ప్రశాంతంగా ఎంసెట్ పరీక్షలు
మొదటి రోజు 91.79 శాతం మంది హాజరు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండు సెషన్‌లలో పరీక్షలు జరగ్గా, తెలంగాణలో 95 కేంద్రాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 18 కేంద్రాల్లో తొలిరోజు ఎంసెట్ పరీక్షలు జరిగాయి. తెలంగాణలో ఈ పరీక్షల కోసం 47,177 మంది రిజిష్ట్రర్ చేసుకోగా.. 43,766 మంది హాజరయ్యారు. మొత్తం 92.76 శాతం హాజరు నమోదైంది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో 10,401 మంది రిజిష్ట్రర్ చేసుకోగా 9,089 మంది (87.38 శాతం) హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ పరీక్షకు 91.79 శాతం హాజరు నమోదైంది. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కళాశాలతో పాటు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఆలస్యంగా వచ్చి వెనుదిరిగిన విద్యార్థులు కన్వీనర్ కార్యాలయంలో సంప్రదిస్తే అవకాశం ఉంటే పరిష్కారం చేస్తామన్నారు.