Saturday, November 16, 2024

కోకాపేట భూములు అమ్మేందుకు లైన్ క్లియర్..

- Advertisement -
- Advertisement -

TS Govt allow to sale of Kokapet Lands

కోకాపేట నియోపోలిస్ భూములు అమ్మేందుకు లైన్ క్లియర్
అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
భూములు దక్కించుకున్న వారికి వెంటనే
రిజిస్ట్రేషన్ చేయాలని రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
మనతెలంగాణ/హైదరాబాద్: కోకాపేట నియోపోలిస్ భూముల అమ్మకానికి ఎట్టకేలకు లైన్‌క్లియర్ అయ్యింది. భూములు అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 239,240 సర్వే నంబర్లలోని భూమిపై పూర్తి హక్కులు ప్రభుత్వానివేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూముల విక్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఏజెంటుగా హెచ్‌ఎండిఏ ఈ-వేలం నిర్వహించిందని పేర్కొంది. వేలాన్ని పూర్తి చేసి వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసినట్లు తెలిపింది. వేలంలో భూములు దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రంగారెడ్డి కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
60 మంది బిడ్డర్ల పోటీ
ఐటీ కారిడార్లోని కోకాపేటలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఈ ఏడాది జూలైలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలం కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేసిన కోకాపేట నియోపోలిస్ లే ఔట్‌లో ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్ వేలంలో మొత్తం దాదాపు 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను విక్రయానికి ఉంచారు. వీటిని కొనడానికి 60 మంది బిడ్డర్లు పోటీపడ్డారు. ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించగా, బిడ్డర్లు పోటీ పడి మరీ స్థలాలను దక్కించుకున్నారు.
ఈ వేలం ద్వారా రూ.2000 వేల కోట్ల ఆదాయం
ఇందులో ఎకరానికి కనిష్టంగా రూ.31.2 కోట్లు పలకగా, గరిష్ట ధర రూ.60.2 కోట్లు పలికింది. మొత్తం వేలం ప్రక్రియలో సరాసరిగా ఎకరం రూ.40.05 కోట్లు పలికింది. 2/పీ వెస్ట్ పార్ట్ ప్లాట్‌ణు రాజపుష్ప ప్రాపర్టీ సంస్థ ఎకరానికి రూ.60.20 కోట్ల చొప్పున 1.65 ఎకరాలను రూ.99.33 కోట్లకు సొంతం చేసుకుంది. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా హెచ్‌ఎండిఏకు రూ.2000.37 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ వేలంతో కోకాపేట అత్యంత విలువైన భూమిగా మరోసారి గుర్తింపు తెచ్చుకుంది.
58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు
కోకాపేటలో ఇప్పటికే 58 అంతస్తుల వరకు వ్యాపార, వాణిజ్య, నివాస భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా హెచ్‌ఎండిఏ అభివృద్ధి చేసిన నియోపోలిస్ లే ఔట్‌లోనూ అదే స్థాయిలో హై రైజ్ అపార్ట్‌మెంట్‌లను నిర్మించడానికి అవకాశం ఉండటంతో బిడ్డర్లు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. ఔటర్ రింగ్‌రోడ్డును అనుకొని ఉండటంతో పాటు పక్కనే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఉండటంతో ఈ భూములకు ప్రాధాన్యం పెరిగింది. నియోపోలిస్ లే ఔట్‌లోని 8 ప్లాట్లను ఒకే రోజు ఆన్‌లైన్‌లో విక్రయించారు.

TS Govt allow to sale of Kokapet Lands

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News