Thursday, December 26, 2024

నమ్మకమే ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాలలో ప్రభుత్వాలు నిరంకుశ విధానాలు, అణచివేత పద్ధతులకు పాల్పడుతున్నాయని, పౌరులు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు అనుచితమైన అడ్డంకులు సృష్టిస్తున్నాయని, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తున్నాయని, హక్కుల కోసం గొంతెత్తుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని వేధిస్తున్నారని ఒకవంక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పైగా, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు నిరంకుశ వ్యవస్థలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నాయని వెల్లడికావడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే, ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విశ్వాసాలు మాత్రం చెక్కుచెదరకపోవడం సంతోషం కలిగిస్తున్నది. ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, పాలకులు నిరంకుశ విధానాలు అవలంబించేందుకు వెనుకాడకపోతున్నప్పటికీ, అసమ్మతి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రజాస్వామ్యమే ఉత్తమమైన వ్యవస్థ అనే నమ్మకాని అత్యధిక ప్రజలు విడనాడటం లేదు.

‘డెమోక్రసీ పర్సెప్షన్ ఇండెక్స్’ 2024 ఎడిషన్ ప్రకారం, గత ఆరు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి మద్దతు ఎక్కువగా ఉంటున్నట్లు స్పష్టం అవుతుంది. 53 దేశాలలో సర్వేకు స్పందించిన వారిలో సగటున 85% మంది ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉండటమే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. ఇది 2023, 2022లతో పోల్చితే ఒక శాతం, 2021 నుండి ఐదు శాతం పెరుగుదల కావడం గమనార్హం. 2019లో జరిగిన అంతర్జాతీయ పోల్ మొదటి ఎడిషన్ 79% ఆమోదం మాత్రమే పొందింది. అదే సమయంలో చాలా మంది ప్రతివాదులు తమ దేశంలోని ప్రజాస్వామ్య స్థితితో సంతృప్తి చెందడంలేదని వెల్లడి అవుతుంది.ఈ సంవత్సరం నివేదికలో ప్రపంచ జనాభాలో 75% మందిని కవర్ చేయగా సగటున 58% మంది మాత్రమే సంతృప్తి చెందుతున్నట్లు పేర్కొన్నారు.

పైగా, సగటున 40% మంది తమ దేశంలో తగినంత ప్రజాస్వామ్యం లేదని చెప్పారు. అయితే 46% మంది సరైన మేరకు ఉందని ధ్రువీకరించారు. అసంతృప్తిని కొలవడానికి, నివేదిక ప్రజలు ప్రజాస్వామ్యం ఎంత ముఖ్యమైనదని, తమ దేశం ఎంత ప్రజాస్వామ్యమని వారు అనుకుంటున్నారు అనే తేడాను వివరించే ప్రయత్నం చేసింది.2024లో ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రజాస్వామ్య లోటు’ 27 స్థాయిలో ఉంటుంది. విచిత్రం ఏమిటంటే, చైనా నుండి ప్రతివాదులు మరోసారి అసాధారణంగా అధిక శాతం తమ దేశంలో ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తిగా ఉన్నారని పేర్కొనన్నారు. సాధారణ అంచనాల ప్రకారం, ప్రపంచంలో అత్యంతనిరంకుశ, అణచివేతలతో స్వేచ్ఛ లేని దేశాలలో ఒకటిగా చైనా ఉంది. ‘సర్వే చేసిన కొన్ని దేశాలలో, ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుంది. కొన్ని అంశాలకు సంబధించిన వాక్ స్వాతంత్య్రాన్ని పరిమితం చేసే విధానాలను కలిగి ఉంది’ అని నివేదిక పేర్కొంది.

ఇది ‘సర్వే ఫలితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది’ అని గమనించాలి. అలయన్స్ ఆఫ్ డెమోక్రసీస్ ఫౌండేషన్ తరపున లతానా ఈ సర్వే నిర్వహించి, వారు నిర్వహించిన కోపెన్‌హాగన్ డెమోక్రసీ సమ్మిట్‌లో సమర్పించారు. అలయన్స్ ప్రెసిడెంట్, మాజీ నాటో సెక్రటరీ -జనరల్ ఆండర్స్ ఫాగ్ రాస్ముస్సేన్ ఆధ్వర్యంలో మే మధ్యలో జరిగిన కోపెన్‌హాగన్ సమావేశం సందర్భంగా వరల్డ్ లిబర్టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఇరాన్ అసమ్మతి వాది మాసిహ్ అలినేజాద్, ‘విప్లవం తప్ప పరిష్కారం లేదు’ అని స్పష్టం చేశారు. నిరంకుశ దేశాల సహకారం, అంతర్జాతీయ సంస్థలలో వారి ప్రాబల్యాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఐక్యరాజ్యసమితిని ‘యునైటెడ్ డిక్టేటర్స్’ అని అభివర్ణించారు.

