Sunday, September 22, 2024

ఏప్రిల్ నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు

- Advertisement -
- Advertisement -

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ధృవీకరణ
ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం చెప్పలేదని స్పష్టీకరణ
సేకరణకు 20కోట్ల గన్నీ సంచులు సిద్ధం
రైతులకు ముందుగానే కొనుగోలు తేదీ, టోకెన్ల పంపిణీ కొనుగోలు కేంద్రాలకు ఇంఛార్జీలు
TS Govt begins paddy procurement from April

మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అన్ని విధాల సన్నద్ధం చేస్తోంది. ఈ సారి కూడా యాసంగిలో పండించిన ధాన్యాన్ని గ్రామాల వారీగానే కొనుగోలు చేయనున్నారు. మంగళవారం నాడు లోక్‌సభలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రస్తావన చర్చకు వచ్చింది. సభ్యులడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది.ధాన్యంకొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం చెప్పలేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై విపక్షాల విమర్శలు, రైతుల సందేహాలన్ని తెల్ల మేఘాల్లా తేలిపోయాయి. ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా అందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తొంది. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటల్లో వరి కోతలు మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ నుంచి మార్కెట్లకు ధాన్యం ఉత్పత్తుల రాక ప్రారభం కానుంది. ఈ నేపధ్యంలో మార్కెట్లలో ధాన్యం విక్రయాలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లాస్థాయిల్లో కలెక్టర్ల నేతృత్వంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల అధికారులతో పరిస్థితులను సమీక్షిస్తూ ధాన్యం కొనుగోలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రామ స్ధాయిల్లోనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

వ్యవసాయ మార్కెట్ యార్డులు, గ్రామ స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు తీసుకుంటున్నారు. యాసంగి ధాన్యమంతా ఒక్కసారిగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా గతంలోలాగే ఈ సారి కూడా నియంత్రణ విధానం అమలు చేయనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. రైతులు తమ పంటను ధాన్యం కొనుగోలుకేంద్రాలకు ఎప్పుడు తీసుకు రావాల్సిందీ ముందుగానే తేది, సమయం నిర్ణయించి వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా అందుకు తగిన టోకెన్లను రైతులకు పంపిణీ చేయించనున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు సిబ్బందికి ట్యాబ్‌లు సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రైతు నుంచి ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, రైస్ మిల్లులకు ఎంత ధాన్యం రవాణా చేశారు తదితర వివరాలను ఎప్పటికప్పుడు పక్కాగా నమోదు చేయించనున్నారు. కొనుగోలు కేంద్రాలకు సెంటర్ ఇంచార్జిలను నియమించనున్నారు. వీరు ఎప్పటి కప్పుడు ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించి పై స్థాయి అధికారులకు నివేదికలు పంపేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అంతేకాకుండా ప్రతి రైస్‌మిల్లుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నారు. రైస్‌ మిల్లులకు ధాన్యం రవాణ పర్యవేక్షణ బాధ్యతలను వీరికి అప్పగిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైనన్ని కాంటాలు ఏర్పాటు , తూకం వేయటం , లారీలకు ధాన్యం బస్తాలు లోడ్‌చేసి వాటిని రైస్ మిల్లులకు చేరవేయటం తదితర పనులకు అవసరమైనంతమంది హమాలీల వివరాల జాబీతాలను ముందుగానే సిద్దం చేసివుంచుతున్నారు. ఎక్కడా హమాలీల కొరత సమస్య రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ధాన్యం దిగుబడులను దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఐ.కె.పి కేంద్రాలు, పిఎసిఎస్‌ల ద్వారా సుమారు 5వేలకు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు రూపొందింస్తున్నట్టు సమాచారం.
20కోట్ల గన్ని సంచుల సేకరణ
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అవసరమైనన్ని గన్ని సంచులను సిద్దం చేస్తున్నారు. గత సీజన్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, రానున్న యాసంగి ధాన్యం దిగుబడులను అంచనా వేసి ఈ సారి 20కోట్ల గన్ని సంచులు సిద్దంగా ఉంచాలని నిర్ణయించారు.వీటిలో 50శాతం పాతవి అందుబాటులో ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల బియ్యం సరఫరాకు ఉపయోగించిన గన్ని సంచులు ప్రతినెల 54లక్షలు మిగిలి పోతున్నాయి.వీటిని రేషన్ డీలర్లనుంచి సేకరిస్తున్నారు. ఒక్కొ గన్ని సంచికి రూ.18 ధరతో డీలర్లకు చెల్లించనున్నారు. అంతే కాకుండా అవసరమైన మేరకు కొత్త గన్నీ సంచులను కలకత్తా నుంచి దిగుమతి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

TS Govt begins paddy procurement from April

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News