Wednesday, January 22, 2025

వరంగల్‌లో టీఎస్కాస్ట్ ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

నిర్మల్‌లో రూ. 42.41 కోట్లతో సైన్స్‌సెంటర్, ప్లానిటోరియం నిర్మాణం
రూ 2.88 కోట్లతో ఎనిమిది యూనివర్సిటీల్లో పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు ప్రతిపాదనలు
రూ. 14. 51 కోట్లతో వినూత్నంగా ఏడు ప్రాజెక్ట్ లను అమలు చేస్తున్న టీఎస్కాస్ట్
టీఎస్కాస్ట్ కార్యక్రమాలు, ప్రగతిపై సమీక్షించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

TS cast SC ST Cell in Warangal
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రసుత్త అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను శాస్త్ర,- సాంకేతిక రంగాల వైపు నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాస్త్ర, సాంకేతిక మండలి సాధించిన విజయాలు, ప్రగతిపై సంబంధిత అధికారులతో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర,- సాంకేతితను ఉపయోగించి రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు టీఎస్కాస్ట్ మంచి పనితీరును కనబరుస్తుందని చెప్పారు. రూ. 14.51 కోట్లతో వినూత్నంగా 7 ప్రాజెక్ట్‌లను అమలు చేస్తుందన్నారు. వరంగల్‌లోని రీజినల్ సైన్స్ సెంటర్ (ఆర్‌ఎస్సీ) లో ఇన్నోవేషన్ హబ్, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ కింద స్కిల్ డెవలప్‌మెంట్, వరంగల్ సైన్స్ సెంటర్లో ఎస్‌సి,ఎస్‌టి సెల్ ఏర్పాటు, నేషనల్ సైన్స్ డే & నేషనల్ మ్యాథమ్యాటిక్స్ డే వేడుకలు, తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుందని వెల్లడించారు.

రూ. 42.41 కోట్లతో నిర్మల్‌లో సైన్స్ సెంటర్, ప్లానిటోరియం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. సైన్స్ సెంటర్‌కు ఐదు ఎకరాల స్థలాన్ని ఇప్పటికే కేటాయించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (ఎస్‌ఇఎస్‌ఎస్), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిఐఎస్‌ఎస్), జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆరట్స్ యూనివర్సిటీ (జెఎన్‌ఎఫ్‌ఎయు) సహకారంతో టీఎస్కాస్ట్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు చేసి, ఈ ప్రాజెక్టును అమలు చేస్తామన్నారు. మొత్తం ఎనిమిది క్లస్టర్లను ఎంపిక చేసి ఎస్సీ క్యాటగిరీలో వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం, నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలాల్లో 5 క్లస్టర్లు, ఎస్టీ క్యాటగిరీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి, ములుగు జిల్లా ఏటూరు నాగారం 3 క్లస్టర్లను ఎంపిక చేశామన్నారు.

వరంగల్ రీజినల్ సైన్స్ సెంటర్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యావంతులైన యువతకు ఉపాధి, స్వయం ఉపాధి, వ్యవస్థాపక కార్యకలాపాలు చేపట్టేలా నైపుణ్య శిక్షణ ఇస్తారన్నారు. మొదటి సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర ఆధ్యయనం, రెండో సంవత్సరంలో వారి జీవన ప్రమాణాల పెంపొందించేందుకు తగిన శిక్షణ, మూడో సంవత్సరంలో శాస్త్ర, సాంకేతిక ఆధారిత యంత్రాలను, పరికరాలను అందజేస్తామని పేర్కొన్నారు. రూ 2.88 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది విశ్వవిద్యాలయాల్లో (ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, హైదరాబాద్ జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటి, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్స్ సైన్సెస్ ) పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (పిఐసి) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.

పేటెంట్లు, కాపీరైట్లు, ట్రేడ్‌మార్క్ల్, ఇండస్ట్రియల్ డిజైన్లు మొదలైన మేధో సంపత్తి హక్కులపై (ఐపిఆర్‌లు) పరిశోధకులు, ఆవిష్కర్తలు, కంట్రిబ్యూటర్లు, డిజైనర్లు మొదలైన వారికి అవగాహన కల్పించడం, ఐపిఆర్ ప్రక్రియను సులభతరం చేసేందుకు సమన్వయం చేసుకోవడం వంటి వాటిని పిఐసి ప్రధానంగా నిర్వహిస్తుందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ పర్యవేక్షణలో టీఎస్కాస్ట్ మెరుగైన ప్రగతి సాధించిందన్నారు. టీఎస్కాస్ట్ మెంబర్ సెక్రటరీ మారుపాక నగేష్, ఉద్యోగులు, సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి విస్తృత ప్రయోజనాలు చేకూరేలా టీఎస్కాస్ట్ రానున్న రోజుల్లో మరిన్ని వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని మంత్రి కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News