Monday, December 23, 2024

బోనాల ఉత్సవాల ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

TS govt giving financial aid bonalu festival 2022

చెక్‌ల పంపిణీ చేసిన మంత్రులు తలసాని , మహమూద్ అలీ
ఒకేరోజు 530 ఆలయాలకు రూ.1.90 కోట్ల ఆర్ధిక సహాయం

హైదరాబాద్: బోనాల ఉత్సవాలకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆలయాలన్నా తేడా లేకుండా ఆర్ధిక సహాయం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనెల 24న బోనాలు జరగనున్న పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లోని 309 ఆలయాలకు రూ.1.3 కోట్ల విలువైన బోనాల చెక్కులను బుధవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని 119 దేవాలయాలకు గాను గుడి మల్కాపూర్ లో గల జాంసింగ్ బాలాజీ దేవాలయం వద్ద రూ. 47 లక్షలు నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని 50 దేవాలయాలకు రూ.18 లక్షల విలువైన చెక్కులను హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ చీఫ్ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు లతో కలిసి మంత్రి తలసాని ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని 72 దేవాలయాలకు రూ.22 లక్షలు, మలక్ పేట డివిజన్ లోని 68 దేవాలయాలకు రూ.16 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే రాజాసింగ్ తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు రూ.15 కోట్ల రూపాయలు విడుదల చేయగా, 3500 కు పైగా దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో బోనాల తర్వాత ఆర్ధిక సహాయం చెక్కులను అందించడం జరిగిందని, ఈ సంవత్సరం ముందుగానే చెక్కులను అందిస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, పలువురు కార్పొరేటర్ లు పాల్గొన్నారు.

బోనాల ఏర్పాట్లు బేష్:  బిజెపి కార్పొరేటర్ శంకర్ యాదవ్
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉందని, అలాంటి ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేయడం పట్ల బిజెపికి చెందిన బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ ప్రశంసించారు. బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ లు వివిధ దేవాలయాలకు బోనాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ గతంలో బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రజల నుండి విరాళాలు వసూలు సేకరించాల్సి వచ్చేందని అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే ఆర్ధిక సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవాలకు ముందే ఆర్ధిక సహాయం చెక్కులను పంపిణీ చేసేలా చొరవ చూపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శంకర్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News