Wednesday, January 22, 2025

పిజి ఉమ్మడి ప్రవేశ పరీక్షలో 94.39 శాతం ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -

TS CPGET 2022 Results Released

ఉత్తీర్ణులైన వారిలో 67 శాతం అమ్మాయిలే
సిపిగెట్ 2022 ఫలితాలు విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో పిజి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పిజి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సిపిగెట్ 2022)లో 94.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షకు మొత్తం 67,117 మంది దరఖాస్తు చేసుకోగా, 57,262 మంది హాజరయ్యారు. అందులో 54,050 (94.39 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డి. రవీందర్, సిపిగెట్ కన్వీనర్ ఐ.పాండురంగారెడ్డితో కలిసి మంగళవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి సిపిగెట్ 2022 ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఆర్.లింబాద్రి మాట్లాడుతూ, సిపిగెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జెఎన్‌టియుహెచ్ వర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీల్లో ఎంఎ, ఎం.కాం, ఎంఎస్‌సి తదితర పిజి కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని అన్నారు.

ఒయు విసి డి.రవీందర్ మాట్లాడుతూ, అన్ని యూనివర్సిటీలలో మొత్తం 45,003 పిజి సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మహిళలు క్రమంగా పెరుగుతున్నారని అన్నారు. సిపిగెట్ ఉత్తీర్ణులైన వారిలో 67.41 శాతం మంది అమ్మాయిలే ఉన్నారని పేర్కొన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో 36,437 మంది అమ్మాయిలు ఉంటే, 17,613 మంది అబ్బాయిలు ఉన్నారని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నిజాం కాలేజీతో పాటు సైఫాబాద్ కాలేజీలో నూతన మహిళా హాస్టళ్లు అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. సిపిగెట్ కన్వీనర్ ఐ.పాండురంగారెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 11 నుంచి 23 వరకు 9 రోజులపాటు 26 సెషన్లలో సిపిగెట్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 50 పిజి కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించామన్నారు. ఇతర రాష్ట్రాల 800 మంది సిపిగెట్ పరీక్ష రాశారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 8 యూనివర్సిటీల పరిధిలో 45,003 పిజి సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

వారంలో పిజి కౌన్సెలింగ్

రాష్ట్రంలో 8 యూనివర్సిటీ పరిధిలో పిజి ప్రవేశాలకు వారం రోజుల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని కన్వీనర్ ఐ.పాండురంగారెడ్డి వెల్లడించారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కౌన్సెలింగ్ జరుగుతుందని, విద్యార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు ముందుగానే సమకూర్చుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ వెలువడిన తర్వాత ముందుగా స్కాన్ చేసిన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, తర్వాత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. అభ్యర్థులు ఎక్కడి నుంచి కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని చెప్పారు. సీటు కేటాయించిన తర్వాత నేరుగా కాలేజీలోనే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. త్వరలో పిజి కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News