Thursday, January 23, 2025

సెప్టెంబరు 17న కాంగ్రెస్ మేనిఫెస్టో !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికతో పాటు మేనిఫెస్టోను ప్రజల్లోకి త్వరగా తీసుకెళ్లేలా వ్యూహాలను పన్నుతోంది. కర్ణాటక ఎన్నికల్లో అమలు చేసిన 5 పథకాల మాదిరిగానే పేదలను, మహిళలను, వృద్ధులను పరిగణలోకి తీసుకొని పలు పథకాలను ప్రవేశపెట్టే ఆలోచనతో ఆ పార్టీ ఉన్నట్టుగా తెలిసింది. మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నింటిని అధికారంలోకి రాగానే అమలు చేయాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి సర్వేలను చేపట్టిని కాంగ్రెస్ అధిష్టానం ఆయా నియోజకవర్గాల్లో ప్రజల నాడీని తెలుసుకునే పనిలో పడింది.

దీంతోపాటు ప్రజలకు ఈ ఎన్నికల్లో ఎలా చేరువకావాలి, పేదలను ఆకట్టుకునే పథకాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా అన్న దానిపై సీనియర్‌లతో అధిష్టానం చర్చిస్తోంది. దీంతోపాటు అన్ని పార్టీల కంటే ముందుగానే ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ రిలీజ్ చేయాలనుకుంటోంది. తెలంగాణ విమోచనా దినోత్సవంగా గుర్తింపు పొందిన సెప్టెంబరు 17వ తేదీని ఇందుకు ముహూర్తంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కర్ణాటక ఎన్నికల తరహాలోనే తెలంగాణలో ఎలాంటి హామీలను పార్టీ ప్రకటిస్తుందనేది కార్యకర్తలు, ప్రజల్లో ఆసక్తికర నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటివరకు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ రాష్ట్రంలో పర్యటించినా సోనియాగాంధీ మాత్రం రాలేదు. దీంతో ఆమె చేతుల మీదుగానే మేనిఫెస్టోను ప్రకటించాలని హైదరాబాద్ వేదికగానే దీనిని రిలీజ్ చేయించాలని పార్టీ నిర్ణయించినట్టుగా సమాచారం.

మొత్తం తొమ్మిది డిక్లరేషన్లను ప్రకటించాలని….
అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని మొత్తం తొమ్మిది డిక్లరేషన్లను ప్రకటించాలన్నది టిపిసిసి ముందస్తు ప్రణాళిక. ఇందులో ఇప్పటికే రైతాంగ డిక్లరేషన్ ను రాహుల్‌గాంధీ సమక్షంలో గతేడాది వరంగల్, యూత్ డిక్లరేషన్ ను ప్రియాంకాగాంధీ సమక్షంలో సరూర్ నగర్ స్టేడియంలో ఇటీవల వెలువడ్డాయి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ, మహిళ, సంక్షేమ, సుపరిపాలన డిక్లరేషన్లను రిలీజ్ చేయాల్సి ఉంది. వీటిని కూడా పూర్తి చేసుకున్న తర్వాత చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను సోనియాగాంధీ రిలీజ్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీని ‘తెలంగాణ తల్లి’గా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబరు 17వ తేదీకి ఉన్న ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని ఆ రోజున మేనిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ కార్యక్రమానికి సోనియాతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ హాజరుకానున్నారు. దీంతోపాటు పలు రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులను సైతం ఆహ్వానించాలని టిపిసిసి భావిస్తున్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News