ఆగస్టు 24,25 తేదీలలో ఎడ్‌సెట్
19 నుంచి జూన్ 15 వరకు దరఖాస్తులు
పరీక్షా విధానం, అర్హతల్లో మార్పులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కోర్సు బి.ఇడి(బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్షను ఆగస్టు 24, 25 తేదీలలో జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగనుంది. ఈ మేరకు ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ.రామకృష్ణ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 19 నుంచి జూన్ 15 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎడ్‌సెట్ పరీక్ష ఫీజు రూ.650(ఎస్‌సి,ఎస్‌టి, వికలాంగులకు రూ.450)గా నిర్ణయించారు.
బి.ఇడిలో అన్ని కోర్సులకు కామన్ పరీక్ష
రాష్ట్రంలో ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక నుంచి బి.ఇడిలో అన్ని కోర్సుల్లో కామన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌లో ఒక్కో మెథడాలజీకి(సబ్జెక్టు) ఒక్కో ప్రశ్నపత్రం ఇచ్చి పరీక్ష నిర్వహించే వారు. కానీ ఇకపై అన్ని మెథడాలజీలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు, తాము డిగ్రీలో చదివిన ఏ సబ్జెక్టుకు సంబంధించిన మెథడాలజీలోనైనా అడ్మిషన్ పొందవచ్చు. అదేవిధంగా ఇప్పటివరకు బిఎ, బి.కాం, బి.ఎస్‌సి వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారికి మాత్రమే బి.ఇడిలో చేరే అవకాశం ఉండేది. ఇకపై వారితోపాటు కొత్త కొత్త కాంబినేషన్లతో డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా బి.ఇడి చదివే వీలు కలుగనుంది. ఇక, బి.ఇడి మెథడాలజీ విషయంలోనూ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేసింది. మరోవైపు ఎడ్‌సెట్‌లో ఇప్పటివరకు ప్రామాణికంగా డిగ్రీలోని సిలబస్‌ను తీసుకొని పరీక్షను నిర్వహిస్తుండగా, ఇకపై ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకున ఉన్న సిలబస్ ఆధారంగానే ఎడ్‌సెట్‌ను నిర్వహించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాల్లో భాగంగా ఆగస్టులో నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్షలో, బి.ఇడి ప్రవేశాలల్లో ఈ మార్పులను అమలు జరుగనున్నాయి.
TS EDCET 2021 Test Date Released