Sunday, November 24, 2024

ఎపి ప్రాజెక్టుపై ఎన్జీటిలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను స్వయంగా తనిఖీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను కోరింది. చెన్నై లోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ధర్మాసనంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సోమవారంనాడు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసింది. 2020అక్టోబర్ 29న పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్దంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని పిటీషన్‌లో తెలిపింది. కేంద్ర పర్యావరణశాఖ, జలశక్తి శాఖ, కృష్ణానది యాజమాన్య బోర్డులనుంచి సరైన అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టును పూర్తిగా నిలుపుదల చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రతిరోజూ 1500మందికూలీలు, భారీ యంత్రాలు, వాహనాలతో పనులు చేస్తున్నట్టు పిటీషన్‌లో పేర్కొంది. ఇదివరకే దాఖలైన మరో పిటీషన్‌లో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ ప్రాంతీయ అధికారులు, కృష్ణా రివర్ బోర్డు అధికారులు ఎత్తిపోతల ప్రాంతాన్ని సందర్శించి, పనులు జరుగుతున్నాయో లేదో నివేదిక ఇవ్వాలని ఎన్జీటి ఆదేశించింది. నివేదిక ఇచ్చేందుకుఅధికారులు ఎత్తిపోతల ప్రాంతాన్ని సందర్శించకుండా ఎపి ప్రభుత్వం అడ్డుకుంటోందని, అందువల్ల ట్రిబ్యునల్ స్వయంగా ప్రాజెక్టును తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ణప్తి చేసింది.

ఇదే అంశంపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన ధిక్కరణ పిటీషన్ కూడా ఎన్జిటిలోనే పెండింగ్‌లో ఉంది. తమ ఆదేశాలకు విరుద్దంగా రాయలసీయ ఎత్తిపోతల పథకం పనులు చేపడితే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు జరుగుతన్నట్టు తేలితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని జైలుకు పంపాల్సివుంటుందని హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు జరపవద్దని ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేపడుతున్నారని శ్రీనివాస్ గతంలో ఎన్టీటిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎపి సిఎస్‌తోపాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జిటి ధర్మాసనం గతంలో కీలక వ్యాఖ్యలు చేసింది.

TS Govt files petition against AP Project in NGT

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News