Tuesday, January 21, 2025

ఫీజులు ఖరారు

- Advertisement -
- Advertisement -

TS Govt finalised fees in Engineering Colleges

ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు
40 కాలేజీల్లో రూ.లక్ష దాటిన ఫీజులు
కనీస ఫీజును రూ.45 వేలకు పెంపు
అత్యధికంగా ఎంజిఐటీలో రూ.1.60 లక్షలుగా ఫీజు
సిబిఐటి, వర్ధమాన్, వాసవి ఇంజినీరింగ్
కాలేజీల్లో రూ. 1.40 లక్షలుగా ఫీజు ఖరారు
మూడేళ్ల వరకు అమలు కానున్న కొత్త ఫీజులు
ఫీజులు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారయ్యాయి. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టిఎఎఫ్‌ఆర్‌సి) సిఫారసుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును రూ.45 వేలకు పెంచారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజు రూ.లక్ష దాటింది. అత్యధికంగా ఎంజిఐటీలో రూ. 1.60 లక్షలు కాగా, సీవీఆర్‌లో రూ. 1.50 లక్షలు, సిబిఐటి, వర్ధమాన్, వాసవి ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ. 1.40 లక్షల చొప్పున పెంచారు. ఇంజనీరింగ్ ఫీజులు మూడేళ్ల క్రితం ఫీజులతో పోల్చితే 10 నుంచి 20 వరకు పెరిగాయి. చాలా కాలేజీల్లో ఫీజులు స్వల్పంగా పెరగగా, కొన్ని కాలేజీల్లో మాత్రం 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో రూ.1.30 లక్షలు ఫీజు ఉండగా, దానిని రూ.1.40 లక్షలకు పెంచారు. అలాగే సిబిఐటిలో గతంలో రూ.1.34 లక్షలు ఫీజు ఉండగా, దానిని రూ.1.40 లక్షలకు పెంచారు. అయితే ఎంజిఐటీలో గతంలో రూ.1.08 లక్షలుగా ఉన్న ఫీజు అత్యధికంగా రూ.1.60 లక్షలకు పెరిగింది. విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో రూ.1.31 లక్షలుగా ఫీజు ఉండగా, దానిని రూ.1.35 లక్షలకు ప్రభుత్వం పెంచింది.
కనీస ఫీజు రూ.45 వేలు
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజు రూ.45 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఇంజనీరింగ్‌కు కనీస ఫీజు రూ.35 వేలు ఉండగా దానిని రూ.45 వేలుగా టిఎఎఫ్‌ఆర్‌సి ఖరారు చేసింది. వరంగల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, స్ప్రింగ్‌ఫీల్డ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే రూ. 45 వేలుగా ఫీజు ఉంది. 50 వేల నుంచి రూ.లక్ష మధ్య ఫీజులు ఉన్న కాలేజీలు అత్యధికంగా ఉన్నాయి. సుమారు 120 కాలేజీల్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించింది.
మూడేళ్ల వరకు అమలు
రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ(టిఎఎఫ్‌ఆర్‌సి) మూడేళ్లకోసారి సవరిస్తుంది. గత మూడేళ్ల క్రితం అమలు చేసిన ఫీజుల కాలపరిమితి 2021-22 విద్యాసంవత్సరంతో ముగిసింది. ఈ నేపథ్యంలో 2022-23 నుంచి 2024-25 వరకు అమలు కానున్న వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారుకు టిఎఎఫ్‌ఆర్‌సి గత జనవరిలో షెడ్యూల్ విడుదల చేసి, కళాశాలల ఆదాయ వ్యయాల నివేదికలను పరిశీలించడంతోపాటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి కమిటీ ఫీజులను ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్ణయించిన ఫీజులు 2024-25 విద్యాసంవత్సరం వరకు అమలులో ఉంటాయని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎం.టెక్‌లో కనీస ఫీజు రూ.57 వేలు
రాష్ట్రంలో ఎం.టెక్ కోర్సులకు కనీస ఫీజును రూ.57 వేలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టిఎఎఫ్‌ఆర్‌సి) సిఫారసుల మేరకు 76 ఎం.టెక్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా సిబిఐటీలో రూ.1,51,600గా ప్రభుత్వం ఫీజును నిర్ణయించింది. అలాగే ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో కనీస వార్షిక ఫీజు రూ. 27 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.
నెలల తరబడి కొనసాగిన ప్రక్రియ
రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారు ప్రక్రియ ఈసారి సుధీర్ఘంగా నెలల తరబడి కొనసాగింది. 2022- – 23 నుంచి 2024 – 25 వరకు అమలు కానున్న వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారుకు టిఎఎఫ్‌ఆర్‌సి గత జనవరిలో షెడ్యూల్ విడుదల చేసి, కళాశాలల ఆదాయ వ్యయాల నివేదికలను పరిశీలించడంతోపాటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. ఆ సందర్భంలో కళాశాలల యాజమాన్యాలు అంగీకరించిన ఫీజులను టిఏఎఫ్‌ఆర్‌సి రిజిస్టర్‌లో నమోదు చేసింది. అయితే కరోనా పరిస్థితులు, ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది పాత ఫీజులను కొనసాగించాలని నిర్ణయించిన టిఎఎఫ్‌ఆర్‌సి ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించింది. ప్రభుత్వం దానిపై తుది నిర్ణయం తీసుకోకముందే..కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పలు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. టిఎఎఫ్‌ఆర్‌సి ఎదుట తాము అంగీకరించిన ఫీజుల వసూలు అనుమతించాలని కోరాయి. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వకపోవడం.. మరోవైపు కౌన్సెలింగ్ ప్రారంభమైనందున.. ప్రవేశాల్లో ఆలస్యం జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. టిఎఎఫ్‌ఆర్‌సి వద్ద అంగీకరించిన ఫీజులను వసూలు చేసేందుకు కాలేజీలకు అనుమతినిచ్చింది. అయితే వసూలు చేసిన ఫీజులు పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడి ఉండాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పాత ఫీజులకు, కొత్త వాటికి మధ్య పెరిగిన సొమ్మును కాలేజీల బ్యాంకు ఖాతాల్లోనే ఉంచాలని.. ఒకవేళ తుది తీర్పు కళాశాలలకు వ్యతిరేకంగా వస్తే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని హైకోర్టు తెలిపింది. దాంతో టిఎఎఫ్‌ఆర్‌సి మరోసారి విచారణ చేపట్టి ఫీజులను ఖరారు చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. టిఎఎఫ్‌ఆర్‌సి ప్రతిపాదనల మేరకు ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రేపటి నుంచి తుది విడత కౌన్సెలింగ్
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటికే రెండు విడతల ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తి కాగా, శుక్రవారం(అక్టోబర్ 21) నుంచి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 21న స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించి, 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 23 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించి, ఈ నెల 26వ తేదీన సీట్లు కేటాయించనున్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు విడతల కౌన్సెలింగ్‌లో ఫీజులపై విద్యార్థులు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొన్నారు.అయితే ప్రస్తుతం ఫీజులు ఖరారైన నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫీజులపై స్పష్టత వచ్చింది.

ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల వివరాలు

మహాత్మాగాందీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ          రూ.1.60 లక్షలు
సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్                      రూ.1.50 లక్షలు
చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ           రూ.1.40 లక్షలు
వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్                       రూ.1.40 లక్షలు
వర్థమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్                    రూ.1.40 లక్షలు
విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  రూ.1.35 లక్షలు
బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ               రూ.1.35 లక్షలు
గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ       రూ.1.30 లక్షలు
శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ                    రూ.1.30 లక్షలు
బివిఆర్‌ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్                  రూ.1.20 లక్షలు

TS Govt finalised fees in Engineering Colleges

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News