రైతులకు తీపికబురు అందించిన సిఎం కేసిఆర్
ఈ నెల 28నుండి రైతుబంధు నిధుల పంపిణీ
10వ విడతకింద రూ.7600కోట్లు సిద్దం
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసిఆర్ తియ్యటి కబురందించారు. వ్యవసాయరంగంలో రైతులకు యాసంగి పంట కాలానికి పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం కింద ఈ నెల 28నుంచి నిధుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్టు ప్రకటించారు. ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్దిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావును ఆదేశించారు. రైతుబంధు పధకం నిధుల పంపిణీ ఎప్పటిలాగే ఒక ఎకరం ఉన్న రైతుల నుంచి ప్రారంభమై సంక్రాతి పండగ నాటికల్లా అందరి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కానున్నాయి. పదవ విడతగా మొత్తం రూ.7600కోట్లను ఇందుకోసం సిద్దంగా ఉంచాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదివారం నాడు ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు పథకం ద్వారా ప్రతియేటా వానాకాలం, యాంసగి పంటల సీజన్లకు ఎకరానికి ఒక్కో సీజన్‌లో రూ.5వేల చొప్పున రెండు సీజన్లలో మొత్తం రూ.10వేలు పంటల పెట్టుబడి కోసం అందిస్తున్నారు.
దేశ వ్యవసాయరంగంలో తెలంగాణ రైతుబంధు పధకం విప్లవాత్మక సత్ఫలితాలనిస్తోంది. ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయరంగానికి సాగునీరందిస్తూ, ఉచిత విద్యుత్‌తోపాటు, రైతుబీమా కల్పిస్తోంది. పంటలు పండించేందుకు పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుండటంతో రైతులు వ్యవసాయ పనునల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. భారీగా పంటల దిగుబడులతో తెలంగాణ రా్రష్ట్రం విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ముఖ్యంత్రి కేసిఆర్ వ్యవసాయ రంగ అనుకూల విధానాలతో వినూత్న పంథాలో ముందుకు నడిపిస్తూ తెలగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టారు. ఆచరణ యోగ్యమైన ఈ కార్యాచరణ దేశ వ్యవసాయరంగం నమూనా మార్పునకు దారులు వేస్తోంది.
సిఎం ఆలోచనా విధానాలు, రైతు సంక్షేమ విధానాలు, వ్యవసాయంలో దార్శనిక నిర్ణయాలు, ధాన్యం ఉత్పత్తుల్లో తెలంగాణ కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో అగ్రగామిగ నిలబెట్టాయి. దేశ రైతాంగ సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్రాల ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నాయి. పలు మార్గాలనుండి రా్రష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.40వేలకోట్లు రాకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టింది. రా్రష్ట్రానికి రావాల్సిన ఈ నిధులు ఇవ్వకుండా, ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులను, ఇక్కడి ప్రజలను కష్టాలపాలు చేయాలని చూస్తోంది.
కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధి విషయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా రాజీ పడకుండా రైతులకు ప్రతిసీజన్‌లో రైతుబంధు పథకం నిధులను టంచనుగా విడుదల చేస్తోంది. ఎటువంటి కోతలు లేకుండా, రైతులందరికీ పూర్తి స్థాయిలో, సకాలంలో రైతుబంధునిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆర్ధికశాఖ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలు, వ్యవసాయరంగం పట్ల, రైతుల పట్ల సిఎం కేసిఆర్ పాలనకు, చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.