Tuesday, January 21, 2025

మన దేశంపై ట్రంప్ ప్రభావం

- Advertisement -
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు ఘన విజయం సాధించి శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో భారత్ అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలకు ఎలాంటి అంతరాయం లేకున్నా భారత్‌లోని వాణిజ్య, పారిశ్రామిక రంగాలపై వివిధ రూపాల్లో ట్రంప్ ప్రభావం ఉంటుందని పరిశోధన సంస్థ జిటిఆర్‌ఐ (గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్) విశ్లేషించింది. భారత వాణిజ్యానికి సంబంధించి విదేశీ ఎగుమతులకు ప్రధాన అగ్రస్థాయి గమ్యస్థానం అమెరికాయే. 2023 24 మధ్య కాలం లో అమెరికాకు భారత్ నుంచి 77.51 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరగ్గా, అమెరికా నుంచి అదే కాలంలో భారత్‌కు 42.19 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మళ్లీ రెండోసారి అధ్యక్షునిగా శ్వేతభవనంలో అడుగుపెడితే భారత్‌కు లాభం కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని జిటిఆర్‌ఐ విశ్లేషణ అంచనా వేసింది.

భారత దేశ ఎగుమతులపై సుంకాలు (టారిఫ్స్) భారీగా విధించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కార్మిక, పర్యావరణ చట్టాలపై ఉదారవాదం ప్రదర్శించవచ్చు. దీని వల్ల భారత ఎగుమతిదారులు తమ ప్రమాణాలు సాధించడం సులువవుతుంది. చైనాను అధిగమించి భారత్‌తో సహా ఇతర దేశాలపై సుంకాలను పొడిగించవచ్చు. గతంలో ట్రంప్ భారత్‌ను భారీ టారిఫ్ దుర్వినియోగదారునిగా వ్యాఖ్యానించారు. అంటే రెండోసారి కూడా ఈ విషయంలో ట్రంప్ గట్టిగానే వ్యవహరించవచ్చు. ఈసారి ఆయన అజెండా ‘అమెరికా ఫస్ట్’కే ప్రాధాన్యం కల్పిస్తారని భావిస్తున్నారు. దీని వల్ల భారత ఎగుమతులపై పరస్పర సుంకాల ప్రభావం కనిపిస్తుంది. ఆటోమొబైల్స్, వైన్స్, వస్త్రాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి కీలకమైన భారతీయ ఎగుమతులపై అడ్డంకులు ఎక్కువగా ఎదురవుతాయి. ఫలితంగా అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులు అంతగా పోటీ ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతుంది. ఈ రంగాల్లోని ఆదాయంపై వ్యతిరేక ప్రభావం పడుతుంది.

2017 జనవరి నుంచి 2021 జనవరి మధ్య ట్రంప్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో భారత్‌పై ‘టారిఫ్ రారాజు’ గా ముద్రవేసి భారతీయ స్టీల్, అల్యూమినియం ఉత్పత్తుల ఎగుమతులపై టారిఫ్ జరిమానాలు విధించారు. అంతేకాదు జిఎస్‌పి స్కీమ్ కింద ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగించారు. జిఎస్‌పి అంటే జెనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఇది వాణిజ్య ప్రాధాన్యతల వ్యవస్థ. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థికాభివృద్ధిని, వాణిజ్య అభివృద్ధిని ఇది ప్రోత్సహిస్తుంది. వివిధ దేశాలతో వాణిజ్యాన్ని విస్తరింప చేసుకోవడానికి దోహదం చేస్తుంది. అలాంటి జిఎస్‌పి స్కీమ్ నుంచి భారత్‌ను పనిగట్టుకుని ఆనాడు ట్రంప్ తొలగించడం చర్చనీయాంశం అయింది.

కార్మిక, పర్యావరణ చట్టాలపై ట్రంప్ ఉదారవాదం చూపిస్తారన్న విశ్లేషణను పరిశీలిస్తే అమెరికా మార్కెట్‌లోకి భారత ఎగుమతులు సులువుగా ప్రవేశించడానికి మార్గం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇదివరకటి పదవీ కాలంలో ట్రంప్ పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకున్నట్టే, ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశం (యుఎన్‌ఎఫ్‌సిసిసి) నుంచి కూడా వైదొలిగారు. ఈసారి కూడా వాటి నుంచి పూర్తిగా నిష్క్రమించడానికి తగిన ఉత్తర్వులను ఆయన సలహాదారులు రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా భూతాప నివారణ ప్రయత్నాలు అమెరికా నుంచి బలహీనమవుతాయి. అలాగే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి కార్బన్ పన్ను ప్రణాళికలను పరిష్కరించడానికి యూరోపియన్ యూనియన్ ఏర్పాటు చేసిన కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సిబిఎఎం) నుంచి కూడా ట్రంప్ వైదొలిగే అవకాశం ఉంది. ఈ సిబిఎఎం విధానాల వల్ల ఇనుప ఖనిజం, ఉక్కుతో సహా ట్రేడింగ్ బ్లాక్‌కు భారతదేశం భారీ ఎగుమతుల్లో కొన్నిటికి ముప్పు కలుగుతోంది. ఇప్పుడు ట్రంప్ సిబిఎఎం నుంచి వైదొలిగితే అలాంటి ముప్పు తప్పుతుంది.

ఇక వర్క్ వీసాల విషయంలో ట్రంప్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల వీసా నిబంధనల్లో మార్పులు వస్తాయి. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లడానికి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హెచ్1బి వర్క్ పర్మిట్, ఎఫ్1 స్టూడెంట్ వీసా, విజిటర్ వీసా, హెచ్4 డిపెండెంట్ వీసా, హెచ్3 వీసా, 1 వీసా, 01 వీసా, పి వీసా, ఆర్1 రెలీజియస్ వీసా ఈ విధంగా అనేక నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ద్వారా అమెరికాకు వెళ్తుండటం పరిపాటిగా వస్తోంది. ఇప్పుడు ఈ వీసా నిబంధనలను పటిష్టం పేరుతో ట్రంప్ కఠినం చేస్తే ఈ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా భారత్‌లోని ఐటి ప్రొఫెషనల్స్‌కు సమస్యలు ఎదురవడమే కాకుండా ఐటి కంపెనీల ఖర్చులు పెరుగుతాయని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News