మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్ధుతుగా మార్చి ఒకటి నుంచి పాదయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర రైతుసంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. శనివారం సుందరయ్య విజ్ణాన కేంద్రంలో రైతు సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేస్తున్న పోరాటాలపై నిర్భందాలను ఆపాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలను రద్ధు చేసేంతవరకూ దశలవారీగా పోరాటాలను కొనసాగిస్తామన్నారు. దేశాన్ని తాకట్టు పెట్టే సంస్కృతిని కొనసాగిస్తున్న కేంద్రప్రభుత్వ వైఖరి వీడే వరకూ ఆందోళన కొనసాగిస్తామన్నారు. నాడు స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమ స్ఫూర్తితో రైతులకు సంఘీభావంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ స్ధాయిలో అన్నదాతలు చేపట్టిన పోరాటాలకు సంఘీభావంగా మార్చి నుంచి ప్రారంభం కానున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్ధతు తెలిపాలని విజ్ణప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతుసంఘం కార్యదర్శి టి.సాగర్, సిఐటియూ జాతీయ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
TS Farmers Union to start Padayatra from March 1