Monday, December 23, 2024

ఎంఎల్‌ఎ పైలెట్ రోహిత్‌రెడ్డికి భద్రత పెంపు..

- Advertisement -
- Advertisement -

Four plus four security for Rohit Reddy

మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో కీలకంగా ఉన్న తాండూరు ఎంఎల్‌ఎ పైలెట్ రోహిత్ రెడ్డి భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోహిత్‌రెడ్డికి 4+4 గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పైలెట్ రోహిత్‌రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా కేటాయించింది. మెయినాబాద్ ఫాంహౌజ్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోహిత్‌రెడ్డికి 2 + 2 భద్రతను కలిగి ఉన్నారు. ఈ కేసులో రోహిత్‌రెడ్డి మాట్లాడిన ఆడియో కాల్స్ లీక్ కావటం కలకలం రేపుతున్నాయి. ఆయనకు ఎలాంటి హానీ కలగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా భద్రతను పెంచినట్లు తెలుస్తోంది.

శుక్రవారం విడుదలైన ఆడియో కాల్స్‌లో అమిత్‌షా, బిఎల్ సంతోష్‌ల పేర్లు బయటపడటంతో దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. టిఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయించేలా ప్రయత్నాలు జరిగాయనే వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎంఎల్‌ఎల ఫిర్యాదుతోనే తాము ఈ యత్నాలను భగ్నం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కొల్లాపూర్ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎంఎల్‌ఎ రేగా కాంతారావు, అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాలరాజు, తాండూరు ఎంఎల్‌ఎ పైలెట్ రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఇందుకు సంబంధించి ఫరీదాబాద్‌కు చెందిన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్ర భారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక, తాజాగా ఈ ఘటనలో నిందితులలో పైలెట్ రోహిత్‌రెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్న ఫోన్ సంభాషణల ఆడియోలు రెండు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే ఈ ఆడియోలనను ఇప్పటివరకు పోలీసులు ధ్రువీకరించలేదు. అయితే ఆ ఆడియోలలో ఆర్థిక లావాదేవీలు, రోహిత్‌రెడ్డితో పాటు ఎంత మంది వస్తారనే అంశాలపై చర్చ సాగింది. ఇద్దరు ఎంఎల్‌ఎల పేర్లు చెప్పాలని రామచంద్ర భారతి చెప్పినట్లుగా ఆడియో సంభాషణలో ఉంది. తన వద్ద నందకుమార్ ఈ అంశం ప్రతిపాదించినట్లుగా రోహిత్ చెప్పారు. సమావేశానికి హైదరాబాద్ మంచి ప్లేస్ అని రోహిత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల నిఘా ఉందని రోహిత్‌రెడ్డి రామచంద్ర భారతికి చెప్పారు. తనతో పాటు ముగ్గురు ఎంఎల్‌ఎలు రెడీగా ఉన్నారని రోహిత్‌రెడ్డి రామచంద్రభారతితో అన్నట్లుగా ఆడియోలో ఉంది.

TS Govt Increased Security of MLA Rohit Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News