Wednesday, December 25, 2024

ఎపి అక్రమ ప్రాజెక్టులు ఆపండి

- Advertisement -
- Advertisement -

హంద్రీ-నీవాలో అక్రమ నిర్మాణాలు గాలేరు-నగరి
ప్రాజెక్టుపై అక్రమాలు బోర్డు అనుమతి లేకుండానే టెండర్లు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదీ జలాలను భారీగా తరలించుకుపోవడానికి అనేక అక్ర మ నిర్మాణాలు చేపడుతూనే ఉంది. ఎపి ప్రభుత్వం చేస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్ని లేఖలు రాసినా ఇటు కృష్ణా రివర్ మెంట్ బోర్డుగానీ, అటు మంత్రిత్వశాఖ గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ఎపి ప్రభుత్వం హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్), గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టుల్లో అక్రమంగా మరికొన్ని నిర్మాణాలను చేపట్టిందని సాక్షాధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖలు రాసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా భంగం కలిగించే విధంగా ఎపి ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను నిలువరించకపోతే తమకు తీరని నష్టం, అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్ -ఇన్- చీఫ్ సి.మురళీధర్ పది పేజీల లేఖను కెఆర్‌ఎంబి, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాశారు. హంద్రీ-నీవా, గాలేరు- నగరి ప్రాజెక్టుల్లో నాలుగు రకాల కొత్త నిర్మాణాలు చేపడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్లను కూడా తెలంగాణ ప్రభుత్వం జత చేసి మరీ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే 40 లేఖలు రాసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు, కెఆర్‌ఎం బోర్డు కూడా పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖాధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం కృష్ణానదిపైన కొత్తగా ప్రాజెక్టును నిర్మించాలన్నా, ఉన్న ప్రాజెక్టుల్లో కొత్త నిర్మాణాలు చేపట్టాలన్నా, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థం పెంచాలన్నా, కాల్వల సామర్ధం పెంచాలన్నా రెండు తెలుగు రాష్ట్రాలు తప్పనిసరిగా కెఆర్‌ఎంబి బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదీగాక కొత్తగా ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నా రెండు తెలుగు రాష్ట్రాలు డి.పి.ఆర్.లు, తగిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు కేంద్ర జల సంఘంలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ (టిఎసి) అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది. అంతకంటే ముందు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి) నుంచి క్లియరెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాతనే టెండర్లు పిలవాలన్నా, ప్రాజెక్టుల్లో నిర్మాణాలు చేపట్టాలన్నా సాధ్యమవుతుందని, కానీ ఏపీ ప్రభుత్వం ఇవేమీ లేకుండానే నేరుగా టెండర్లు పిలిచి ప్రాజెక్టుల్లో అదనపు నిర్మాణాలు చేపట్టడం ముమ్మాటికీ అక్రమమేనని, అందుకే మళ్లీ లేఖలు రాయాల్సి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖాధికారులు వివరించారు. ఎపి ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని ఉరవకొండ మండలంలోని పెద్దకౌకుంట్ల, రాకెట్ల, అమిడ్యాల గ్రామాల్లో 8000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలుగా హంద్రీ-నీవా ప్రాజెక్టులో అదనంగా జరుగుతున్న నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని ఆ లేఖలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ -ఇన్-చీఫ్ మురళీధర్ పేర్కొన్నారు. అంతేగాక మడకశిర నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జలాలతో నింపేందుకు బ్రాంచి కెనాల్ నుంచి కొత్తగా బైపాస్ కాల్వను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచింది.

కానీ ఈ నిర్మాణాలకు కూడా ఎలాంటి అనుమతులు లేవని, కనీసం బోర్డుకు, తెలంగాణ రాష్ట్రానికి సమాచారం కూడా ఇవ్వలేదని ఆ అధికారులు వివరించారు. గండికోట ప్రాజెక్టు ప్ర ధాన కాల్వకు ఒక క్రాస్ రెగ్యులేటర్‌ను నిర్మించాలని ఎపి ప్రభుత్వం టెం డర్లు పిలిచింది. దీనికీ బోర్డు నుంచి క్లియరెన్స్‌లు లేవని తెలిపారు. హంద్రీ-నీవా ప్రాజెక్టులోని కాలిబండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు అనుసంధానంగా అన్నమయ్య జిల్లా చిన్నమందెడం మండలంలోని బేస్తపల్లి వద్ద ఒక జలాశయాన్ని నిర్మిండానికి ఎపి ప్రభుత్వం టెండర్లు పిలిచిందని వివరించారు. ఇందులో ఒక్క అదనపు నిర్మాణాలకు కెఆర్‌ఎం బోర్డు నుంచిగానీ, కేంద్ర జల సంఘం (సిడబ్లుసి) నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేవని, అందుచేతనే ఈ అక్రమ నిర్మాణాలను నిలిపివేయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

అంతేగాక ఈ నిర్మాణాలన్నీ కృష్ణానది ఆయకట్టు భూముల్లో కూడా కాదని, పెన్నా బేసిన్ పరిధిలోని భూభాగానికి కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని, వాటిని వెంటనే నిలిపివేయించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కెఆర్‌ఎం బోర్డుకు రాసిన లేఖలో పేర్కొం ది. ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోతే తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం, అన్యాయం జరుగుతాయని ఆ అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News