మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ శాసనసభ సమావేశాల హుందాతనాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. సమావేశాలు పారదర్శకంగా, సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత సమగ్రంగా, త్వరగా అందించాలన్నారు. 7వ తేదీ (సోమవారం) నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో సభాపతి పోచారం, మండలి ప్రొటెం ఛైర్మన్ జాఫ్రీ శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, సభా నిబంధనలను పాటిస్తూనే బడ్జెట్ సమావేశాల్లో ప్రతి అంశంపైనా సమగ్రంగా చర్చించాలన్నారు. గత సమావేశాలకు సంబంధించి పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులను వెంటనే పంపించాలని ఆదేశించారు. కొవిడ్ ప్రభావం తగ్గనప్పటికీ ఇంకా పూర్తిగా పోనందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పోచారం ఆదేశించారు. విధిగా మాస్క్ ధరించాలన్న సభాపతి…. ఎవరికైనా లక్షణాలు ఉంటే నిర్ధరణ చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత సమర్ధవంతమైనదన్న సభాపతి… లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు పోలీసు శాఖ తరుపున పూర్తి సహాయ, సహకారం అందించాలని పోచారం కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు,స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్ శాఖ) అరవింద రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ (జిఎడి) వికాస్ రాజ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, జిహెచ్‌ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -రవిగుప్తా, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ -సి.వి అనంద్, సైబరాబాద్ పోలీసు కమీషనర్- స్టిఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీసు కమీషనర్-మహేష్ భగత్, డిఐజి (ఇంటలిజెన్స్)- శివకుమార్, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కర్ణాకర్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.
TS Assembly Session to begin on March 7th