పొడిగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం
ఫోన్‌లో మంత్రుల అభిప్రాయాల సేకరణ అనంతరం ప్రకటన
ఈ నెల 20వ తేదీ నాటి కేబినెట్ భేటీ రద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అమల్లో వున్న లాక్‌డౌన్‌ను ఈనెల 30 తేదీ వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్‌లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సిఎం ఆదేశించారు. కరోనా నియంత్రణా కార్యక్రమాల్లో వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో బిజీగా వున్నందున ఈ నెల 20న జరుప తలపెట్టిన క్యాబినెట్ సమావేశాన్ని సిఎం రద్దు చేశారు.
కొవిడ్ ఉధృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తూ గత బుధవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ అమలులో ఉన్న రోజులలో ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ నాలుగు గంటలు మినహా ప్రతి రోజు 20 గంటల పాటు లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌తో కొవిడ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
TS Govt Extends Lockdown till May 30