Monday, December 23, 2024

అమెరికాలో మరోసారి పాత ప్రత్యర్థులు?

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్ష పదవికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాత ప్రత్యర్థులైన జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇటీవల జరిగిన డెమొక్రాటిక్ పార్టీ నేతల సమావేశంలో మరోసారి అధ్యక్ష పదవి బరిలో నిలవాలన్న మనసులోని మాటను జో బైడెన్ వ్యక్తం చేశారు. అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తారా అంటూ పార్టీ నేతలను జో బైడెన్ సూటిగా అడిగారు. అయితే బైడెన్ ఇలా అడగటం డెమొక్రాటిక్ పార్టీ వర్గాలను ఆశ్చర్యపరచింది. దీనికి కారణాలు లేకపోలేదు. కొంత కాలంగా జో బైడెన్ పొలిటికల్ గ్రాఫ్‌పడిపోతోంది. అమెరికా రాజకీయాల్లో దుమారం రేపిన రహస్య పత్రాల అంశం జో బైడెన్ ప్రతిష్ఠను ఘోరంగా దెబ్బతీసింది. బరక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉపాధ్యక్షుడిగా జో బైడెన్ పనిచేశారు.

అలనాటి సర్కార్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపరచినవే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన సీక్రెట్ డాక్యుమెంట్స్. అమెరికాలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆఐదేళ్ల కాలం నాటి కీలక సమాచారాన్ని రహస్య పత్రాల్లో పొందుపరుస్తారు. అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు తదితర ఉన్నత స్థాయిలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే రహస్య పత్రాలు అందుబాటులో ఉంటాయి. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరైనా తమ పదవీ కాలం పూర్తి కాగానే వాటిని అమెరికా జాతీయ ఆర్కైవ్స్‌కు అప్పగిస్తారు. అమెరికా ప్రభుత్వాల రహస్యాలను కాపాడుకోవడానికి దీనినొక నిబంధనగా చేశా రు. అయితే అంతటి కీలకమైన రహస్య ఫైళ్లు ఇటీవల జో బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటి పాత కార్యాలయాల్లోనూ, అలాగే ఆయన నివాసంలోనూ గుట్టలు గుట్టలుగా దొరికాయి. దీంతో వివాదం మొదలైంది. జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్ టాప్ ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీలకంగా మారింది. ఈ ల్యాప్ టాప్ లోని సమాచారాన్ని విశ్లేషించే కొద్దీ అందరూ ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి.

అంతిమంగా జో బైడెన్ ఉపాధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని అప్పట్లో ఆయన కుమారుడు హంటర్ బైడెన్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడన్న తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇవేమీ ఉత్తుత్తి ఆరోపణలు కావు. ఈ ఆరోపణలను బలపరిచే అనేక కీలక ఆధారాలు హంటర్ బైడెన్ ల్యాప్ టాప్‌లో దొరికాయి. ప్రతిపక్షమైన రిపబ్లికన్ పార్టీకి ఈ సీక్రెట్ డాక్యమెంట్స్ ఎపిసోడ్ ఒక వరంలా దొరికింది. అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో రహస్య పత్రాల అంశం ఒక కీలకాంశంగా మారే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.78 ఏళ్ల వయసులో అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు వ్యక్తిగతంగా అమెరికా సమాజంలో గుడ్‌విల్ ఉంది. నిజాయితీపరుడన్న పేరుంది. అయితే తాజాగా వెలుగుచూసిన రహస్య పత్రాల వ్యవహారంతో ఆయన నిజాయితీపై నీలినీడలు కమ్ముకున్నాయి. పైపెచ్చు రహస్య పత్రాల బాగోతం 2022లోనే బయటపడ్డా మధ్యంతర ఎన్నికల్లో లబ్ధి కోసం ఆ విషయాన్ని జో బైడెన్ తొక్కిపెట్టారన్నది మరో ఆరోపణ. ఇదంతా సగటు అమెరికన్లకు మింగుడుపడలేదు. ఈ నేపథ్యంలో జో బైడెన్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జో బైడెన్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే డెమొక్రాటిక్ పార్టీకి గెలుపు సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. జో బైడెన్‌కు మరోసారి పోటీ చేయాలన్న కోరిక సంగతి ఎలాగున్నా అందుకు డెమొక్రాటిక్ పార్టీ నేతలు ఏ మేరకు అంగీకరిస్తారన్నది ప్రశ్నార్థకమే.

