Friday, November 15, 2024

జూలై 5 నుంచి 9వరకు ఎంసెట్

- Advertisement -
- Advertisement -

జూలై 5 నుంచి 9వరకు ఎంసెట్
జూన్ 20న పిజిఇసెట్…జూలై 1న ఇసెట్
మరో నాలుగు సెట్లకు ఖరారు కాని షెడ్యూల్
ఈసారి ఇసెట్, ఎడ్‌సెట్, పిజిఇసెట్‌లకు కొత్త కన్వీనర్లు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ బిఎస్‌సి, న్యాయవిద్య, ఉపాధ్యాయ విద్య తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్ 20న పిజిఇసెట్, జులై 1న ఇసెట్ నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి శుక్రవారం ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. ఎడ్‌సెట్, ఐసెట్, లాసెట్, పిజిఎల్‌సెట్, పిఇసెట్ పరీక్షల షెడ్యూల్ నిర్ణయించాల్సి ఉంది. ఉన్నత విద్యామండలి మొత్తం ఏడు ప్రవేశ పరీక్షలు నిర్వహించనుండగా, అందులో మూడు పరీక్షల తేదీలు ఖరారు చేయగా, మరో నాలుగు పరీక్షలకు షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉంది. అయితే కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కీలకమైన ఎంసెట్‌ను జులైలో నిర్వహించాలని నిర్ణయించింది.
నిర్వహణ వర్సిటీలు యథాతధం
ప్రవేశ పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత ఏడాది నిర్వహించిన వర్సిటీలే ఈ ఏడాది కూడా యథాతధంగా పరీక్షలు నిర్వహించనున్నాయి. ఎంసెట్, ఇసెట్ పరీక్షలు జెఎన్‌టియుహెచ్ నిర్వహించనుండగా, పిఇసెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీ, ఐసెట్ పరీక్షను కాకతీయ యూనివర్సిటీలకు అప్పగించారు. లాసెట్, పిజిఎల్‌సెట్, పిజిఇసెట్, ఎడ్‌సెట్ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
మూడు సెట్లకు కొత్త కన్వీనర్లు
రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే మూడు ప్రవేశ పరీక్షలకు కొత్త కన్వీనర్లు నియమితులయ్యారు. నాలుగు సెట్లకు పాత కన్వీనర్లు ఉండగా, ఈసారి మూడింటికి కొత్త కన్వీనర్లను నియమించారు. జెఎన్‌టియుహెచ్ నిర్వహించే ఎంసెట్‌కు గత ఏడాది కన్వీనర్‌గా వ్యవహరించిన వర్సిటీ రెక్టార్ ఎ.గోవర్ధన్ మరోసారి కన్వీనర్‌గా నియమితులు కాగా, ఇసెట్‌కు కొత్త కన్వీనర్‌ను నియమించారు. జెఎన్‌టియుహెచ్ అడ్మిషన్స్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి ఇసెట్ కన్వీనర్‌గా వ్యవహరించనునన్నారు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఎడ్‌సెట్‌కు ఎ.రామకృష్ణ, పిజిఇసెట్‌కు పి.లక్ష్మినారాయణలను కన్వీనర్లుగా నియమించారు. లాసెట్, పిజిఎల్‌సెట్‌కు జి.బి.రెడ్డి, పిఇసెట్‌కు వి.సత్యనారాయణ, ఐసెట్‌కు కె.రాజిరెడ్డిలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.

TS EAMCET 2021 Entrance Test on July 5

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News