మనతెలంగాణ/హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం హైదరాబాద్ ఒపెన్ స్ప్రింట్స్, రిలే అథ్లెటిక్స్ ఛాంపియన్స్ షిప్స్-2021ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ చొరవతో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మించేందుకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహాకాలను అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బికాశ్ కారర్, ప్రెసిడెంట్ చంద్రాదుత్ జోషి, కార్యదర్శి రాజేష్‌కుమార్, ఒలంపియన్ శోభ, కోచ్‌లు, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.
TS Govt gives priority to develop games: Srinivas Goud