హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గి, సాధారణ పరిస్థితులు తలెత్తే వరకు మళ్లీ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించే ప్రతిపాదనలపై ప్రభుత్వ వర్గాలు చర్చిస్తున్నట్లు తెలిసింది. అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం ఈనెల 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించగా, ఈనెల 17న విద్యాసంస్థలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు కొవిడ్ ఆంక్షలు ప్రభుత్వం పొడిగించింది. కొవిడ్ పరిస్థితులు సమీక్షించి త్వరలోనే విద్యాసంస్థల సెలవుల పొడిగింపు లేదా ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం. కొవిడ్ నియంత్రణకు వివిధ రాష్ట్రాల్లో తీసుకున్న చర్యలపై విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
కొవిడ్ కేసుల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నత పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులకు అనుమతిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్ష బోధన కన్నా ఆన్‌లైన్ తరగతులే శ్రేయస్కరమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. విద్యాసంస్థల్లో భౌతికదూరం, ఇతర కొవిడ్ నిబంధనల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ఒకరిద్దరు విద్యార్థలకు కొవిడ్ సోకినా చాలామంది వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున కొవిడ్ కేసులు తగ్గే వరకు ఆన్‌లైన్ బోధననే నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే సోమవారం విద్యాసంస్థలు పునఃప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో శుక్రవారం లేదా శనివారం విద్యాసంస్థల సెలవులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.