ వెలివేసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ మీడియా కంపెనీని డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ కార్ప్‌తో విలీనం ద్వారా ఏర్పాటు చేశారు. ట్రంప్ సోషల్ మీడియా సంస్థ త్వరలోనే లిస్టెడ్ కంపెనీ అవుతుందని తెలిపారు. పలు వ్యాపార రంగాలతో పూర్వ అనుబంధం ఉన్న ట్రంప్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల నుంచి వెలి తరువాతి దశలో తన వెబ్‌సైట్ ద్వారానే బ్లాగ్‌ను ఏర్పాటు చేయాలని భావించారు. అయితే ఇది సరైన స్పందన లేకపోవడంతో విఫలయత్నం అయింది. వచ్చే నెలలోనే ట్రంప్ సొంత వేదిక ట్రూత్ సోషల్ అందుబాటులోకి వస్తుంది. తరువాతి క్రమంలో దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది ఆరంభంలో విస్తృతమవుతుంది. కాలక్రమంలో ట్రంప్ మీడియా సంస్థ ద్వారా వీడియో ఆన్ డిమాండ్ సేవలను ప్రారంభిస్తుంది. ఇందులో వినోదకార్యక్రమాలు, వార్తలు, రేడియో ప్రసారాలను, విమర్శనాత్మక ప్రోగ్రాం వంటివి ఉంటాయి.