భూములు, ఆస్తుల విలువ సవరణకు కసరత్తు
సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలతో పెరిగిన భూముల విలువ
హెచ్ఎండిఎ పరిధిలోనూ విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ఆవిర్భావం నుంచి భూముల విలువ పెంచని ప్రభుత్వం తక్కువ విలువతో ప్రజల రుణాలకూ ఇబ్బందులు
ఏపీలో ఎనిమిదేళ్లలో ఏడుసార్లు పెంపు త్వరలో సిఎం కెసిఆర్‌కు మంత్రివర్గ ఉపసంఘం నివేదిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని (రీసోర్స్ మొబిలైజేషన్ పైన ఏర్పాటైన) కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం అభిప్రాయపడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు కె.తారకరామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల పైన భారీగా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఇప్పటికే పలుసార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం మరోసారి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశమైంది.
ఎనిమిది సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో..
ఈ సందర్భంగా రాష్ట్రంలో భూముల విలువను సవరించేందుకు ఉన్న అవకాశాల పైన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సబ్ కమిటీ విస్తృతంగా చర్చించింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తున్నామని, దీంతోపాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టులు, ఇతర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సైతం పెద్ద ఎత్తున విలువ పెరిగిన విషయం సబ్ కమిటీ సమావేశంలో చర్చించింది. ఇలా రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి భారీగా భూముల విలువ పెరిగినా, ఎనిమిది సంవత్సరాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రభుత్వ నిర్ధారిత విలువల కన్నా అధిక మొత్తాల్లో భూములు, ఆస్తుల క్రయ, విక్రయాలు జరుగుతున్న చాలామంది నిర్ధారిత ప్రభుత్వ విలువల మేరకే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఇలాంటి లావాదేవీల వలన సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, హెచ్ఎండిఎ పరిధిలో పెద్ద ఎత్తున భూములు
చట్ట ప్రకారం ప్రభుత్వం ఎప్పటికప్పుడు విలువల సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని, ఇదే చట్టం ఆధారంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 సంవత్సరాల్లో ఏడుసార్లు భూ విలువలను సవరించి, రిజిస్ట్రేషన్ ఫీజులను 7.5 శాతానికి పెంచిన విషయంపై ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ ఈ సమావేశంలో చర్చించింది. తమిళనాడులో 7.5, మహారాష్ట్రలో 7 శాతం గా రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయని అధికారులు మంత్రులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఆదాయంలో ప్రధాన వాటా కలిగిన హైదరాబాద్, హెచ్ఎండిఎ పరిధిలో పెద్ద ఎత్తున భూములు, ఆస్తుల విలువలు పెరిగిన విషయం సబ్ కమిటీలో విస్తృతంగా చర్చకు వచ్చింది. ఏడు సంవత్సరాలుగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి తరలివచ్చిన భారీ పెట్టుబడులు, నూతన పరిశ్రమల ఏర్పాటు, నగర విస్తరణ వలన రియల్ భూమ్ వచ్చిందని మంత్రులు తెలిపారు.
రిజిస్ట్రేషన్లలో సుమారు 51 శాతం లావాదేవీలు
2019,20 సంవత్సరానికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్లలో సుమారు 51 శాతం లావాదేవీలు ప్రభుత్వ నిర్ధారిత విలువలకు మించి అధికంగా రిజిస్ట్రేషన్లు అయిన విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీకి వివరించారు. మరోవైపు ప్రభుత్వ విలువ మార్కెట్ విలువ కన్నా చాలా తక్కువగా ఉండటంతో భూములు ఇల్లు కొనుగోలు చేసే ప్రజలకు బ్యాంకు లోన్లు రావడంలో కొన్ని పరిమితులు ఉంటున్నాయని, ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు పెరిగిన విలువకు అనుగుణంగా సవరణ చేయాల్సిన అవసరం ఉందని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇలా వివిధ కారణాల ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల విలువల సవరణ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి కేబినెట్ సబ్ కమిటీ వచ్చింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు త్వరలోనే అందించాలని నిర్ణయం తీసుకుంది.
TS Cabinet Sub Committee discussed on land Registration