డాలర్‌ను దూరం పెట్టారంటే పన్నులు 100 శాతం పెంచుతామని అల్టిమేటం
అమెరికాకు ఎగుమతులు చేయలేరని హెచ్చరిక
అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని వ్యాఖ్య
వెస్ట్ పామ్ బీచ్ (యుఎస్) : అంతర్జాతీయ వర్తకంలో డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. డాలర్‌ను దూరం పెట్టే ప్రయత్నాలు చేసే దేశాలు అమెరికాతో వర్తకానికి కూడా దూరం కావలిందేనని ట్రంప్ ‘ట్రూత్ స్పెషల్’ పోస్ట్‌లో హెచ్చరించారు. ట్రంప్ ఈ మేరకు బ్రిక్స్ దేశాలు భారత్, బ్రెజిల్, చైనా, రష్యా. దక్షిణాఫ్రికాలకు నేరుగా హెచ్చరిక జారీ చేశారు. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ స్థానంలో మరొక కరెన్సీ ఉపయోగించాలని బ్రిక్స్ దేశాలు ఇటీవల నిర్ణయించాయి.
దీనిపై ట్రంప్ స్పందిస్తూ, డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. డాలర్ స్థానంలో వేరే కరెన్సీ ఉపయోగించే దేశాలపై పన్నులు పెంచుతామని ఆయన తెలిపారు. అమెరికాకు ఆయా దేశాలు ఉత్పత్తి చేసే వస్తువులపై 100 శాతం పన్నులు పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల యత్నాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటామని, డాలర్‌కు దూరంగా జరిగే దేశాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటు ఉండదని ఆయన హెచ్చరించారు. అమెరికాకు ఎగుమతుల విషయం మరచిపోవలసి వస్తుందని ట్రంప్ సూచించారు.
కాగా, అక్టోబర్ రష్యాలోని కజన్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీ ఉపయోగించాలని అవి నిర్ణయించాయి. దీని వల్ల స్థానిక కరెన్సీ బలోపేతం అవుతుందని అవి అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఆ సమావేశంలో ఈజిప్ట్, ఇరాన్, యుఎఇ ఆ ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి. బ్రిక్స్ దేశాలు ఈ మేరకు ఒక డిక్లరేషన్‌పై సంతకం చేశాయి. దీనిపై తాజా స్పందనగానే ట్రంప్ భారత్ సహా బ్రిక్స్ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.