మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్టంలో బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బి.ఎడ్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిఎస్ ఎడ్‌సెట్- 2023 షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్. లింబాద్రి, ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణారావు, మహాత్మాగాంధీ వర్సిటీ విసి సీహెచ్ గోపాల్ రెడ్డి శనివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు.ఈ నెల 6వ తేదీ నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఎడ్‌సెట్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌సి,ఎస్‌టి, పిహెచ్ అభ్యర్థులు రూ. 550, ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ. 750 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 30వ తేదీన అభ్యర్థులు తమ దరఖాస్తులను సవరించుకునేందుకు ఏప్రిల్ 30న అవకాశం కల్పించారు. మే 5 నుంచి వెబ్‌సైట్‌లో ఎడ్‌సెట్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న మూడు సెషన్లలో ఎడ్‌సెట్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు రెండో సెషన్, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూడో సెషన్ నిర్వహించనున్నారు. మే 21న ఎడ్‌సెట్ ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు.