శాసనసభ ఏకగ్రీవ తీర్మానం
రాష్ట్రంలో 50% బిసిలున్నారు : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : జనాభా గణనలో బిసిల కుల గణన కూడా చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ శుక్రవారం నాడు తీర్మానం చేసింది. సిఎం కెసిఆర్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై అన్ని పార్టీలు మద్దతును ప్రకటించాయి. రాష్ట్రంలో 50 శాతం బిసిలున్నారని తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. కుల గణనలో బిసిలకు చోటు ఇవ్వాలని రాష్ట్రం తరపున కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఈ విషయమై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై విపక్ష పార్టీలు కూడా అభ్యంతరం తెలపలేదు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడం పూర్తి కాగానే ఏకగ్రీవంగా సభ తీర్మానాన్ని ఆమోదిస్తోందని స్పీకర్ ప్రకటించారు. దీనికి సభ్యులంతా బల్లలు చరుస్తూ తమ హర్షం వ్యక్తం చేశారు. బిసి కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు సిఎం కెసిఆర్‌ను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, విప్ వినయ్ భాస్కర్, మాజీ మంత్రి జోగురామన్న, ఎంఎల్‌ఎ దానం నాగేందర్, శివకుమార్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రిని కలిసిన బిసి నాయకులు
కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణనలో కుల గణన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినందుకు జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయకులు నేడు అసెంబ్లీ చాంబర్‌లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతినిధి బృందంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, మాడిశెట్టి సురేందర్, చంటి ముదిరాజ్, ఉదయ్, పగిళ్ళ సతీష్, జోషి తదితరులు ఉన్నారు. బిసి జనగణనకు ఒత్తిడి పెంచడానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, దీనికి నాయకత్వం వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బిసి నేతలు విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని, అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి వారిని కలుపుకొని ప్రధానమంత్రితో చర్చలు జరుపుతామని సిఎం కెసిఆర్ హామీనిచ్చారని వారు తెలిపారు.
ఏకగ్రీవ తీర్మానం హర్షణీయం: కృష్ణమోహన్‌రావు
దేశవ్యాప్తంగా 2021లో చేపట్టబోయే జనగణనలో కులగణన కూడా నిర్వహించాలని రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రాన్ని కోరడం హర్షణీయమని బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. బిసిల కులగణన చేయాలని ఆ వర్గాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయన్నారు.