దుందుడుకు మనస్తత్వానికి మారుపేరుగా నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మరోసారి పోటీ చేస్తానంటున్నారు. అధ్యక్ష పదవి రేసులో తాను ఉంటానని ట్రంప్ మహాశయుడు ఇటీవల కుండబద్దలు కొట్టారు. అగ్రరాజ్యానికి పూర్వవైభవం రావాలంటే తన నాయకత్వమే శరణ్యమన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విధానాల ఫలితంగా ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అఫ్ఘాన్ పరిణామాలు, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడిని నిలువరించడంలో వైఫల్యం, అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా ఉనికిని నామమాత్రం చేశాయన్నది డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ప్రస్తుతం తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్‌పై సైనికదాడి జరిగేదే కాదని ట్రంప్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు నచ్చేచెప్పేవాడినన్నారు.పుతిన్‌కు నచ్చచెప్పే శక్తిసామర్థ్యాలు జో బైడెన్‌కు లేవన్నది మొత్తంగా ట్రంప్ మహాశయుడి వ్యాఖ్యల సారాంశం. మరోసారి వైట్‌హస్‌లో కూర్చోవడానికి ట్రంప్ మహాశయుడు ఎంతగా తహతహలాడుతున్నారో ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

మేక్ అమెరికా గ్రేట్ అగైన్ 2016లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఉపయోగించిన మంత్రం ఇదే. ఈ మంత్రం జనంలోకి దూసుకెళ్లింది. అలాగే నేటివిటీని టార్గెట్‌గా చేసుకుని ట్రంప్ చేసిన ప్రచారం కూడా ఫలితాన్నిచ్చింది. కొన్ని తరాలుగా అమెరికాలో పుట్టి పెరిగిన నేటివ్ అమెరికన్లు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే, ఆసియా దేశాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన వారు కార్పొరేట్ రంగాల దిగ్గజాలుగా మారుతున్నారంటూ ట్రంప్ చేసిన విద్వేషపూరిత ప్రచారం అమెరికా రాజకీయాల్లో దుమారం రేపిం ది. భూమి పుత్రులైన అమెరికన్లను బాగా రెచ్చగొట్టింది. దీంతో భూమిపుత్రులు డొనాల్ట్ ట్రంప్‌కు జై కొట్టారు. ఈసారి కూడా అదే మంత్రాన్ని ఉపయోగించడానికి డొనాల్డ్ ట్రంప్ రెడీ అవుతున్నారు. అమెరికా చరిత్రలో డోనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు లేరంటారు రాజకీయ విశ్లేషకులు. డోనాల్డ్ ట్రంప్ ఒక వివాదాల పుట్ట. అయితే ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునే రకం కాదు డోనాల్డ్ ట్రంప్. తాను అనుకున్నదే అమలు చేస్తూ ముందుకు సాగడమే డోనాల్డ్ ట్రంప్ నైజం. 2021 జనవరి 6వ తేదీన పార్లమెంటు భవనంపై జరిగిన దాడి సంఘటన, డోనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది.

ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ విచారణ కమిటీ సిఫార్సు చేసింది. పార్లమెంటు భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టారని విచారణ కమిటీ తేల్చి చెప్పింది. అమెరికా చరిత్రలో ఇదొక అనూహ్య పరిణామం. ఇదొక్కటే కాదు అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే. ఇంతటి ఘన చరిత్రను ట్రంప్ మూటగట్టుకున్నారు. ఇంత అపఖ్యాతిని మూటగట్టుకున్న డోనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు కావడం ప్రశ్నార్థకమే. పార్లమెంటు భవనంపై జరిగిన దాడి ట్రంప్‌కు మైనస్‌గా మారే అవకాశాలున్నాయి. ఈ దాడిని ఇప్పటికీ అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే రిపబ్లికన్ పార్టీ నుంచి ఈసారి అధ్యక్ష పదవి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారిలో చాలా మంది సీనియర్ నేతలున్నారు. వీరిలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ కూడా ఉన్నారు. అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం లభించాలంటే ముందుగా వీరితో ప్రైమరీ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ పోటీపడి నెగ్గాల్సి ఉంటుంది.ఆ తరువాత ప్రతినిధుల సభలో ట్రంప్ మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. డోనాల్డ్ ట్రంప్‌కు అభ్యర్థిత్వం ఖరారు కావడం సంగతి ఎలాగున్నా ఇప్పటికైతే అధ్యక్ష పదవి ఎన్నికకు ఆయన ఉత్సాహంగా రెడీ అవుతున్నారు. ఏమైనా రహస్య పత్రాల ఎపిసోడ్‌ను డెమొక్రాటిక్ పార్టీ పెద్దగా పట్టించుకోకపోయినా, పార్లమెంటు భవనంపై దాడి సంఘటనను రిపబ్లికన్ పార్టీ క్షమించేసినా పాత ప్రత్యర్థులు జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మరోసారి తలపడే అవకాశాలు లేకపోలేదు.

ఎస్.అబ్దుల్ ఖాలిక్
6300174320

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News