ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు స్థాయి సదుపాయాలు
మార్గదర్శకాలు రూపొందిచాలి : అధికారులకు మంత్రి వర్గ ఉపసంఘం ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని పాఠశాలల్లో కార్పొరేట్‌స్థాయిలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడాదికి రూ.2 వేల కోట్లతో అమలు చేయనున్న బృహత్తర విద్యా పథకం అమలుకు తుది మార్గదర్శకాలను రూపొందించాలని సంబంధిత అధికారులను క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. బృహత్తర విద్యా పథకం అమలుపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సంబంధిత అధికారులతో గురువారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశమైంది. మంత్రులు కె. టి.రామారావు, టి.హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి కోసం తీసుకుంటున్న చర్యలను క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులను అడిగి తెలుసుకుంది. కెజి నుండి పిజి వరకు ఉచిత విద్యను అందించాలనే సిఎం కెసిఆర్ బలమైన సంకల్పానికి ప్రతిరూపంగా దేశంలో ఎక్కడాలేని విధంగా బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల బిడ్డల కోసం ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో గురుకులాలను ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ అని కమిటీ పేర్కొంది. అందిరికీ నాణ్యమైన విద్య అందినప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయన్న సిఎం భావనకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యారంగంలో వినూత్నమైన మార్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయని కమిటీ పేర్కొంది.
ఉన్నత విద్య సమర్థంగా అమలు కావాలంటే ప్రాథమిక విద్యారంగాన్ని పటిష్ట పరచడం ద్వారానే సాధ్యమవుతుందని భావించి మన రాష్ట్రంలో పాఠశాల విద్యారంగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రులు పేర్కొన్నారు. పాఠశాలకు అవసరమైన అదనపు గదులు, నూతన భవనాలు, తాగునీరు, డిజిటల్ తరగతులు వంటి మౌలిక సదుపాయాలను సంపూర్ణంగా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కార్యదర్శి రఘునందన్‌రావు, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.
TS Cabinet Sub Committee meeting on Govt Schools