రెండోరోజు పంట రుణ మాఫీకి రూ.100.70కోట్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : పంట రుణాల మాఫీకింద ప్రభుత్వం రెండవ రోజు రూ.100.70కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు జమ చేసింది. తొలిరోజు రుణమాఫీ నిధుల జమ కార్యక్రమం ట్రయల్ రన్ విజయవంతం కావటంతో మంగళవారం నాడు నిధుల జమను మరింత పెంచింది. రెండవ రోజు పంటరుణాల మాఫీ కింద బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు నిధులు జమ చేయటం ద్వారా 38,050మంది రైతులకు లబ్ధి చేకూరింది. దేశానికి అన్నం పెట్టే రైతులు అప్పుల బాధల నుండి బయట పడాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్దేశం అని ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
కరోనా విపత్తులో రైతుల పంట కొనుగోళ్లకు ఇబ్బందులు పడవద్దని వందశాతం పంటలు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పంటరుణాల మాఫీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారంఈ ఏడాది రూ.50వేల వరకూ రుణాల మాఫీ పూర్తి చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో రెండు విడతలలో రూ.75వేలు, రూ.లక్ష వరకూ పంట రుణాలు మాఫీ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.