చండీగఢ్: పంజాబ్‌లో తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కొద్ది రోజుల క్రితం ఆరోపించిన నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విశ్వాస పరీక్ష కోరేందుకు ఈ నెల 22న రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆశ చూపుతూ బిజెపి తమ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించిందంటూ ఆప్ కొద్ది రోజుల క్రితం ఆరోపించింది. భారీ మెజారిటీతో గెలిచిన తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆప్ ఎమ్మెల్యేలను బిజెపి ఎలా ప్రలోభాలకు గురిచేసిందో అందరికీ తెలుసునని జర్మనీ నుంచి పంపిన ఒక వీడియో సందేశంలో ముఖ్యమంత్రి మాన్ తెలిపారు. ఈ నెల 22న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, రాష్ట్ర పురోభివృద్ధి పట్ల తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో తెలియచేస్తామని, ఈ సమావేశాల్లోనే విశ్వాస పరీక్షకు వెళతామని మాన్ తెలిపారు.