మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామానికో రెవెన్యూ అధికారి నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం సిసిఎల్‌ఎ కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేత దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. దీంతో ఆయా గ్రామాల్లో క్వాలిఫైడ్ విఆర్‌ఒ, విఆర్‌ఎలు నుంచి డేటా సేకరణ ప్రారంభిస్తున్నట్లు సదరు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ నెల 28వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రభుత్వ నిర్ణయం పట్ల టిజిఆర్‌ఎస్‌ఎ హర్షం
భూభారతి చట్టంలో భాగంగా రాష్ట్రంలో గ్రామానికో రెవెన్యూ అధికారి రానున్నారని తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టిజిఆర్‌ఎస్‌ఎ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం పేర్కొన్నారు. అందులో భాగంగానే వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న పూర్వ విఆర్‌ఒ, విఆర్‌ఎల నుంచి ఆప్షన్లను కోరుతూ సిసిఎల్‌ఎ ఉత్తర్వులు జారీ చేశరాన్నరు. ఇదంతా కూడా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి కృషి ఫలితంగానే సాధ్యమైందన్నారు.
ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలిపారు. మొదట్నించీ పూర్వ విఆర్‌ఒ, విఆర్‌ఎలను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని టిజిఆర్‌ఎస్‌ఎ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వీరి రాకతో రెవెన్యూ వ్యవస్థ బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రెవెన్యూ ఉద్యోగులపై భారం కూడా తగ్గుతుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా తెలిపారు.