కెఆర్‌ఎంబికి
ఈఎన్‌సి లేఖ
రాజోలిబండ అనకట్టను బోర్డు పరిధిలొకి తీసుకొండి
వెంటనే ఆధునీకరణ పనులు చేపట్టండి
ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీందించాలి
ఎపి కెసికాలువకు కేటాయింపునకు మించి నీటిని వాడుతోంది
కృష్ణాబోర్డుకు ఈఎన్‌సి లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్ : తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ నీటి మళ్లింపు పథకం ఆనకట్టును కృష్ణానదీ యాజమాన్యబోర్డు పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరింది. బోర్డు ఛైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్‌కు తెలంగాణ నీటిపారుల శాఖ ఈఎన్సీ మురళీధర్ సోమవారం నాడు లేఖ రాశారు. కృష్ణానదీజలాల పంపిణీ సందర్బంగా బచావత్ ట్రిబ్యునల్ రాజోలిబండ నీటిమళ్లింపు పథకానికి 15.90టిఎంసీల నీటిని కేటాయించిందని తెలిపారు. అయితే ఈ పథకంలోని ఆనకట్టుతోపాటు ప్రధాన కాలువను కూడా ఆధునీకరించాల్సివుందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్పప్పుడే రోజోలిబండ నీటి మళ్లింపు పథకం ఆధునీకరణ పనులకు ఆమోదం లబించిందని తెలిపారు. ఆధునీకరణ పనులకు అవసరమైన నిధులను కూడా కర్నాటక ప్రభుత్వానికి జమ చేసినట్టు లేఖలో వివరించారు. రాజోలిబండ నీటిమళ్లింపు పథకంలోని ప్రధాన కాలువ ఆధునీరణ పనులు ఇప్పటికే చాలా వరకూ పూర్తయ్యాయన్నారు.
అయితే ఎపి తెలంగాణ రాష్ట్రాల రైతుల మధ్య శాంతిభద్రతల పేరుతో ప్రధాన ఆనకట్ట ఆధునీకరణ పనులను మాత్రం చేయనీయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఈఎన్సీ లేఖలో అభ్యంతరం తెలిపారు. పనులు చేయవద్దని కర్ణాటక ప్రభుత్వానికి ఎపి ప్రభుత్వం లేఖ కూడా రాసిందని తెలిపారు. ఆధునీకరణ పనులు జరగకపోవటంతో గత రెండున్నర దశాబ్దాలుగా రాజోలిబండ నీటిమళ్లింపు పథకం ద్వారా తెలంగాణ ప్రాంత ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందటం లేదన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల్లో 15.90టిఎంసిలకు గాను కేవలం 5టిఎంసిల నీరు మాత్రమే అందుతోందని తెలిపారు. గత 15ఏళ్లుగా ఆధునీకరణ పనులు చేపట్టకుండా అడ్డుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ దిగువన ఉన్న సుంకేసుల ఆనకట్ట ద్వారా కర్నూలుకడప కాలువ పథకానికి ఏవిధమైన అనుమతులు పొందకుండానే కేటాయింపులకు మించి నీటిని వాడుకొంటోందని తెలిపారు. తుంగభద్ర జలాలను అనుమతి లేకుండా మళ్లించుకునే ప్రయత్నాల పట్ల తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆధునీకరణ పనులు పూర్తైతేనే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ఆయకట్టుకు 15.90టిఎంసిల నీరు అందుతుందని తెలిపారు. ఈ పరిస్థితులన్నింటి నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూబాగంలో రాజోలిబండ నీటిమళ్లింపు పథకంలోని అనకట్ట భాగాన్ని కృష్ణానదీయాజమాన్య బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కోరారు. వీలైనంత త్వరితగతిన ఆధునీకరణ పనులు చేపట్టి యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా ఈ అంశాలను తీసుకుపోవాలని ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు లేఖ ద్వారా కృష్ణానదీయాజమాన్యబోర్డును కోరారు.