ఆదాయ పరిమితి రూ.8లక్షలు
ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ వర్తించనుంది. మైనార్టీ కాలేజీల్లో మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ రిజర్వేషన్ అమలు కానున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రూ. 8 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తిస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆదాయ ధ్రువపత్రం ఆధారంగా రిజర్వేషన్ అర్హతను గుర్తించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బిసి రిజర్వేషన్లు వర్తించని వారికి ఇకపై ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో వేతనం, వ్యవసాయం, వ్యాపారం ఇలా అన్ని రకాలుగా వచ్చిన ఆదాయాన్ని ఈ ధ్రువపత్రం కోసం పరిగణలోకి తీసుకుంటారు.
తహసీల్దార్‌కు ఈ ధ్రువపత్రం కోసం దరఖా స్తు చేసుకున్నప్పుడు అన్ని పత్రా లు పరిశీలించి దీనిని జారీ చేస్తా రు. ధ్రువపత్రం తప్పుగా తేలితే సర్వీసు రద్దుతో పాటు చట్టపరమై న చర్యలుంటాయని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇడబ్ల్యూఎస్
కోటాలో భర్తీ కాకపోతే తదుపరి ఏడాదికి ఖాళీలు బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణకు అనుగుణంగా రాష్ట్రంలోనూ ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
మహిళలకు 33.33 శాతం కోటా
ఈడబ్ల్యూఎస్ నియామకాల్లోనూ మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బిసి తరహాలోనే ఉద్యోగ నియామకాల్లో వయోపరిమితి సడలింపు ఐదేళ్ల పాటు ఉంటుందని ఈ మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ నియామకాల్లోనూ మహిళలకు మూడోవంతు కోటా ఉండనుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి తరహాలో పరీక్ష రుసుముల్లో మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ కోటాకు అనుగుణంగా విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను పెంచనున్నారు. రిజర్వేషన్ల కోసం సబార్డినేట్ సర్వీసు నిబంధనలకు సవరణ చేశారు. నియామకాల్లో రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఉత్తర్వులు జారీచేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.