మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలా వద్దా అనే అంశంపై మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించే అవకాశం కనిపిస్తోంది. రెండు వారాలపాటు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పాక్షిక లాక్‌డౌన్ విధించడంపై కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. ఈ తరహా పాక్షిక లాక్‌డౌన్ ద్వారా వరి కొనుగోళ్లు చేపట్టి, ఆ తరవాత సంపూర్ణ లాక్డౌన్ విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వెంటనే రెండు వారాలపాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం ప్రతిపాదనలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎన్ని రోజులపాటు విధించాలి, లాక్ డౌన్ విధిస్తే ఎదురయ్యే పర్యవసాలు తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
TS Cabinet may take decision on Lockdown