Tuesday, November 5, 2024

ఆయిల్ పాంకు అండ

- Advertisement -
- Advertisement -

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం
మొదటి మూడు సంవత్సరాలు పెట్టుబడి సబ్సిడీ
మొదటి సం. ఎకరాకు రూ.26వేలు, 2, 3సం.లో ఐదేసి వేలు: రాష్ట్ర కేబినెట్ నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే ఆర్ధిక సంవత్సరానికిగానూ రాష్ట్రంలో 20లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచాలని తలపెట్టింది. మొదటి మూడు సంవత్సరాల పాటు పెట్టుబడి కింద సబ్సిడీ రూపంలో కొంత మొత్తాన్ని అందించాలని మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. రాష్ట్రంలో ధాన్యం నిల్వలు, మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా చర్యలు తీసుకోవాలని కూడా సమావేశం నిర్ణయించింది. దీని కోసం నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేకంగా ఒక సబ్ కమిటిని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కొత్తగా పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గం సూచించింది. గతేడాది కాలంగా వ్యవసాయరంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు తదితర విషయాలపై కూడా కేబినెట్ సమావేశం విస్తృతంగా చర్చించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భ వన్‌లో రెండో రోజు మంత్రి మండలి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ముందుగా వ్య వసాయ శాఖకు సంబంధించిన విషయాల పై కేబినెట్ చర్చ ప్రారంభించింది. ఈ సందర్భంగా గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కార్యదర్శి, అధికారులు కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. ప్రస్తుతం వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో, విత్తనాలు ఎరువుల లభ్యత, వర్షాపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.
వ్యవసాయ ప్రస్థానంపై చర్చ
గత పాలనలో తెలంగాణలో వ్యవసాయం తీరు ఎట్లుండె..నేటి స్వయం పాలనలో ఎట్లున్నది..అనే విషయాలను ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశంలో చర్చించారు. గత ఏడేండ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, అది సాధించిన ఘన విజయాలను సిఎం ప్రస్థావించారు. ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్తును అందించడంతో పాటు అనేక కష్టాలకోర్చి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నదీ జలాలను చెరువులకు కుంటలకు, బీడు భూములకు ప్రభుత్వం మల్లించిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఒక్క ఎకరం కూడా వదలకుండా, వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను రైతులు సాగుచేయడం ప్రారంభించారన్నారు. దాంతో పెద్దఎత్తున రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.

రికార్డు స్థాయిలో పంటల ఉత్పత్తి
రైతులకు ప్రభుత్వం రైతుబంధు పథకం కింద అందిస్తున్న పంట పెట్టుబడి సాయంతో పాటు సకాలంలో ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా గత సంవత్సరం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. దాంతోపాటు రైతుకు ఎటువంటి సమస్యలు రాకుండా కరోనా కష్ట కాలంలో గ్రామాల్లోకి వెల్లి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు.

ధాన్యం నిల్వలు, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరం ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. అందుకు అనుగుణంగా ధాన్యం నిలువ చేయడం, మార్కెటింగ్ చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ఈ సందర్భంగా సిఎం ఆదేశించారు. ప్రస్తుత వానాకాలం కోటి నలభై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు జరగనున్నదని, వరి, పత్తి పంటలు రికార్డు స్థాయిలో పండనున్నాయని సిఎం తెలిపారు. ప్రస్థుతం రాష్ట్రంలో వున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలన్నారు. రైస్ మిల్లుల లో మిల్లింగ్ సమార్ద్యాన్ని పెంచుకోవాలని, నూతనంగా రైస్ మిల్లులు పారబాయిల్ మిల్లులను గణనీయంగా స్థాపించాలన్నారు. ఇందుకు సంబంధించి అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను సిఎం ఆదేశించారు.

శిక్షణ నిరంతరం కొనసాగాలి
రైతులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడానికి కావాలసిన అన్ని సౌకర్యాలను వ్యవసాయ శాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని సిఎం స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని అందుకు అవసరమైన రీతిలో అధికారులను నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని సిఎం అధికారులను ఆదేశించారు.
ఎటువంటి ఖాళీలు ఉండొద్దు
పౌర సరఫరాల శాఖతో సహా వ్యవసాయ శాఖలో ఎటువంటి ఉద్యోగ ఖాళీలు ఉండకూడదని సిఎం కెసిఆర్ అన్నారు. అన్ని పోస్టులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసుకోవాలని సూచించారు. పండిన ధాన్యాన్ని పండినట్టే ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు అవసరమైతే సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని కేబినెట్ సూచించింది. నూతనంగా ముందుకు వచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని సిఎం పేర్కొన్నారు.

ఆయిల్ పామ్ సాగు రైతులకు సబ్సిడీలు
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులను పెద్దఎత్తున ప్రొత్సహించాలని నిర్ణయించినట్లు సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ఇరవై లక్షల ఎకరాల్లో ఈ పంటను పండించాలని లక్షంగా పెట్టుకున్న నేపథ్యంలో రైతులకు ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26 వేలు, రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5వేలు, మూడవ సంవత్సరం కూడా ఎకరాకు రూ.5 వేలు చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించారు.
అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్ తో పాటు పంచాయితీరాజ్ ,రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించినట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో కూడిన అధ్యయన బృందం, కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూయర్ అడ్వాన్స్‌మెంట్ (టిఐడిఇఎ), తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టిఎస్‌ఎఫ్‌పిజెడ్) నిబంధనల ప్రకారం అందించే ప్రోత్సాహకాలు అందచేయాలని అధికారులకు కేబినెట్ సూచించింది.

కేబినెట్ సబ్ కమిటీ
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరుగనున్ననేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రి గంగుల కమలాకర్, హరీశ్ రావు, కెటిఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలు సభ్యులుగా ఉంటారు.

TS Cabinet decide to encourage Oil Palm cultivation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News