ఈ సందర్భంగా ఐరోపా, అమెరికాలకు చెందిన ప్రజాస్వామ్య అనుకూల సంస్థలు, థింక్ ట్యాంక్‌లు, పౌర సమాజ సమూహాల ప్రతినిధులు ఒక కొత్త సహకార నెట్‌వర్క్, ట్రాన్సాట్లాంటిక్ డెమోక్రసీ సపోర్ట్ డైలాగ్‌ను ప్రారంభించడానికి నిర్ణయించారు. ప్రజాస్వామ్యంపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రిపోర్టర్‌ను నియమించడం సానుకూల పరిణామంగా భావించారు. ఈ గ్లోబల్ డెమోక్రసీ కూటమి ప్రారంభించిన ఈ కొత్త ప్రచారానికి ప్రజాస్వామ్య దేశాల నుండి మాజీ అధ్యక్షులు, ప్రధాన మంత్రులను ఒక చోట చేర్చే సంస్థ నాయకత్వం వహిస్తుంది. ఇది ‘ప్రజాస్వామ్య పద్ధతుల ప్రయోజనకరమైన ప్రభావాన్ని పాలనలో మాత్రమే కాకుండా జీవితంలోని అన్ని కోణాల్లో చూపడం’ లక్ష్యంగా పెట్టుకుంది.

మరో తాజా అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందుతున్న లేదా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా పరిగణించబడుతున్న 137 దేశాల్లో గత 20 ఏళ్లలో ప్రజాస్వామ్య నాణ్యత క్షీణించింది. బెర్టెల్స్ మాన్ ఫౌండేషన్ ‘ట్రాన్స్‌ఫర్మేషన్ ఇండెక్స్’ ప్రకారం, వీటిల్లో 74 నిరంకుశ దేశాలతో పోల్చితే, 63 ప్రజాస్వామ్యాలు ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే, స్వేచ్ఛా ఎన్నికలు లేదా రాజ్యాంగబద్ధమైన స్థితిని కలిగిఉండని దేశాల సంఖ్య పెరుగుతున్నది. గత రెండేళ్లలో మాత్రమే, ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం, కరోనా వైరస్ మహమ్మారి ద్వారా రూపొందించబడి ఏర్పడిన కొత్త భౌగోళిక వాతావరణంలో 25 దేశాలలో ఎన్నికలు జరిగిన ఎన్నికలు గతంలో కన్నాతక్కువ స్వేచ్ఛగా, నిష్పాక్షికతతో జరిగాయి.
ఈ అధ్యయనం ప్రకారం 39 దేశాలలో భావప్రకటనా స్వేచ్ఛ , పత్రికా స్వేచ్ఛ ఎక్కువగా పరిమితులకు గురవుతున్నది. ఈ అధ్యయనం రచయితలలో ఒకరైన సబీన్ డోనర్ లాక్ డౌన్, పౌర హక్కులపై తాత్కాలిక పరిమితుల ద్వారా ప్రజాస్వామ్య పరిణామాలపై కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపింది. ‘మహమ్మారి హక్కులను మరింత పరిమితం చేయడానికి, ప్రభుత్వాల చేతుల్లో అధికారాన్ని మరింత కేంద్రీకరించడానికి ఒక అవకాశం’ అని ఆమె వివరించారు. ప్రాథమికంగా, మహమ్మారి అప్పటికే లేని కొత్త సమస్యలను సృష్టించలేదు.

అయితే, అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సబీన్ డోనర్ పూర్తిగా నిరాశ చెందటం లేదు. ‘గత రెండు నుండి నాలుగు సంవత్సరాలలో ప్రజలు, ప్రభుత్వాలు జర్మనీ తో సహా పలు ప్రజాస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్న అధికార సవాళ్ల గురించి ప్రజలు మరింత అవగాహన పెంపొందించుకొంటున్నారు. పదేళ్ల క్రితం కంటే వారు చాలా ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు’ అని ఆమె చెప్పారు. నిరంకుశ పాలకులు ప్రజాస్వామ్య ప్రక్రియలు చాలా గజిబిజిగా ఉన్నాయని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉదారంగా ఉంటూ ఉండడంతో తమ దేశాలు ప్రపంచ పోటీని తట్టుకోలేకపోతున్నాయని పేర్కొంటూ తమ చర్యలను సమర్థించుకుంటారు. అయితే, ఈ అధ్యయనం భిన్నంగా చూపిస్తుంది. మహమ్మారి సమయంలో ప్రభుత్వాలు ఎంత త్వరగా, సమర్ధవంతంగా చర్యలను అమలు చేశాయో అంచనా వేసినప్పుడు తమ జనాభా కోసం రక్షణ చర్యలను అమలు చేయడంలో తక్కువ ప్రభావవంతమైన 45 దేశాలలో ఏదీ ప్రజాస్వామ్య దేశం కాకపోవడం గమనార్హం.సబీన్ డోనర్ ప్రకారం మహమ్మారికి చైనా ప్రతిస్పందన సంక్షోభ సమయాల్లో ప్రజాస్వామ్యాల కంటే నిరంకుశత్వం మరింత వివేకంతో వ్యవహరించలేదని స్పష్టం చేస్తుంది: కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కఠినమైన లాక్‌డౌన్‌లు పనిచేయడం లేదని, భారీ నిరసనలు ఉన్నాయని స్పష్టమయ్యినప్పుడు మనం దీనిని చూశాము. అన్ని అణచివేతలు ఉన్నప్పటికీ, తప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు గుర్తించడం మాత్రమే కాదు, వారిని సరిదిద్దడం కూడా అత్యవసరం. జనాభా అసంతృప్తిగా ఉన్నప్పుడు నిరంకుశత్వాలు కూడా ఒత్తిడికి గురవుతాయి.

