లండన్: బ్రిటీష్ ఆర్థిక మంత్రి పదవినుంచి తొలగించిన క్వాసి క్వార్టెంగ్ స్థానంలో మాజీ కేబినెట్ మంత్రి, కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వం కోసం పోటీ పడిన జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ శుక్రవారం ప్రకటించారు. క్వార్టెంగ్ గత నెల ప్రకటించిన మినీ బడ్జెట్ అధికార పార్టీలోనే తిరుగుబాటుకు కారణం కావడంతో ఆయనను ఆర్థిక మంత్రి పదవినుంచి ట్రస్ తొలగించిన విషయం తెలిసిందే. తన అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ట్రస్ ఈ విషయం ప్రకటించారు.
అంతేకాదు గత నెల క్వార్టెంగ్ తన మినీ బడ్జెట్‌లో ఉపసంహరించిన కార్పొరేట్ పన్ను పెంపును ఉపసంహరించుకుని గత ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రకటించినట్లుగా ఈ పన్నును 19 శాతంనుంచి 25 శాతానికి పెంచుతున్నట్లుగా కూడా ట్రస్ ప్రకటించారు. కాగా బ్రిటీష్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆ పదవికి పోటీ పడ్డవాళ్లలో హంట్ కూడా ఉన్నారు. మొదట పోటీలో కొనసాగినప్పటికీ ఆ తర్వాత ఆయన రిషి సునక్‌కు మద్దతు ప్రకటించి పోటీనుంచి వైదొలిగారు. ఇప్పుడు హంట్‌ను ఆర్థిక మంత్రిగా నియమించడం ద్వారా అధికార కన్సర్వేటివ్ పార్టీలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చవచ్చని ట్రస్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసమ్మతి వర్గంలో అధిక సంఖ్యాకులు రిషి సునక్ మద్దతుదారులే కావడం గమనార్హం.