Monday, November 18, 2024

వారంలో సెట్స్ షెడ్యూల్…?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు(సెట్స్) షెడ్యూల్ వారం పది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి విద్యాశాఖ మంత్రి ఖరారైన వెంటనే ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకటించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. నూతన విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా సెట్స్ షెడ్యూల్ విడుదల చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జెఇఇ మెయిన్, నీట్ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసినట్లు తెలిసింది. సాధారణంగా ఏటా మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఈసారి కూడా 2024 మే నెలలోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జెఇఇ మెయిన్ మొదటి విడత, ఏప్రిల్ 1 నుంచి 15 రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ యుజి) పరీక్ష 2024 మే 5వ తేదీన జరగనుంది. రాష్ట్రంలో అన్ని ప్రవేశ పరీక్షలకు సెట్ల కన్వీనర్ల నియామకం, పరీక్షల నిర్వహణ ప్రక్రియను ఈ నెలలోనే ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమవుతోంది. ఎంసెట్, ఇసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలను ఖరారు చేసి, ఆయా సెట్లకు కన్వీనర్ల నియామకం కోసం వర్సిటీలకు లేఖలు రాయనున్నారు. యూనివర్సిటీలు తమ పరిధిలోని సెట్‌కు కన్వీనర్‌ను నియమించేందుకు ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను సిఫారసు చేస్తే అందులో ఒకరిని ఆయా సెట్‌లకు కన్వీనర్లుగా ఉన్నత విద్యామండలి నియమించనుంది. ముఖ్యంగా ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎక్కువ మంది జెఇఇ మెయిన్‌కు కూడా హాజరవుతారు కాబట్టి, విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఎంసెట్ పరీక్ష తేదీలను ఉన్నత విద్యామండలి నిర్ణయించనుంది.

మే నెలలో ఎంసెట్..?
వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సెట్స్) మే లేదా జూన్‌లో నెలలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ జూన్ నెలలో నిర్వహించి జూలైలో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్షను మే నెలలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఎఐసిటిఇ) నిబంధనలకు అనుగుణంగా సెట్స్ షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News