నిరంకుశ ధోరణులను ఎదుర్కోవడానికి కీలకమైనది స్వేచ్ఛా ఎన్నికలకు పౌర నిబద్ధత, పత్రికా స్వేచ్ఛ. అధికారాల విభజన. ఈ ప్రాంతాల్లో నిరంతరం ప్రజల మద్దతు ఉంటే, నిరంకుశ పోకడలను తిప్పికొట్టడం సాధ్యమవుతుంది. కెన్యా, జాంబియాలతో పాటు పోలాండ్‌లో ఇటీవలి ఎన్నికలను ఈ అంశాన్ని స్పష్టం చేస్తుంది. ‘దీర్ఘకాలం పాటు నిరంకుశ పాలనలో ఉన్న తైవాన్ లేదా దక్షిణ కొరియాలను తీసుకోండి. ఆర్థికంగా ఆధునికీకరించబడటంతో ఇప్పుడు అవి చాలా స్థిరంగా, విజయవంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా నెలకొన్నాయి’ అని సబీన్ డోనర్ చెప్పారు. 2024 ట్రాన్సఫార్మటివే సూచిక దక్షిణ కొరియా, కోస్టా రికా, చిలీ, ఉరుగ్వే, తైవాన్‌ల గురించి ఈ విధంగా పేర్కొన్నది: ‘చట్టబద్ధ పాలనా, వ్యూహాత్మక విధానం ఆధారంగా, వారి ప్రభుత్వ నాయకత్వం విద్య, ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాలలో మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా సానుకూల అభివృద్ధిని నిర్ధారించింది’.

ప్రజాస్వామ్యం ఇప్పటికే పని చేస్తున్న దేశాల్లో, ప్రభుత్వాలు వీలైనంత విస్తృతంగా జనాభా నుండి ఏకాభిప్రాయాన్ని కోరాలని బెర్టెల్స్‌మాన్ పరిశోధకులు స్పష్టం చేశారు. గత సంవత్సరాల్లో కంటే కూడా ఎక్కువగా అంతర్జాతీయంగా ఏకీకృతం అవుతున్న వాతావరణంలో ఇది మరింత కాశం అవుతున్నప్పటికీ అదే మార్గమని తేల్చి చెప్పారు. దుందుడుకు నిరంకుశ ధోరణులు నేరుగా ఐరోపా స్వేచ్ఛ, భద్రత, శ్రేయస్సులను సాల్ చేస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధం కంటే తక్కువ కాదు. అది గడిచిన ప్రతి రోజు కలిగించే మరణం, విధ్వంసం గత రెండు దశాబ్దాలుగా నిరంకుశత్వపు విస్తరణ పరిణామాలకు నిదర్శనంగా గమనించాలి.

ఉక్రెయిన్‌లో ఏదైనా రష్యా విజయం -ఉక్రేనియన్ భూభాగాన్ని దురాక్రమణదారునికి సమర్థవంతంగా అప్పగించే ప్రతిష్టంభనతో సహా- మరింత దాడులను ప్రోత్సహిస్తుంది. నాటోతో ప్రత్యక్ష సంఘర్షణ ప్రమాదాన్ని పెంచుతుంది. ఏదేమైనా ప్రజాస్వామ్యం అనేది మానవ హక్కులను రక్షించడానికి, శాంతి, ఆర్థిక శ్రేయస్సు, స్వేచ్ఛను అభివృద్ధి చేయడానికి ఉత్తమమైన ప్రభుత్వ వ్యవస్థ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలు తమ ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. ఏ ప్రజాస్వామ్యం ఆచరణలో పరిపూర్ణంగా లేనప్పటికీ, ఈ వ్యవస్థ పౌరులకు దిద్దుబాటు, మెరుగుదల కోసం ఉపక్రమించేందుకు సమర్థవంతమైన సాధనాలను అందిస్తుంది. అందుకనే ప్రజాస్వామ్యం సమర్థవంతంగా ఉండాలంటే పౌరులు చైతన్యవంతంగా ఉండాలి.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News