Friday, November 22, 2024

ఎలక్ట్రికల్ వాహనాలకు మహర్ధశ

- Advertisement -
- Advertisement -

TS govt is promoting use of Electric Vehicles

రాష్ట్రంలో ప్రతినెలా 2 వేల వాహనాల విక్రయం
మరిన్ని ఛార్జీంగ్ స్టేషన్‌ల ఏర్పాటుకు
ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టిఎస్ రెడ్కో

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం గత సంవత్సరం ఈవీ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీలో భాగంగా రోడ్డు ట్యాక్స్ లేకుండా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో ప్రజలు వీటి కొనుగోలుపై ఆసక్తి చూపుతుండడంతో పాటు ప్రతినెలా 2 వేలపైగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు జరుగుతున్నాయి.

దీంతో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టిఎస్ రెడ్కో) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నోడల్ ఏజెన్సీగా ఉంటూ తొలి దశలో లక్షమంది ప్రభుత్వ ఉద్యోగులకు నెల వాయిదాల సౌకర్యంతో ద్విచక్ర వాహనాలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతిస్తే పెద్దసంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపైకి వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 500 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రానిక్ ఆటోలుగా మార్చగా, టు వీలర్ లను కూడా త్వరలో ఇలాంటి పద్ధతిలోనే మార్చేందుకు టిఎస్ రెడ్కో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే 4 వేల వాహనాలు రోడ్లపైకి

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన విధానం వచ్చిన తర్వాత 4 వేలపైగా వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుపై ఇప్పటికే టిఎస్ రెడ్కో దృష్టిసారించింది. ప్రతి పెట్రోల్ బంకులో ఒక స్టేషన్ ఉండేలా ప్రణాళికలు వేస్తోంది. 3 కిలోమీటర్లకు ఒక స్టేషన్, జాతీయ రహదారులపై 25 కిలో మీటర్లకు ఒక స్టేషన్‌ను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 70 ప్రాంతాల్లో చార్జీంగ్ స్టేషన్లు ఉండగా మరో 118 స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలు సేకరించడానికి అధికారులు సన్నద్ధమయ్యారు.

కాగా, 15 యాంప్స్ త్రీ పిన్ ప్లగ్‌తో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్ వాడకం పెరిగి శ్లాబ్ మారుతుందని భావిస్తే అపార్ట్‌మెంట్లు, ఇళ్లలో విద్యుత్ శాఖ నుంచి చార్జీంగ్ పాయింట్ల కోసం ప్రత్యేకంగా 7.5 కిలోవాట్‌తో కనెక్షన్ తీసుకొని మీటర్ బిగించుకునేలా ఏర్పాట్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ సామర్థ్యం తదితర అంశాల ఆధారంగా చూస్తే సగటున 2 గంటల చార్జీంగ్‌తో 50 నుంచి 120 వరకు కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉందని టిఎస్ రెడ్కో అధికారులు పేర్కొంటున్నారు.

చార్జీంగ్ స్టేషన్లలో యూనిట్‌కు 6 రూపాయలు

టిఎస్‌ఎస్పీడిసిఎల్ ఎలక్ట్రికల్ చార్జీంగ్ స్టేషన్లలో యూనిట్‌కు 6 రూపాయలను చార్జీ చేస్తోంది. ప్రైవేట్ కంపెనీల స్టేషన్లలో అయితే 18 నుంచి 20 రూపాయలు వరకు తీసుకుంటున్నారు. ఎసి పవర్ స్టేషన్‌లో ఒక్కో వాహనానికి 6-నుంచి 8 గంటలు పడితే, ఫాస్ట్ చార్జీంగ్ స్టేషన్‌లో గంటన్నరలో పూర్తి చార్జీంగ్ అవుతుంది. ఎలక్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికిల్ పథకం కింద కేంద్రం కార్లు, ద్విచక్రవాహనాలకు రాయితీలిస్తోంది. 15 లక్షల కంటే తక్కువ ధర కార్లకు కిలోవాట్ బ్యాటరీ సామర్ధ్యానికి రూ.10 వేలు, ద్విచక్ర వాహనాలకు కిలోవాట్‌కు రూ.15 వేల వరకు రాయితీ కల్పిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తోంది. దీంతో 2 కిలోవాట్ సామర్ధ్యం కలిగిన వాహనంపై 30 వేల వరకు రాయితీ పొందే అవకాశాలున్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 1.18 లక్షల ఈవీల అమ్మకం

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) కొనుగోలుకు ఇటీవల కాలంలో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం సైతం పలు రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన కొత్త కార్లలో 26 శాతం ఈవీలేనని గణాంకాలు తెలుపుతున్నాయి. 2021 చివరికల్లా మొత్తం 50 లక్షల ఈవీలను విక్రయించే అవకాశం ఉందని మార్గెట్ వర్గాల అంచనా. 2021-,22 ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలోనే భారత్‌లో 1.18 లక్షల ఈవీలు అమ్ముడుపోగా, అంతకు ముందు సంవత్సరం మొత్తంలో విక్రయించినవి 1.48 లక్షలు. ప్రస్తుతం మైక్రో చిప్‌ల కొరత ఉండడంతో ఈవీల విక్రయాలు తగ్గయని మార్గెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఐఓసీ ఆధ్వర్యంలో 10,000 స్టేషన్లు

భారత్‌లో రాగల మూడు, నాలుగేళ్లలో ఈవీల కోసం 20,000 ఛార్జీంగ్ స్టేషన్లను నెలకొల్పుతామని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. వీటిలో 10,000 స్టేషన్లను ఒక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషనే (ఐఓసీ) నెలకొల్పనుంది. ఈవీల వినియోగం పెరిగితే సంప్రదాయ మోటారు వాహనాలు వెదజల్లే కర్బన ఉద్గారాలు నిలిచిపోవడంతో వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

జానయ్య, టిఎస్ రెడ్కో ఎండి

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 500 ఛార్జీంగ్ స్టేషన్లు

త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 500 ఛార్జీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు రెడ్కో కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే జాతీయ రహదారులపై ప్రతి 25 కిలోమీటర్లకు ఒక ఛార్జీంగ్ స్టేషన్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రాగానే టెండర్లు పిలవాలని రెడ్కో భావిస్తుంది. ఇప్పటివరకు ద్విచక్ర వాహనాలతో పాటు అరకొర ఇతర వాహనాల ఛార్జీంగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు వేలాదిగా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు రవాణా శాఖతో పాటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News