Wednesday, January 22, 2025

నేడు నిమజ్జనం

- Advertisement -
- Advertisement -

https://www.manatelangana.news/supreme-court-key-decision-on-ews-quota1/

హైదరాబాద్‌లో నేడు నిమజ్జనం
హుస్సేన్‌సాగర్ చుట్టూ 22 క్రేన్ ఏర్పాటు
శోభయాత్రకు 12వేల మంది పోలీసులతో బందోబస్తు
పాతబస్తీలో ప్రత్యేకంగా 2,500 పోలీసులతో భద్రత
శోభయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మూడు జిల్లాలకు ప్రత్యేక సెలవు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శుక్రవారం ఘనంగా గణేశ్ నిమజ్జనం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో హుస్సేన్‌సాగర్ చూట్టూ నిమజ్జనం నిమిత్తం 22 క్రేన్లను ఏర్పాటు చేయడంతో పాటు నిమజ్జనం అనంతరం వ్యర్థాల వెలికితీతకు 20 జేసీబీలను అందుబాటులో ఉంచారు. నిమజ్జన కార్యక్రమంలో ఏలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సాగర్ పరిసర ప్రాంతాలలో 12వేల మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వినాయక శోభాయాత్ర మార్గంలో అత్యవసర సహాయ కేంద్రాలు , వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.శోభాయాత్ర సందర్భంగా పాతబస్తీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. దాదాపు 2500మంది పోలీసులతో అదనంగా శోభయాత్రకు భద్రత కల్పించనున్నట్లు పోలీసు అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని షా అలీ బండ, అలియాబాద్, లాల్‌దర్వాజ, ఫలక్‌నుమా, నాగుల్ చింత, చాంద్రాయణగుట్ట, హుస్సేనీ ఆలం తదితర సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. శోభయాత్ర, నిమజ్జనంలో అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణ అవసరంగా మరిన్ని బలగాల్ని అందుబాటులో ఉంచినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు.
శోభయాత్ర మార్గాల్లో ఆంక్షలు ః
భాగ్యనగరంలో గణేషుణి శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని, గణపతి విగ్రహాల ప్రధాన ఊరేగింపు కేశవగిరి నుంచి చాంద్రాయణ గుట్ట మీదుగా ఫలక్ నామా – ఆలియాబాద్ – నాగల్‌చింత – చార్మినార్ – అప్జల్ గంజ్- ఎంజె మార్కెట్ – అబిడ్స్ – బషీర్ బాగ్ – అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, నక్లెస్ రోడ్ వైపు సాగుతోందని పోలీసు అధికారులు వివరించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు రాష్ట్రపతి రోడ్డు – కర్బలా మైదానం – ముషీరాబాద్ – ఆర్‌టిసి క్రాస్ రోడ్ – హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా వచ్చి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఈస్ట్ జోన్ నుంచి వచ్చే విగ్రహాలు ఉప్పల్ – రామాంతపూర్ – ఛే నంబర్ – దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రి – ఫీవర్ ఆస్పత్రి – నారాయణగూడ మీదుగా వచ్చి ఆర్‌టిసి క్రాస్ రోడ్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలువనున్నాయని తెలిపారు.అలాగే దిల్‌సుఖ్‌నగర్ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్ సదన్ – సైదాబాద్ – చంచల్‌గూడా మీదుగా వచ్చే పెద్ద విగ్రహాల ఊరేగింపులో కలుస్తాయని, తార్నాక నుంచి వచ్చే వాహనాలు ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్, అడిక్ మెట్ మీదుగా ఫీవర్ ఆస్పత్రి వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయన్నారు. టోలి చౌకి, మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు మాసబ్ ట్యాంక్ – నిరంకారి భవన్ -సైఫాబాద్ పోలీస్ స్టేషన్ – ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్‌టిఆర్ మార్గ్‌కు వెళతాయని, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చే విగ్రహాలు మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపులో కలుస్తాయని తెలిపారు. అదేవిధంగా టపాచబుత్ర, సీతారాంబాఘ్, గోషామహాల్ బండారి, నుంచి వచ్చే విగ్రాహాలు ఎంజె మార్కెట్ వద్ద కలుస్తాయని, ఊరేగింపు జరిగే మార్గాల్లో శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి శనివారం ఉదయం పది గంటల వరకు ఇతర వాహనాలను దారి మళ్లించనున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రాకపోకలు సాగించే లారీలను ఆదివారం ఉదయం వరకు నగరంలోకి అనుమతి లేదని తెలిపారు. ప్రధాన ఊరేగింపు సాగే మార్గాల్లో విగ్రహాలు తీసుకువస్తున్న వాహనాలకు తప్ప ఏ ఇతర వాహానాలకు అనుమతించమని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ప్రత్యేక పార్కింగ్‌లు ః
హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చూసేందుకు వచ్చేవారి కోసం పోలీసు అధికారులు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ లోని ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, ఖైరాతాబాద్ రైల్వే స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీలోని రంగారెడ్డి జెడ్‌పి కార్యాలయం, బుద్ధభవన్ వెనుక, గో సేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్టమైసమ్మ గుడి, ఎన్‌టిఆర్ స్టేడియం, నిజాం కాలేజి, పబ్లిక్ గార్డెన్, ఐమ్యాక్స్ వద్ద పార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి కాలినడకన రావాలని పోలీసులు సూచించారు. ఊరేగింపు మార్గాల్లో ఆర్‌టిసి బస్సులకు అనుమతి ఉండదని, మహాత్మ గాంధీ బస్ స్టేషన్ నుంచి జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఆర్‌టిసి బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించామని తెలిపారు. రాజీవ్ రహాదారి, ఎన్‌హెచ్ 7 నుంచి వచ్చే బస్సులు జెబిఎస్, సంగీత్ క్రాస్ రోడ్-, తార్నాక, -నింబోలిఅడ్డా -చాదర్‌ఘట్ మీదుగా వెళ్లాలని సూచించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు తెలుసుకోవడానికి హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేశామని, అవసరమైన వారు 040 27852482, 9490598985, 9010203626 నంబర్లను సంప్రదించాలని పోలీసు అధికారులు కోరారు. వాహనదారులు, ఉత్సవ నిర్వాహకులు నిబంధనలు, ఆంక్షలు పాటించి తమకు సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు.
జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు ః
గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వినాయక శోభాయాత్రతో పాటు నిమజ్జనం జరుగనున్న ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేశామని జలమండలి ఎండి దాన కిషోర్ తెలిపారు. ఇప్పటికే 3, 5, 7, 9వ రోజుల్లో 74 నీటి కొలనుల వద్ద మంచినీటి శిబిరాలు జలమండలి నిర్వహించింది. శుక్రవారం కోసం అదనంగా మరో 122 తాగునీటి శిబిరాల ఏర్పాటు చేయనుంది. 3.72 లక్షల మంచినీటి పాకెట్ల పంపిణీకి సిద్ధం చేసింది. అన్నదానం జరిగే శిబిరాలకు ఉచిత మంచినీటి ట్యాంకర్లను జలమండలి సరఫరా చేయనుంది. ఏర్పాట్ల పరిశీలన, మంచినీటి శిబిరాల పర్యవేక్షణకు నోడల్ ఆఫీర్లను నియమించడం జరిగింది. నిమజ్జన శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో ఎటువంటి వాటర్ లీకేజీలు, సీవరేజి ఓవర్ ఫ్లో లేకుండా జలమండలి తగు జాగ్రత్తలు తీసుకుంది.
హుస్సేన్ సాగర్‌లో 20 వేల విగ్రహాల నిమజ్జనం ః
గణేశ్ శోభయాత్ర, నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని హుస్సేన్ సాగర్ లో దాదాపు 15వేలు నుంచి 20వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని అంచనా వేస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి రంగనాథ్ తెలిపారు. నిమజ్జన శోభాయాత్ర సజావుగా కొనసాగేలా శుక్రవారం ఉదయం 6గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఈక్రమంలో శనివారం ఉదయం 10గంటల కల్లా నిమజ్జన ప్రక్రియ ముగుస్తుందని ఆశిస్తున్నామన్నారు. నిమజ్జనోత్సవం సందర్భంగా అందరూ పోలీసులకు సహకరించాలని, ట్రాఫిక్ విభాగం నుంచి 3వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. సిసిటివి కెమెరాలు, మౌంటెడ్ వాహనాల పర్యవేక్షణలో, డ్రోన్‌తో నిమజ్జన శోభాయాత్రను షూట్ చేస్తామన్నారు. ఇతర వాహనాల కోసం ప్రత్యామ్నాయ రూట్లను సూచించామని తెలిపారు. ఈ నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 9.30గంటల మధ్య ప్రారంభమై మధ్యాహ్నం 1గంట కల్లా ఎన్‌టిఆర్ మార్గ్ వైపు నిమజ్జనం జరిగే అవకాశం ఉన్నట్టు రంగనాథ్ తెలిపారు.
కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ ః
వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు నిమజ్జన ప్రక్రియను కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించనున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ మేరకు డిసిపిలు కల్మేశ్వర్, శ్రీనివాసరావుతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి నిమజ్జనం జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించామన్నారు. సైబరాబాద్ పరిధిలోని 3,000 సిసి కెమెరాలతోపాటు అదనం గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో 700 కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశామని తెలిపారు. మొదటి సారిగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 బాడీ వోర్న్ కెమెరాలు ధరించిన పోలీసు కానిస్టేబుళ్లు నిమజ్జనం జరిగే ప్రాంతంలో జరిగే ప్రతి కదలికను పోలీస్ కంట్రోల్ రూంకు చేరవేస్తారన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 10,510 విగ్రహాలను ఏర్పాటు చేశారని, ఎవరైన ఇబ్బందులు ఉంటే 9490313747కు ఫోన్ చేయాలి, ప్రజలు అనుమానస్పదంగా వ్యక్తులు లేదా వస్తువులు కన్పిస్తే డయల్ 100, 9490617444కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో నిమజ్జనం ప్రశాతంగా జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టారని, ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద నిమజ్జన నిమిత్తం రెండు క్రేన్లను ఏర్పాటు చేశారన్నారు. కంట్రోల్ రూమ్‌తో పాటు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ఉప్పల్ నల్ల చెరువు వద్ద చిన్నపాటి విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా తాత్కాలిక కొలనులు నిర్మించారన్నారు.
మెట్రో రైళ్ల సమయం పొడిగింపు ః
నగరంలో గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి రెండుగంటల వరకు మెట్రో రైళ్ల అందుబాటులో ఉంటాయని మెట్రో ఎండీ ఎన్‌విఎస్ రెడ్డి గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణీకుల రద్దీ దృష్టా మెట్రో సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపారు. చివరి రైల్ 10 వతేదీ రాత్రి ఒంటిగంటకు బయలుదేరి 2గంటలకు ఆఖరి స్టేషన్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 6 గంటలకు నుంచి మెట్రో సర్వీసులు నడుస్తాయని చెప్పారు. ప్రయాణీకులు మెట్రో సిబ్బందికి సహాకరించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
మూడు జిల్లాలకు సెలవు ః
వినాయక నిమజ్జనం సందర్భంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

TS Govt Announce Holiday tomorrow for Ganesh Immersion

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News